రాజమౌళి దర్శకత్వంలో సల్మాన్ ఖాన్..!

ఆదివారం, 8 జనవరి 2017 (03:02 IST)
బాహుబలి ది బిగినింగ్ సృష్టించిన బాక్సాఫీసు రికార్డులు ప్రాంతీయ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళిని ఒక్క రాత్రిలో జాతీయ స్థాయి దర్శకుడిగా మార్చేసాయి. తెలుగు సినిమా సరిహద్దులను చెరిపివేసి దేశవిదేశాల్లో భారతీయ సినిమా చరిత్రలోనే రెండో అత్యధిక కలెక్షన్లు (600 కోట్లు) సాధించిపెట్టిన బాహుబలి తొలి భాగం అంతర్జాతీయంగా ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. బాహుబలి రెండో భాగం ఈ సంవత్సరం ఏప్రిల్‌లో విడుదలవుతున్న విషయం తెలిసిందే. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అనే సంచలనాత్మక ప్రశ్నకు సమాధానం ఇవ్వనున్న బాహుబలి-2 కి జరుగుతున్న ప్రచారం ఆకాశాన్నంటిందంటే అతిశయోక్తి లేదు.
 
త్వరలో విడుదలవుతున్న షారూక్ ఖాన్ సినిమా రేసెస్‌కి బాహుహలి 2 టీజర్‌ని జతచేసి మరీ ప్రచారానికి దిగుతున్నారు చిత్ర నిర్మాతలు. తెలుగు సినిమాకు ఇది సాధ్యపడేదేనా అన్న ఊహ కూడా లేని స్థితిని ఒక్కటంటే ఒక్క సినిమాతో రాజమౌళి మార్చేశాడు. అలాంటి బాహుబలి మాంత్రికుడి దర్శకత్వంలో సినిమా నిర్మాణం కోసం బాలీవుడ్ ఇప్పుడు పరుగులెడుతోందని సమాచారం. ఓపెన్ మేగజైన్‌లో కాలమిస్టు రాజీవ్ మసాంద్ ఇదే విషయాన్ని పేర్కొంటూ రాజమౌళి మనన్సును బాలీవుడ్ తీవ్రంగా ఆకర్షిస్తున్నట్లు వ్యాఖ్యానించారు. ప్రాంతియ పరిధిలో కాకుండా భారీ స్థాయి ఆడియన్స్‌ని ఆకర్షించాలని రాజమౌళి బలంగా కోరుకుంటున్నాడని, ప్రస్తుతం బాహుబలి 2 షూటింగ్ పార్ట్ ముగించుకుని పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్నందున, అతి త్వరలోనే రాజమౌళి నేరుగా హిందీలోనే సినిమా తీసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నట్లు తెలిపారు. 
 
ఇప్పటికే తనకు రణబీర్ కపూర్ నటన అంటే ఇష్టమని చెప్పిన రాజమౌళి హిందీలో అత్యంత భారీ స్థాయి వాణిజ్య చిత్రాన్ని తీయాలంటే తన తొలి చాయిస్ సల్మాన్ ఖానేనని సినీ విమర్శకులు చెబుతున్నారు. బాలీవుడ్‍‌లో కనకవర్షం కురిపించే సినిమాలకు మారుపేరు సల్మాన్ కాగా, దక్షిణాదిలో అత్యంత విజయవంతమైన దర్శకధీరుడు రాజమౌళి. వీరిద్దరు కలిస్తే ప్రస్తుతం దేశంలో నమోదైన బాక్సాఫీసు రికార్డులను ఆ సినిమా తుడిచిపెట్టేస్తుందని చిత్రరంగ పరిశీలకుల అంచనా. ఈ నేపథ్యంలో రాజమౌళి తదుపరి చిత్రం తెలుగులోనా లేక హిందీలోనా అనేది త్వరలోని తెలియవచ్చు.
 

వెబ్దునియా పై చదవండి