రజినీ స్థాయిని అందుకోని కాలా.. ఎలాగంటే..?

శనివారం, 9 జూన్ 2018 (19:50 IST)
ఎన్నో వివాదాల నడుమ, కోర్టుల జోక్యంతో, మరెన్నో అంచనాలతో విడుదలైన కాలా సూపర్ స్టార్ రజనీకాంత్ స్థాయిని అందుకోలేకపోయింది. రజనీ హీరోయిజాన్ని పూర్తిస్థాయిలో తెరపైకి తేలేకపోయారు దర్శకుడు. ముంబయి లోని ధారావి అనే మురికివాడ నేపథ్యంలో సాగే కథ ఇది. స్వచ్ఛ ముంబయి పేరుతో నగరం నడిబొడ్డన ఉన్న ధారావి మురికివాడపై కన్నేసిన ఓ రాజకీయ నాయకుడు… అపార్టుమెంటుల పేరుతో వాడను ఖాళీ చేయించడాని చేసే కుట్రలను ఎదుర్కొనే నాయకుడిగా రజనీకాంత్ కనిపిస్తారు.


ఈ కథలో రజనీ హీరోయిజాన్ని హైప్ చెయడానికి చాలా అవకాశాలున్నా… రజనీ వయసును దృష్టిలో ఉంచుకుని…. ఆయన పాత్రను స్మార్ట్‌గా, స్టయిలిష్‌గా చూపించేందుకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్లు అనిపిస్తుంది. సినిమా చూసి బయటకు వచ్చే ప్రేక్షకునికి రజనీ సినిమా చూసి వస్తున్న సంతృప్తి కలగదు.
 
దేశ వ్యాప్తంగా నగరాల్లోని మురుకివాడలపై రాజకీయనాయకులు, కార్పొరేట్లు కన్నేసి పేదను నగరాలకు దూరంగా తరిమేయడానికి జరుగుతున్న ప్రయత్నాల నేపథ్యంలో మంచి కథనే ఎంచుకున్నారు. అయితే రజనీకాంత్ రాజకీయ ప్రవేశం చేస్తున్న నేపథ్యంలో రాజకీయ కోణంలో ఈ సమస్యను ఎలా పరిష్కరించవచ్చో చెప్పి వుంటే అది రాజకీయ కెరీర్‌కీ దోహదపడేది. 
 
కానీ ఇందులో రాజకీయ విధానాలను మార్చడం అనే కోణంకంటే… ప్రజలతో కలసి ఎదుర్కోవడం అనే కోణం వరకే పరిమితమయ్యారు. అదే కథానాయకుడు రాజకీయ పరిష్కారం చూపేలా కథను రాసుకుని వుంటే సినిమా మరోలా వుండేది. కాలాగా రజనీకాంత్ ధారావీ మురికివాడకు పెద్ద దిక్కుగా ఉంటారు. ఆయన గ్యాంగ్‌స్టర్ అనిగానీ, రౌడీ అనిగానీ స్పష్టంగా చెప్పరుగానీ.. అన్నీ కలగలిపిన ఛాయలు కనిపిస్తాయి. హీరో ఒకసారి బలంగానూ ఇంకోసారి సాధారణ వ్వక్తిలాగానూ కనిపిస్తారు. ఈ గందరగోళంపై రజనీ అభిమానులు పెదవి విరుస్తున్నారు. మరోవైపు చిత్రంలో చాలా పాత్రలు ఉండటం కూడా ఇందుకు ఒక కారణం కావచ్చు.
 
సినిమా మొత్తం రజనీ‌ నల్ల దుస్తుల్లోనే కనిపిస్తారు. పేదలకు గుర్తుగా ఈ రంగును ఎంపిక చేశారు. మొత్తంగా ఈ సినిమా రజనీని పేదల ప్రతినిధిగా చూపించడానికి మాత్రం ఉపయోగపడుతుంది. విలన్ హరి దాదా నటన అత్యంత సహజంగా ఉంది. కాలా రజనీ స్థాయిని అందుకోలేదని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు