సికింద్రాబాద్ చర్చిలో పవన్ కళ్యాణ్ ప్రార్థనలు

ఆదివారం, 21 జనవరి 2018 (11:27 IST)
జనసేన అధినేత పవన్ కల్యాణ్ సికింద్రాబాద్‌లోని సెయింట్ మేరీస్ చర్చిలో ఆదివారం ప్రార్థలు చేశారు. పోలాండ్ అంబాసిడర్ ఆడమ్ బురాకోవస్కీతో కలసి ఆయన ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఉదయం 7 గంటలకే ఆయన తన భార్య అన్నాతో కలిసి చర్చికి వెళ్లారు. తన రాజకీయ యాత్ర ప్రారంభానికి ముందు సర్వమత ప్రార్థనలు చేస్తానని పవన్ వెల్లడించిన సంగతి తెలిసిందే. అనంతరం ఆడమ్ బురాకోవస్కీతో పవన్ కల్యాణ్ జనసేన పార్టీ కార్యాలయంలో భేటీ అయ్యారు. ఆయనకు పవన్ దంపతులు సాదర స్వాగతం పలికారు. ఈ సమావేశం సందర్భంగా వీరిరువురూ పలు విషయాలపై చర్చించారు.
 
అంతకుముందు శనివారం 'మీ ముందుకు వస్తున్నా ఆశీర్వదించండి' అంటూ సినీనటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక ప్రకటన చేశారు. 'నా అప్రహిత రాజకీయ యాత్రను తెలుగునేలపై పుణ్యస్థలమైన కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయం నుంచి ప్రారంభించనున్నాను. 2009 ఎన్నికలకు ప్రచారం చేస్తోన్న తరుణంలో సంభవించిన పెను ప్రమాదం నుంచి నేను ఇక్కడే క్షేమంగా బయటపడ్డాను. దానికితోడు మా కుటుంబ ఇలవేల్పు ఆంజనేయ స్వామి కావడం కూడా ఇక్కడ నుంచి నా నిరంతర రాజకీయ యాత్రను ఆరంభించడానికి కారణభూతమైంది.
 
సర్వమత ప్రార్థనల అనంతరం రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల ఆశీస్సుల కోసం, సమస్యలను అధ్యయనం చేసి అవగాహన చేసుకోవడానికి ఈ యాత్ర ద్వారా మీ ముందుకు వస్తున్నాను. నా పర్యటన ప్రణాళికను కొండగట్టులో ప్రకటిస్తాను' అని పవన్ కల్యాణ్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. అంతేకాదు, కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయం అంటూ ఆ దేవాలయ ఫొటోను కూడా పవన్ కల్యాణ్ పోస్ట్ చేయడం విశేషం. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు