సుద్దాల అశోక్ తేజకు కాలేయ మార్పిడి చికిత్స విజయవంతం

ఆదివారం, 24 మే 2020 (16:01 IST)
ప్రముఖ తెలుగు సినీ గేయరచయిత సుద్దాల అశోక్ తేజ‌కు కాలేయ మార్పిడి చికిత్సను వైద్యులు విజయవంతంగా పూర్తి చేశారు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏషియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీ ఆసుపత్రిలో ఆయనకు ఈ ఆపరేషన్ జరిగింది. ఇది విజయవంతంగా పూర్తిచేసినట్టు వైద్యులు తెలిపారు. 
 
శనివారం ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఆయనకు ఈ చికిత్స జరిగింది. అదేసమయంలో అశోక్‌ తేజకు కాలేయం దానం చేసిన ఆయన కుమారుడు అర్జున్‌కు కూడా వైద్యులు ఆపరేషన్‌ చేశారు. శనివారం సాయంత్రం అశోక్ తేజ తమ కుటుంబ సభ్యులతో మాట్లాడారు. ఈ ఆపరేషన్‌ను విజయవంతంగా పూర్తిచేసిన వైద్యులకు ఆయన కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు చెప్పారు.
 
కాగా, ఇటీవల అనారోగ్యం పాలైన సుద్దాల అశోక్ తేజను ఏషియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీ ఆసుపత్రిలో చేర్చారు. అయితే, ఆయనకు అత్యవసరంగా కాలేయ మార్పిడి చికిత్స చేయాలని వైద్యులు సూచించారు. అదేసమయంలో బి నెగెటివ్ బ్లడ్ అధిక మొత్తంలో కావాల్సివుండటంతో చిరంజీవి బ్లడ్ బ్యాంకును సంప్రదించగా, వారు ముందుకు వచ్చారు. ఇలా అన్ని సమకూర్చుకున్న తర్వాత శనివారం ఈ కాలేయ మార్పిడి చికిత్సను విజయవంతంగా పూర్తిచేశారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు