కరోనాపై యుద్ధం : 'ఆపరేషన్ నమస్తే' పేరుతో ఇండియన్ ఆర్మీ చర్యలు

శుక్రవారం, 27 మార్చి 2020 (20:00 IST)
దేశం కరోనా వైరస్ కోరల్లో చిక్కుకుంది. ఎక్కడో చైనాలోని వుహాన్ నగరంలో పురుడు పోసుకున్న ఈ వైరస్.. ఇప్పటికి 190 దేశాలకు వ్యాపించింది. ఈ వైరస్ కోరల్లో చిక్కుకున్న అన్ని దేశాలు తమ పౌరులను రక్షించుకునే పనిలో నిమగ్నమయ్యాయి. ఇందుకోసం కరోనాపై యుద్ధం ప్రకటించాయి. ఇందులోభాగంగా, మన దేశ ప్రభుత్వం కూడా పోరాటం చేస్తోంది. ఇందుకోసం 21 రోజుల దేశవ్యాప్త లాక్‌డౌన్ ప్రకటించింది. దీన్ని అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా సంపూర్ణమద్దతు ప్రకటించాయి. 
 
అయినప్పటికీ దేశంలో కరోనా కేసులు కట్టడికావడం లేదు. ఈ క్రమంలో ప్రాణాంతక వైరస్‌పై పోరాటంలో సాయం చేయడానికి భారత ఆర్మీ కూడా సిద్ధమైంది. కరోనాకు వ్యతిరేకంగా తమ పోరాటానికి ప్రత్యేక ఆపరేషన్ ప్రారంభించింది. దీనికి 'ఆపరేషన్ నమస్తే' అని నామకరణం కూడా చేసింది. 
 
ఇందులోభాగంగా దేశవ్యాప్తంగా ఇప్పటికే ఎనిమిది క్వారంటైన్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. కరోనాపై పోరాటంలో సాయానికి ప్రత్యేక హెల్ప్‌ నంబర్ కూడా ప్రకటించింది. ఈ విషయాన్ని ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ ముకుంద్ నర్వానె వెల్లడించారు. సైన్యం చేస్తున్న సన్నాహాల గురించి తెలిపారు.
 
కరోనా వైరస్‌కు వ్యతిరేక పోరాటంలో ప్రభుత్వానికి సాయం చేయడం తమ బాధ్యత. దేశాన్ని కాపాడే సైనికులను ఆరోగ్యంగా, దృఢంగా ఉంచడం ఆర్మీ చీఫ్‌గా తన ప్రథమ కర్తవ్యం. ఈ విషయంలో ఆర్మీకి ఇప్పటికే రెండు, మూడు మార్గదర్శకాలు జారీ చేశాం. భారత సైన్యం గతంలో ఎన్నో కార్యకలాపాలను విజయవంతంగా పూర్తి చేసింది. ఇప్పుడు 'ఆపరేషన్‌ నమస్తే'ను కూడా విజయవంతం చేస్తుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు