జైలవకుశను హిందీలో రీమేక్ చేస్తా: ఆర్ఆర్ఆర్ తమిళ హీరోల ప్రశంసలు
మంగళవారం, 28 డిశెంబరు 2021 (10:42 IST)
స్టార్ డైరెక్టర్ అయిన రాజమౌళి బాహుబలి తర్వాత ట్రిపుల్ ఆర్ తెరకెక్కించిన సంగతి తెలిసిందే. రామ్ చరణ్ మరియు జూనియర్ ఎన్టీఆర్ కీలకపాత్రల్లో కనిపించే ఈ సినిమా ప్రమోషన్‌లు కూడా శరవేగంగా సాగుతున్నాయి.
ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ దర్శకుడు రాజమౌళి ఎక్కడా ఖాళీ లేకుండా ఇంటర్వ్యూలు ఇస్తూనే ఉన్నారు. తాజాగా ముంబైలో ప్రమోషన్ కార్యక్రమంలో భాగంగా బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టిన సల్మాన్ ఖాన్‌తో ఆర్ఆర్ఆర్ టీం సందడి చేయడం జరిగింది. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో జూనియర్ ఎన్టీఆర్ హిందీలో చాలా అద్భుతంగా మాట్లాడాడు. రిపోర్టర్ అడిగిన ప్రశ్నలకు తనదైన శైలిలో హిందీలో జవాబులు ఇస్తూ అదరగొట్టేశాడు.
అయితే అందులో భాగంగా మీరు నటించిన సినిమాలు బాలీవుడ్‌లో రీమేక్ చేయడానికి మీరు ఇష్ట పడతారు అని ఒక ప్రశ్న ఎదురైంది ఎన్టీఆర్‌కి. ఏ మాత్రం ఆలోచించకుండా జూనియర్ ఎన్టీఆర్ 2017లో వచ్చిన జై లవకుశ అనే సినిమాని నేను బాలీవుడ్లో రీమేక్ చేస్తాను అని చెప్పాడు.
జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన జై లవకుశ సినిమా అని కళ్యాణ్ రామ్ నిర్మించడం జరిగింది. ఆ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ మూడు విభిన్న పాత్రల్లో కనిపించి బ్లాక్ బస్టర్ హిట్‌ను సంపాదించాడు. ఈ సినిమాను బాలీవుడ్‌లో రీమేక్ చేస్తానని టక్కున సమాధానం ఇచ్చాడు తారక్.
మరోవైపు ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్ చెన్నైలోనూ ప్రారంభం అయ్యాయి. ఈ నేపథ్యంలో ఆర్ఆర్ఆర్ ప్రీరిలీజ్ ఈవెంట్‌ను నిన్న చెన్నైలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు తమిళ్ స్టార్ హీరో శివకార్తికేయన్.. ఉదయనిది స్టాలిన్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా హీరో శివ కార్తికేయన్ మాట్లాడుతూ.. రాజమౌళి.. తారక్, చరణ్‌లను ప్రశంసలతో ముంచెత్తాడు. రాజమౌళి గారు డైరెక్ట్ చేసిన మగధీర సినిమా చూసినప్పటినుంచి ఆయన అభిమానిగా మారిపోయాను. ఈగ సినిమా చూసి చిన్న ఈగతోనే ఇలాంటి సినిమా తీశారు. ఇంక మనతో ఎలాంటి మూవీస్ చేస్తారు అనుకున్నాను.
అలాగే ఎన్టీఆర్, చరణ్ రెండు సింహాల్లాగా కనిపిస్తున్నారు. ఇద్దరూ ఇద్దరే.. ఆర్ఆర్ఆర్ ట్రైలర్‌లో ఒక్కోక్కరినీ ఒక్కోక్క షాట్లో చూస్తుంటే గూస్బమ్స్ వచ్చేస్తున్నాయి. ట్రైలర్ చూస్తుంటేనే సినిమా చూశామన్నా భావన కలుగుతుంది. ఆర్ఆర్ఆర్ సినిమా మనమందరం గర్వపడే సినిమా. హాలీవుడ్ సినిమాలకు పోటీగా మనం కూడా చిత్రాలను తెరకెక్కిస్తున్నామని తెలిపారు.