చైనాలో భారీ స్థాయిలో ఓ బేబి... నిర్మాతల ప్లాన్ వర్కవుట్ అవుతుందా..?
మంగళవారం, 16 జులై 2019 (13:36 IST)
సమంత - నందినీ రెడ్డి కాంబినేషన్లో రూపొందిన తాజా చిత్రం ఓ..బేబి. సీనియర్ నటి లక్ష్మి, రాజేంద్రప్రసాద్, రావు రమేష్ కీలక పాత్రలు పోషించిన ఓ..బేబి సినిమా విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుని సెకండ్ వీక్‌లో కూడా సక్సస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. ఓవర్సీస్‌లో అయితే... సరికొత్త రికార్డు సాధించేందుకు రెడీ అవుతోంది. బేబి ఈ స్ధాయిలో విజయం సాధించడంతో చిత్ర నిర్మాతలు ఫుల్ హ్యపీగా ఉన్నారు.
ఈ సందర్భంగా చిత్ర నిర్మాతల్లో ఒకరైన సునీత తాటి మీడియాతో మాట్లాడుతూ... నేను బంగారు కోడిపెట్ట, కొరియర్ బాయ్, సాహసం శ్వాసగా సాగిపో చిత్రాలను నిర్మించాను. ప్రొడ్యూసర్‌కి సినిమా తీసేటప్పుడు ఒక స్ట్రగుల్ ఉంటుంది. ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ .. దాదాపు 200 మందిని తీసుకువచ్చి సినిమా తీయడం అంటే పెళ్లి చేసేటప్పుడు ఎంత స్ట్రగుల్ ఫీలవుతామో సినిమా నిర్మాణం కూడా అలాంటిదే. అయితే... సురేష్ బాబు గారు, వివేక్ గారు ఉండటం వలన అనుకున్నట్టుగా.. అనుకున్న బడ్జెట్లో ఈ సినిమాని తీయగలిగాం. సురేష్ బాబు గారు, వివేక్ గారి నుంచి ఎంతో నేర్చుకున్నాను.
అసలు ఈ ఓ.. బేబి జర్నీ 2016లో స్టార్ట్ అయ్యింది. ఇండియాలో సినిమాలు చేద్దామని... క్రాస్ పిక్చర్స్ నుంచి థామస్ కొన్ని కథలు తీసుకుని వచ్చారు. ఆయనతో పరిచయం అయిన తర్వాత ఈ సినిమాను ఫస్ట్ సౌత్‌లో చేద్దామండి అన్నాను. ఆయనేమో హిందీలో చేద్దాం అన్నారు. ఆయనకు సౌత్ గురించి పెద్దగా తెలియదు. సౌత్ పెద్ద ఇండస్ట్రీ మీరు రండి అని చెప్పి హైదరాబాద్‌కి తీసుకువచ్చాను. 2017లో థామస్ హైదరాబాద్‌కి వచ్చారు. ఆయన వచ్చిన 10, 12 సార్లు హైదరాబాద్ అంటే ఏంటి..? తెలుగు అంటే ఏంటి..? తమిళ్ అంటే ఏంటి..? అనేది చెప్పాను.
ఆ టైమ్‌లో సురేష్ బాబు గార్కి పరిచయం చేయడం... ఆయన సినిమా చూడడం జరిగింది. ఈ సినిమా చూసిన తర్వాత సమంత అయితేనే కరెక్ట్ అనుకున్నాం. ఆమె డేట్స్ ఎప్పుడు ఇస్తే అప్పుడు చేయాలి అనుకున్నాం. 2018లో ఈ ప్రాజెక్ట్ లాక్ అయ్యింది. వివేక్ గారు.. సురేష్ బాబు గారితో కలిసి ఆల్రెడీ సినిమాలు చేస్తున్నారు. ముగ్గురం కలిసి ఈ సినిమా చేద్దాం అనే నిర్ణయానికి వచ్చాం. సమంత సలహా మేరకు నందినీ రావడం జరిగింది. ఇలా మూడు సంవత్సరాల క్రితం నుంచి ఈ ప్రాజెక్ట్ గురించి వర్క్ స్టార్ట్ చేసాం.
కొరియాలో థామస్ గారి దగ్గర ఈ రైట్స్ ఉన్నాయి. మేము కొనుక్కున్నాం. ఆయన కూడా ఈ ప్రాజెక్ట్‌లో ఉన్నారు. ఆయన కొరియాలో సినిమాలు, టెలివిజన్ షోలు, వెబ్ సిరీస్ ప్రొడ్యూస్ చేస్తుంటారు. మేము ఈ సినిమాని చైనాలో రిలీజ్ చేయాలనుకుంటున్నాం. డిష్కన్స్ అవుతున్నాయి. చైనా, జపాన్‌తో పాటు కొరియాలో కూడా రిలీజ్ చేయాలనుకుంటున్నాం. చైనా రిలీజ్ అన్నింటి కన్నా పెద్ద రిలీజ్ ఉంటుంది. చైనాలో ఆల్రెడీ రిలీజ్ చేసారు. అయినప్పటికీ ఇండియాలో ఎలా తీసారో చూడాలని అక్కడవాళ్లు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈ సినిమా ఇండియాకి రావడానికి ముందు 7 దేశాల్లో నిర్మించారు. ప్రస్తుతం స్పానీష్‌లో తీస్తున్నారు. హలీవుడ్‌లో తీసేది మిస్ గ్రానీకి 10వ రీమేక్ సినిమా అవుతుంది.
కొరియాలో 300 మిలియన్ డాలర్లు కలెక్ట్ చేసింది. కొరియాలో టాప్ టెన్‌లో మిస్ గ్రానీ థర్డ్ ప్లేస్ లోనో ఫోర్త్ ప్లేస్ లోనో ఉంటుంది. ఈ కథ ఇచ్చారనే గౌరవంతో ఆ దేశంలో జరిగే టాప్ ఫిల్మ్ ఫెస్టివల్ బూసాన్ ఫెస్టివల్‌కి పంపించాలనేది మా కోరిక. థామస్ గారి కోరిక కూడా ఇదే. తెలుగు సినిమా ఈ ఫెస్టివల్‌కి వెళ్లడం అనేది వెరీ హ్యాపీగా ఫీలవుతున్నాను. హిందీలో రీమేక్ చేయాలనుకుంటున్నాం. అలాగే కన్నడ, బెంగాలీలో రీమేక్ రైట్స్ కోసం అడుగుతున్నారు అని చెప్పారు.