సెల్ఫీ కోసం వచ్చిన వారికి క్షమాపణలు చెప్పిన రవీనా టాండన్

ఠాగూర్

శనివారం, 14 సెప్టెంబరు 2024 (10:54 IST)
తన వద్దకు సెల్ఫీ కోసం వచ్చినవారికి ఫొటో ఇవ్వడానికి నిరాకరించి, వేగంగా వెళ్లిపోయిన బాలీవుడ్ సీనియర్ నటి రవీనా టాండన్‌ తాను చేసిన తప్పును తెలుసుకుని వారికి క్షమాపణలు చెప్పారు. అలా ఎందుకు వెళ్లారో చెబుతూ తన ట్విట్టర్ ఖాతాలో ఓ పోస్ట్ చేశారు. తప్పుగా అర్థం చేసుకోవద్దని విజ్ఞప్తి చేశారు. ఇటీవల రవీనా టాండన్ లండన్ పర్యటనకు వెళ్లారు. అక్కడ రోడ్డుపై ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తుండగా కొందరు వ్యక్తులు ఆమె వద్దకు వచ్చి ఫొటో అడిగారు. అయితే ఆమె వారికి ఫొటో ఇవ్వకుండా సెక్యూరిటీని పిలిచి అక్కడి నుంచి వేగంగా వెళ్లిపోయారు. 
 
తాజాగా ఈ ఘటనపై రవీనా ఎక్స్ వేదికగా స్పందించారు. 'ఇటీవల జరుగుతున్న నేరాలు చూసి భయపడుతున్నా. వారందరూ నా దగ్గరకు ఫొటో కోసం వచ్చినప్పుడు ఎందుకొచ్చారో కూడా తెలుసుకోవాలంటే భయమేసింది. నేను ఆ సమయంలో ఒంటరిగా ఉన్నాను. అందుకే అక్కడి నుంచి వేగంగా వెళ్లిపోయా. జూన్ నెలలో బాంద్రాలో నాకు ఎదురైన ఘటన నుంచి నేనింకా కోలుకోలేదు. అందుకే ఒంటరిగా వెళ్తున్నప్పుడు మరింత అప్రమత్తతతో వ్యవహరిస్తున్నా. వారికి ఫొటో ఇవ్వాలని నా మనసుకు అనిపించింది. కానీ ధైర్యం చేయలేకపోయాను. వారితో అలా ప్రవర్తించినందుకు చాలా బాధపడుతున్నా. అందుకే వివరణ ఇవ్వాలని ఈ పోస్ట్ పెడుతున్నా. మీకు ఫొటో నిరాకరించినందుకు నన్ను క్షమించండి. నన్ను అర్థం చేసుకోండి. భవిష్యత్తులో నేను మిమ్మల్ని మళ్లీ కలవాలని.. మీతో ఫొటోలు దిగాలని కోరుకుంటున్నా. మీకు ఈ పోస్ట్ చేరాలని ఆశిస్తున్నా' అని రాసుకొచ్చారు.
 
జూన్ నెలలో రవీనా టాండన్, ఆమె డ్రైవర్‌పై దాడి ఘటన తీవ్ర కలకలం రేపిన విషయం తెలిసిందే. 'మాపై దాడి చేయకండి' అంటూ నటి విజ్ఞప్తి చేస్తున్నట్లుగా ఉన్న వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొట్టింది. రవీనా, ఆమె డ్రైవర్ మద్యం తాగి ఉన్నారని, ర్యాష్ డ్రైవింగ్‌కు పాల్పడ్డారని కొందరు వారిపై ఫిర్యాదు చేసినట్లు వార్తలు వచ్చాయి. దీనిపై ముంబై పోలీసులు స్పష్టతనిచ్చారు. అది తప్పుడు కేసు అని, నటి మద్యం తాగలేదని వెల్లడించారు. అప్పటి నుంచి ఆమె మరింత జాగ్రత్తతో వ్యవహరిస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు