పవన్ కళ్యాణ్ మాత్రం రోడ్డు మీద అడుక్కుతినాలా? ఎవరు?
బుధవారం, 28 నవంబరు 2018 (17:22 IST)
రాజకీయాల్లోకి వస్తున్నప్పుడు ఓ ఛానలో, పేపరో ఉండాలని చాలామంది చెప్పారు. కానీ నా దగ్గర అంత డబ్బు లేదు. పైగా చానల్ నిర్వహణ అంత తేలిక విషయం కాదు అని చెప్పారు పవన్ కల్యాణ్. ఇంకా ఆయన మాట్లాడుతూ... నా మీద వార్తలు రాసేవారు అది నిజమా.? కాదా.? అన్న విషయం కూడా నన్ను అడగరు. నేను సినిమాలు వదిలేశా. సినిమా ప్రొడక్షన్ పెట్టడానికి కారణం నాకంటూ ఓ వ్యాపారం ఉండాలన్నదే.
సినిమాల్లో చేసే నాటి నుంచి నాకు పెద్దగా కవరేజ్ ఇచ్చేవారు కాదు. భవిష్యత్తులో ఇబ్బందిపెడతానన్న భయం కావచ్చు. ఇలాంటి వార్తలు రాయడం వెనుక ఉద్దేశం, ప్రజల్లో గందరగోళం సృష్టించడమే. చంద్రబాబు గారు హెరిటేజ్ పెట్టుకోవచ్చు, జగన్మోహన్‌రెడ్డి భారతీ సిమెంట్ పెట్టుకోవచ్చు, పవన్ కళ్యాణ్ మాత్రం రోడ్డు మీద అడుక్కుతినాలా? నాకు పేపర్లు అవసరం లేదు. మీరే నా మీడియా. నా అభిమానులు చంద్రబాబు ఆఫీస్‌లోనూ ఉన్నారు.
కోనసీమలో ఉన్న ఆరోగ్య సమస్యలు, పారిశుధ్య వ్యవస్థ సరవ్వాలంటే టీడీపీ, వైసీపీని పక్కనపెట్టి జనసేన ప్రభుత్వం ఏర్పాటు చేయాలి. అలా జరగాలంటే ప్రజల్లో చర్చ రావాలి. చర్చ మొదలైనప్పుడే ప్రభుత్వానికి భయం వస్తుంది. దళితుల్లో అత్యంత వెనుకబడిన కులంలో ఆత్మగౌరవం నింపడానికి ఏం చేయాలో తెలియలేదు. ఆ ఆడపడుచు కన్నీరు తుడవడానికి ఏం చేయాలో అర్ధం కాలేదు. ఆ సమయంలో నేను మనస్ఫూర్తిగా రెల్లి కులాన్ని స్వీకరించా. అలా అయినా వారి బాధను తగ్గించగలనని భావించా.
రెల్లి కులస్థులు జనం రోడ్ల మీద వేసే చెత్తని ఊడ్చేస్తే, రాజకీయాల్లో చెత్తని ఉడ్చేందుకు నేను రెల్లి కులాన్ని స్వీకరించాను. జనసేన తరపున గెలిచిన ఎమ్మెల్యేలు అమ్ముడుపోతే నేను జగన్‌లా రోడ్లు పట్టుకు తిరగను, ఒక్కడినే అసెంబ్లీకి వెళ్లి కూర్చుంటా. జనసేన టిక్కెట్ మీద పోటీ చేసి గెలిచి వేరే పార్టీకి వెళ్తామంటే ఊరకుంటామా.? రాజీనామా చేయించి మళ్లీ పోటీ చేసేవరకు వదిలిపెట్టన”ని హెచ్చరించారు.
అంతకుముందు విద్యార్ధులని ఉద్దేశించి పవన్‌కళ్యాణ్ మాట్లాడుతూ… సమాజానికి పనికొచ్చే వారు ఎప్పుడూ నిస్వార్ధంగా ఉంటారు. థామస్ అల్వా ఎడిసన్ లాంటి వారు రెగ్యులర్ స్కూళ్లలో చదువుకోలేదు. మేధావులు ఎక్కడో పుట్టరు. జ్ఞానం అంటే శ్రమ పడడమే. ఓపికతో శ్రమపడినకొద్దీ జ్ఞాన జ్యోతి వెలుగుతుంది. ప్రైవేటు, కార్పొరేట్ కాలేజీలు విద్యార్ధుల జీవితాల్ని పుస్తకాలకే పరిమితం చేస్తున్నాయి.నారాయణ, చైతన్య లాంటి సంస్థలు 24 గంటలు గదుల్లో బంధించి చదువు, చదువు అంటే జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది. క్రీడలు, ఇతర యాక్టివిటీస్‌ని కూడా ప్రోత్సహించాలి. బలమైన శరీరం లేనప్పుడు బలమైన ఆలోచనలు ఎక్కడి నుంచి వస్తాయి.
చైతన్యం ఎక్కడి నుంచి వస్తుంది. ఆ కళాశాలలు ఉద్యోగులని తయారుచేసే పరిశ్రమల్లా మారిపోయాయి. విద్యాలయాలు విజ్ఞానవంతుల్ని తయారుచేయడం లేదు. చదువు కోసం పూర్తిగా లెక్చరర్స్ మీద ఆధారపడకండి. ఎడ్యుకేషన్ అంటే కాన్సెప్ట్‌ని అర్ధం చేసుకోవడం, బట్టీపట్టడం కాదు. స్కూల్ స్థాయిలోనే బీసీ హాస్టల్స్, ఎస్సీ హాస్టల్స్ అంటూ కులాల్ని ఎందుకు విడదీస్తారు.? కామన్ హాస్టల్స్, స్కూల్స్ పెట్టాలి. మాటలకి అన్ని కులాలు ఒకటేనని చెబుతారు, చేతలేమో విభజించు పాలించు అన్న చందంగా ఉంటాయి. నేను మాత్రం ఆచరణ సాధ్యం కాని మాటలు మాట్లాడను. నేను ఏదైనా కష్టపడి సాధించాలనుకుంటా. అడ్డదారులు తొక్కరాదని చిన్న వయసులోనే నిర్ణయించుకున్నా.
అడ్డదారులు తొక్కి వేల కోట్లు సంపాదిస్తే జైలుకి వెళ్తారు. ధర్మాన్ని నేను ఓ సైంటిఫిక్ రీజన్‌తో చూస్తాను. ధర్మం ఎలా వుంటుందంటే మనం ఏం చేస్తే అది తిరిగి వచ్చేస్తుంది. రాజకీయాల్లో అంతా తప్పించుకోగలం అంటారు. కానీ ఎవ్వరూ ఏదీ తప్పించుకోలేరు. నేను రాజకీయాల్లోకి ఎందుకు ఇంత తపన పడి వచ్చానంటే. నాకు పెద్దగా కోరికలు లేవు. సమాజానికి నష్టం జరుగుతున్నప్పుడు నాలాంటి వ్యక్తి ఊరుకుంటే ఎలా? అనిపించింది. నేను నిర్ణయం తీసుకోకుంటే భావితరాలు ఏమైపోతాయో అనిపించింది. అంబేద్కర్ విగ్రహానికి దండలు వేస్తారు గానీ ఆయన స్ఫూర్తిని మాత్రం ఎవ్వరూ పాటించరు. జనసేన పార్టీ మాత్రం తక్కువ మాట్లాడి ఎక్కువ చేస్తుందని తెలిపారు.