ఇకపై మా కష్టాలు ఎవరికి చెప్పుకోవాలి?: భౌతికకాయం వద్ద బోరున విలపించిన సుద్దాల అశోక్ తేజ

బుధవారం, 31 మే 2017 (09:39 IST)
ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు ఆకస్మిక మృతి పట్ల ప్రముఖ గీత రచయిత సుద్దాల అశోక్ తేజ సంతాపం వ్యక్తం చేశారు. దాసరి నివాసంలో ఆయన పార్థివదేహాన్ని సందర్శించిన సందర్భంగా ఆయన కన్నీరుమున్నీరయ్యారు. 25 ఏళ్ల తన సినీ ప్రస్థానంలో దాసరితో ప్రత్యేక అనుబంధం ఉందని అన్నారు. కష్టంలో, బాధతో దాసరి కాంపౌండ్‌లో అడుగుపెట్టిన ప్రతి ఒక్కరూ ఉపశమనంతో ఇంటికి వెళ్లేవారని చెప్పారు. కష్టం, కన్నీరు చూస్తే ఆయన అండగా నిలబడేవారని గుర్తు చేశారు. 
 
ఎంతోమందికి ఆయన ఇచ్చిన ప్రోత్సాహం సినీ పరిశ్రమ నిలబడేందుకు దోహదపడిందన్నారు. దాసరి కథ, మాట, పాట ఎంతో మందికి స్ఫూర్తినిచ్చాయని ఆయన చెప్పారు. ఇన్నేళ్లుగా గూడుకట్టుకున్న బంధం ఒక్కసారిగా తెగిందంటే నమ్మబుద్ధి కావడం లేదన్నారు. సినీ పరిశ్రమకు లోటు ఒక ఎత్తైతే... ఇకపై కష్టం కలిగితే సినీ కుటుంబం ఎవరికి చెప్పుకోగలుగుతుందంటూ సుద్దాల అశోక తేజ కన్నీరుపెట్టుకున్నారు. 
 
కాగా, దర్శకుడు దాసరి నారాయణరావు ఆకస్మిక మృతితో పెద్దదిక్కును కోల్పోయామని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నేత బొత్స సత్యనారాయణ తెలిపారు. హైదరాబాదులోని దాసరి నివాసంలో ఆయన పార్థివ దేహాన్ని సందర్శించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దాసరి మృతితో తాము పెద్దదిక్కును కోల్పోయామన్నారు. సమస్య అంటే ఆయన వద్దకు వచ్చేవారమని ఆయన గుర్తు చేసుకున్నారు. ఆయన పులిలా అండగా ఉండేవారని ఆయన చెప్పారు. తమ సామాజిక వర్గం ఆయన మృతితో పెద్దదిక్కుని కోల్పోయిందన్నారు. 

వెబ్దునియా పై చదవండి