పవన్ కల్యాణ్ ఆవిష్కరించిన పాన్ ఇండియా ఫిల్మ్ 'గమనం' ట్రైలర్
బుధవారం, 11 నవంబరు 2020 (20:33 IST)
సుజనా రావు దర్శకురాలిగా పరిచయమవుతున్న 'గమనం' చిత్రం రియల్ లైఫ్ డ్రామాగా రూపొందుతోంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో పాన్ ఇండియా ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా తయారవుతోంది. పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ బుధవారం తెలుగు వెర్షన్ ట్రైలర్‌ను లాంచ్ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, "సుజనా రావు గారు దర్శకత్వంలో రూపొందిన 'గమనం' చిత్రం ట్రైలర్ చూశాను... సృజనాత్మకంగా, ఆకట్టుకునేలా ఉంది. ఆమె ప్రయత్నం అభినందనీయం. మొదటిసారి దర్శకత్వం వహించినా.. సుజనా రావు గారు సున్నితమైన అంశాన్ని ఆసక్తికరంగా తీర్చిదిద్దారు. అందరూ ఈ చిత్రాన్ని చూడాలని కోరుతున్నాను. ఆమెకు ఈ చిత్రం రూపొందించే అవకాశం ఇచ్చిన నిర్మాతలకు, ఛాయాగ్రాహకుడు జ్ఞానశేఖర్ గారికి నా అభినందనలు" అన్నారు.
మలయాళం, కన్నడ, హిందీ, తమిళ వెర్షన్ల ట్రైలర్లను వరుసగా ఫహాద్ ఫాజిల్, శివకుమార్, సోనూ సూద్, జయం రవి విడుదల చేశారు. 'గమనం' అనేది మూడు కథల సమాహారం అని ట్రైలర్‌ను చూస్తే అర్థమవుతుంది. ఒక కథ శ్రియా శరన్ పోషించిన ఒక దిగువ మధ్యతరగతి గృహిణి పాత్ర ప్రధానంగా నడిస్తే, మరో కథ శివ కందుకూరి, ప్రియాంక జవాల్కర్ మధ్య ప్రేమ చుట్టూ సాగుతుంది. ఇంకో కథలో తామెప్పుడు పుట్టారో కూడా తెలీని ఇద్దరు అనాథ బాలలు తమ బర్త్‌డే జరుపుకోవాలని కనే కలను చూడొచ్చు.
అనేక ఆటంకాలు ఎదురవుతున్నప్పటికీ భారత క్రికెట్ జట్టుకు ఆడాలని కలలుకనే ఔత్సాహిక క్రికెటర్‌గా శివ కందుకూరి, పెద్ద కలలు కనొద్దని అతడిని హెచ్చరించే ప్రియురాలిగా ప్రియాంక నటిస్తున్నారు. ఒక చిన్న బిడ్డకు తల్లిగా, మూగ యువతిగా కనిపించే శ్రియా శరన్, ఉద్యోగం కోసం దుబాయ్ వెళ్లిన భర్త ఎప్పుడు ఇండియాకు తిరిగొస్తాడా అని ఎదురుచూస్తుంటుంది. కానీ ఆమెకు తెలీని విషయం.. ఆ భర్త దుబాయ్‌లో మరో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడనీ, ఇంటికి తిరిగొచ్చే ఉద్దేశం అతనికి లేదనీ.
ఇక గుండెల్ని మెలిపెట్టే మరో కథ తమ బర్త్‌డేని సెలబ్రేట్ చేసుకోవాలని కలలు కనే ఇద్దరు అనాథ బాలలది. సిటీలో వచ్చిన వరదలు ఈ మూడు కథలకు చివరి మలుపునిస్తాయి. సింగర్‌గా ప్రత్యేక పాత్రను చేసిన నిత్యా మీనన్ సైతం ట్రైలర్‌లో కనిపించారు. పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ చెప్పినట్లుగా సుజనా రావు ప్రేక్షకులను ఎమోషన్‌కు గురిచేసే అత్యంత ఆసక్తికరమైన, సున్నితమైన సబ్జెక్ట్‌తో మన ముందుకు వస్తున్నారు. ప్రతి కథా హృదయాన్ని స్పృశించే ఎమోషన్స్‌తో ఆకట్టుకుంటుంది. ప్రతి పాత్రతోనూ మనం సహానుభూతిని పొందే విధంగా సుజనా రావు గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లేతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.
శ్రియా శరన్, శివ కందుకూరి, ప్రియాంక జవాల్కర్, ఇతర ఆర్టిస్టులు తమ పాత్రలను అద్భుతంగా పోషించగా, తమ సూపర్బ్ వర్క్‌తో టెక్నికల్ టీమ్ ఈ మూవీని మరో స్థాయిలో నిలబెట్టింది. ప్రముఖ రచయిత సాయిమాధవ్ బుర్రా సంభాషణలు రాస్తున్న ఈ చిత్రానికి మేస్ట్రో ఇళయారాజా సంగీత స్వరాలు అందిస్తున్నారు. వి.ఎస్. జ్ఞానశేఖర్ ఒకవైపు సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తూనే, రమేష్ కరుటూరి, వెంకీ పుషడపు లతో కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రధాన పాత్రధారులకు సంబంధించి ఇదివరకు విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్లకు అన్ని వైపుల నుండీ అనూహ్యమైన రెస్పాన్స్ లభించింది.
తారాగణం:
శ్రియా శరన్, నిత్యా మీనన్, శివ కందుకూరి, ప్రియాంక జవాల్కర్