'జబర్దస్త్’ కామెడీ షో ద్వారా బాగా ఎంటర్టైన్ చేసి... మంచి గుర్తింపు తెచ్చుకుని ప్రస్తుతం సినిమాల్లో మంచి పాత్రలు దక్కించుకుంటున్న షకలక శంకర్ ఇప్పుడు హీరోగానూ మారాడు. వరసగా రెండు సినిమాలు చేస్తున్నాడు. ఈమధ్యనే ‘శంభో శంకర’ సినిమా నుంచి ఒక పాట కూడా విడుదలైంది. ఇప్పుడు ఆయన హీరోగా నటిస్తోన్న మరో చిత్రం ‘డ్రైవర్ రాముడు’ టీజర్ వచ్చింది.
రాజ్ సత్య దర్శకత్వంలో సినిమా పీపుల్ పతాకంపై మాస్టర్ ప్రణవ్ తేజ్ సమర్పణలో వేణుగోపాల్ కొడుమగళ్ల, ఎం.ఎల్.రాజు, ఆర్.ఎస్.కిషన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవలే విడుదలైన సినిమా మొదటి ప్రచార చిత్రం అందరినీ ఆకట్టుకుంది. హీరో సుధీర్ బాబు చేతుల మీదుగా ‘డ్రైవర్ రాముడు’ టీజర్‌ను విడుదల చేయించారు.
ఈ సందర్భంగా సుధీర్ బాబు మాట్లాడుతూ.. ‘హాస్య నటుల్లో షకలక శంకర్ అంటే నాకు చాలా ఇష్టం. ఒక సినిమాలో శంకర్ ఉన్నాడంటే అందులో కామెడీ కచ్చితంగా బాగుంటుంది. ఇప్పుడు తాను హీరోగా వస్తున్నాడు అంటే ఆ సినిమాలో కామెడీ అద్భుతంగా ఉంటుందని అర్థం. ‘డ్రైవర్ రాముడు’ టీజర్‌ను విడుదల చేయడం సంతోషంగా ఉంది. నిర్మాతలు, దర్శకుడికి నా శుభాకాంక్షలు. ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను’ అని చెప్పారు.