భారత్ - పాకిస్థాన్ దేశాల మధ్యనేకాకుండా, ఆరు పెద్ద యుద్ధాలు జరిగేవని, వీటన్నింటినీ తానే ఆపానని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అన్నారు. పహల్గాం దాడి తర్వాత భారత్ - పాకిస్థాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు తలెత్తినపుడు సరైన సమయంలో జోక్యం చేసుకున్నానని వ్యాఖ్యానించారు. తాను జోక్యం చేసుకోకపోతే రెండు దేశాలు ఈ పాటికి యుద్ధం చేస్తూ ఉండేవని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్‌తో కలిసి ఆయన స్కాట్లాండ్‌లో మీడియాతో మాట్లాడుతూ, ఇటీవలికాలంలో ప్రపంచ వ్యాప్తంగా తాను ఆరు యుద్ధాలను నివారించానని చెప్పుకొచ్చారు. ప్రపంచ వ్యాప్తంగా పలుచోట్ల కాల్పుల విరమణలు కొనసాగుతున్నాయని ట్రంప్ పేర్కొన్నారు.
"నేనే లేకుంటే ఆరు పెద్ద యుద్ధాలు జరుగుతుండేవి. ఇందులో భారత్ - పాకిస్థాన్ అతి పెద్దది. ఎందుకంటే ఈ రెండు అణ్వస్త్ర దేశాలు. ఒకవేళ అణ్వస్త్రాలు ప్రయోగిస్తే యుద్ధం విస్తరించడం, అణుధూళి వ్యాప్తి ఘోర పరిస్థితులు ఉండేవి. భారత్, పాక్ దేశాలకు చెందిన నేతలు నాకు బాగా తెలుసు. యుద్ధం చేసుకోవాలనుకుంటే వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకోనని స్పష్టం చేశాను" అని పునరుద్ఘాటించారు. భారత్ - పాకిస్థాన్ యుద్ధాన్ని తానే ఆపానని ట్రంప్ ఇదివరకే పలుమార్లు వ్యాఖ్యానించారు.