సంఘమిత్ర నుంచి శ్రుతిని తప్పించింది మేమే... ఎందుకు తప్పించారో స్పష్టత లేదు

శనివారం, 24 జూన్ 2017 (06:02 IST)
బాహుబలి 2 చిత్రం తర్వాత దాన్ని మించిన భారీ ప్రాజెక్టుగా సంఘమిత్రను ప్రకటించిన తేనాండాల్ సంస్థ తాజా ప్రకటనలో సంఘమిత్ర పాత్రధారి శ్రుతి హసన్‌ని సినిమా నుంచి తొలగించింది తామేనని, ఆమె స్వయంగా తప్పుకుంటున్నట్లు వచ్చిన వార్తలు నిజం కావని బాంబు పేల్చింది. ఆమెతో కలిసి పనిచేయలేం అని మేమే నిర్ణయానికి వచ్చి తనను మా సినిమానుంచి తొలగించామని సంస్థ సీఈఓ హేమా రుక్మిణి తేల్చి చెప్పారు. కానీ ఆశ్చర్యమేమిటంటే తట్టెడు ఆరోపణలు చేసి తానే సినిమాను వదులుకున్నానని శ్రుతి ప్రకటించి నెల రోజులు కావస్తున్నప్పటికీ తాజా ప్రకటనలో కూడా ఏ కారణంతో ఆమెను తొలగించిందీ చిత్ర నిర్మాణ సంస్థ స్పష్టంగా చెప్పకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది.
 
‘‘కాల్షీట్స్‌లో క్లారిటీ లేదు. బౌండెడ్‌ స్క్రిప్ట్‌ ఇవ్వలేదు... అందుకే ‘సంఘమిత్ర’ ప్రాజెక్ట్‌ నుంచి తప్పకుంటున్నా’’ అని శ్రుతీహాసన్‌ స్టెట్‌మెంట్‌ ఇచ్చిన విషయం తెలిసిందే. సుందర్‌. సి. దర్శకత్వంలో తేనాండాళ్‌ ఫిల్మ్‌ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. ఈ చిత్రం నుంచి తప్పుకుంటున్నానని శ్రుతి వ్యాఖ్యలు చేసి, దాదాపు నెల అయ్యింది.
 
ఆ వార్తలపై ఇప్పుడు సంస్థ సీఈఓ హేమా రుక్మిణి స్పందించారు. ‘‘శ్రుతీహాసన్‌ తనంతట తను తప్పుకోలేదు. ఆమెతో కలిసి పని చేయలేం అని మేమే డిసైడ్‌ అయ్యాం. ఇది వృత్తిపరమైన నిర్ణయం. శ్రుతీహాసన్‌ స్థానంలో ఎవర్ని తీసుకోబోతున్నాం అన్నది త్వరలో తెలియజేస్తాం’’ అని హేమా రుక్మిణి అన్నారు. బౌండెడ్‌ స్క్రిప్ట్‌ అందజేయని కారణంగానే ఈ సినిమా నుంచి తప్పుకుంటున్నట్లు శ్రుతి ఆరోపించారు. కానీ, హేమ మాత్రం స్క్రిప్ట్‌ ఎప్పుడో రెడీ అయ్యిందంటున్నారు. ‘‘కథ రెడీ అయ్యింది. స్క్రిప్ట్‌ను ఫైన్‌ ట్యూన్‌ చేయాల్సిన అవసరం వస్తే, షూటింగ్‌ టైమ్‌లో అది ఆటోమెటిక్‌గా జరుగుతుంది’’ అని స్పష్టం చేశారామె.
 
శ్రుతీహాసన్‌ స్థానంలో నయనతార యాక్ట్‌ చేస్తారనే వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. ‘‘నయనతార అమేజింగ్‌ ఆర్టిస్ట్‌. ఇది వరకు నయనతో వర్క్‌ చేశాం. ‘సంఘమిత్ర’ లుక్‌ ఎలా ఉండాలనే విషయంలో ఓ నిర్ణయానికి వచ్చాం. సంఘమిత్ర ఎవరన్నది త్వరలోనే చెబుతాం’’ అన్నారామె. మరి.. హేమా రుక్మిణి వ్యాఖ్యలకు శ్రుతి స్పందిస్తారా.. మాటకు మాట డబుల్‌గా అందించే కెపాసిటీ కల శ్రుతి ఏమంటుందో చూడాలి మరి.
 

వెబ్దునియా పై చదవండి