తమిళ హీరో అభిశరవణన్‌పై సినీ నటి అతిథిమీనన్ ఫిర్యాదు చేసింది. ప్రేమించుకుని డేటింగ్ చేశామనీ, ఆ తర్వాత రిజిస్ట్రేషన్ పెళ్లి పేరుతో నకిలీ పత్రాలపై సంతకాలు చేసుకుని తనను మోసం చేశాడని ఆరోపించింది. ఇదే అంశంపై ఆమె చెన్నై పోలీసులకు ఫిర్యాదు చేసింది.
అయితే, తాను నటించిన తొలి చిత్రం ద్వారా మదురైకు చెందిన శరవణ కుమార్ అనే వ్యక్తి అభిశరవణన్‌గా తన పేరును మార్చుకుని హీరోగా నటించాడని పేర్కొంది. ఆ చిత్ర షూటింగ్ సమయంలో తామిద్దరం ప్రేమించుకున్నామని చెప్పింది. తనను పెళ్ళి చేసుకుంటానని నమ్మించాడని, ఆ తర్వాత నకిలీ రిజిస్టర్ పెళ్లి పత్రాల్లో తన చేత సంతకం చేయించాడని చెప్పింది.
ఆ పిమ్మట అభిశరవణన్ ప్రవర్తనలో మార్పు రావడంతో తాను అతని నుంచి దూరమైనట్టు చెప్పింది. ఈ క్రమంలో తమను ఒక్కటిగా చేర్చాలని కోరుతూ అభిశరవణన్ మదురై కుటుంబ సంక్షేమ కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడని చెప్పింది. నిజానికి తాను ఏ రిజిస్టర్ కార్యాలయానికి వెళ్లి పెళ్లి ధ్రువీకరణ పత్రాలపై సంతకాలు చేయలేదని తెలిపింది.
అలాంటిది అభిశరవణన్ నకిలీ పెళ్లి ధ్రువపత్రాలను, తాను అతనితో దిగిన ఫొటోలను వాట్సాప్‌లో పోస్ట్ చేసి దుష్ప్రచారం చేస్తున్నాడని తెలిపింది. ఈ వ్యవహారంలో అతను, అతని అనుచరులపై తగిన చర్యలు తీసుకోవలసిందిగా కోరింది. దీనిపై స్థానిక వెప్పేరి పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.