సోనూ సూద్ ఏం చేయబోతున్నాడు.. స్టూడెంట్స్ కోసం బిగ్ అనౌన్స్‌మెంట్?

శుక్రవారం, 4 సెప్టెంబరు 2020 (17:09 IST)
వెండితెరపై కరుడుగట్టిన విలన్‌గా కనిపించే సినీ నటుడు సోనూ సూద్ నిజ జీవితంలో మాత్రం ఎవరికీ అందనంత రియల్ హీరోగా మారిపోయారు. దేశంలోని ఏ ఒక్క సెలెబ్రిటీ లేదా రాజకీయ నేతలు ఆయనతో పోటీపడే స్థాయిలో లేరు. ఈ విషయం కరోనా కష్టకాలంలో చేతల ద్వారా నిరూపితమైంది. 
 
కరోనా కష్టకాలంలో నిజమైన సమాజ సేకవకుడిగా గుర్తింపు పొందారు. ఈ కష్ట సమయంలో ఎందరో వలస కూలీలు, నిరుద్యోగులకు అండగా నిలిచాడు. కరోనా లాక్డౌన్ సమయంలో విదేశాల్లో చిక్కుకునిపోయిన అనేక మంది భారతీయ విద్యార్థులను స్వయంగా తన ఖర్చులపై స్వదేశానికి చేర్చాడు. 
 
ఇదిలావుంటే, సోను తాజాగా సోషల్ మీడియాలో ఓ పోస్టు పెట్టారు. విద్యార్థులను ఉద్దేశించి పెట్టిన పోస్టు సంచలనం సృష్టిస్తోంది. విద్యారంగానికి సంబంధించి త్వరలో ఓ కీలక ప్రకటన ఉంటుందని సోను తన ఇన్‌స్టాలో పోస్టు పెట్టారు. దీంతో ఆయన చేయబోయే ఆ ప్రకటన ఏంటా అన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది. సోను విద్యార్థులకు ఏం చేయనున్నాడా అన్న దానిపై నెట్టింట జోరుగా చర్చ జరుగుతోంది. 
 
విద్యార్థుల విషయంలో సోను చాలా సానుకూలంగా ఉంటారు. గతంలో ఆన్‌లైన్ క్లాసులకు హాజరుకావడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న హర్యానా విద్యార్థులకు సోను సాయం అందించారు. స్మార్ట్ ఫోన్లు వారికి అందేలా చేశారు. 
 
అలాగే నీట్, జేఈఈ పరీక్షా కేంద్రాలకు వెళ్లేవారు ప్రయాణ కష్టాలను తీర్చడానికి ప్రత్యేక సదుపాయం ఏర్పాటు చేశారు. అయితే కరోనా కారణంగా విద్యార్థుల అవస్థలను తెలుసుకుంటున్న సోను... ఏం చేయనున్నారో తెలియాలంటే మరికొన్ని గంటలు ఆగాల్సిందే. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు