'బాబా' గుర్తుకాదు.. మేక తలకాయ : శరత్ కుమార్

మంగళవారం, 30 జనవరి 2018 (16:38 IST)
సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయ పార్టీని స్థాపించనున్న విషయం తెల్సిందే. ఇప్పటికే ఆయన రజనీకాంత్ రసిగర్ మండ్రం పేరుతో ఓ విభాగాన్ని ఏర్పాటుచేశారు. ఇందుకోసం ఆయన బాబా గుర్తును ఎంచుకున్నారు. ఈ గుర్తుపై సినీ నటుడు, ఆల్ ఇండియా సమతువ మక్కల్ కట్చి పార్టీ అధినేత శరత్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రజనీకాంత్ అవకాశవాద రాజకీయాలకు తెరలేపారని అన్నారు. రజనీ చూపించే గుర్తు 'బాబా'ది కాదని... అది మేక తలకాయ అని ఎద్దేవా చేశారు. అది ఓ సీక్రెట్ సొసైటీకి చెందిన గుర్తు అని పేర్కొన్నారు. 
 
నిజానికి 1996లో రజనీకాంత్ నాటి ముఖ్యమంత్రి జయలలితకు భయపడి విదేశాలకు పారిపోయారని, ఆ తర్వాత మళ్లీ రాష్ట్రంలో డీఎంకే ప్రభుత్వం వచ్చాకే ఇక్కడకు తిరిగొచ్చారని గుర్తు చేశారు. ఇపుడు రాష్ట్రంలో నెలకొన్ని పరిస్థితులను ఉపయోగించుకుని అంటే అవకాశవాద రాజకీయాలతో లబ్ధి పొందాలని భావిస్తున్నారని విమర్శించారు. కానీ, రాష్ట్ర ఓటర్లు తెలివైనవారనీ, వారు స్పష్టమైన తీర్పునిస్తారని తెలిపారు. 
 
ఇకపోతే, కావేరీ నదీ జలాల వివాదంపై రజనీకాంత్ వైఖరేంటో స్పష్టం చేయాలని శరత్ కుమార్ డిమాండ్ చేశారు. రజనీకాంత్‌ను లక్ష్యంగా చేసుకుని సహనటుడిగా ఉన్న శరత్ కుమార్ ఘాటైన విమర్శలు చేయడం ఇపుడు చర్చనీయాంశంగా మారింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు