హీరో భార్యకు నచ్చలేదనీ ఓ మూవీ నుంచి తొలగించారు (video)

బుధవారం, 18 నవంబరు 2020 (09:47 IST)
టాలీవుడ్ ఇండస్ట్రీకి దర్శకేంద్రుడు కె.రాఘవేంద్ర రావు పరిచయం చేసిన హీరోయిన్లలో తాప్సీ పన్ను ఒకరు. అయితే, పంజాబీ సొట్టబుగ్గల సుందరికి ఇండస్ట్రీలో ఐరన్ లెగ్ అనే ముద్రపడింది. దీనికి కారణం ఆమె నటించిన పలు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బోల్తాపడటమే. ఆ తర్వాత తెలుగులో ఆమెకు అవకాశాలు పూర్తిగా తగ్గిపోయాయి. దీంతో ఆమె టాలీవుడ్ ఇండస్ట్రీపై విమర్శలు గుప్పించింది. ముఖ్యంగా, తనకు హీరోయిన్ స్టేటస్ కల్పించిన దర్శకుడు కె.రాఘవేంద్ర రావును లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేసింది. ఆ దర్శకుడుకి హీరోయిన్ల బొడ్డుపై పండ్లు వేయడం మినహా మరొకటి తెలియదంటూ సంచలన కామెంట్స్ చేసింది. 
 
నిజానికి ఈ అమ్మడుకి కెరీర్ తొలి నాళ్ళలో గ్లామర్‌ నాయికగా ముద్రపడింది. ఆ తర్వాత కాలంలో తన పంథా మార్చుకుంది. హిందీ చిత్రసీమలో వరుసగా మహిళా ప్రధాన చిత్రాలతో సత్తాచాటింది. అయితే ఈ పేరుప్రఖ్యాతులు తనకు సులభంగా లభించలేదని.. ఎన్నో అవహేళనల్ని దాటుకొని విజయాల్ని సొంతం చేసుకున్నానని తాజాగా చెప్పుకొచ్చింది.
 
కెరీర్‌ ఆరంభంలో ఐరన్‌లెగ్‌ అంటూ తనపై చేసిన ప్రచారం పరిశ్రమలో రాణించాలనే తపనను పెంచిందని తాప్సీ చెప్పింది. 'ఒకప్పుడు దర్శకనిర్మాతలు నాకు అవకాశాలు ఇచ్చేవారు కాదు. తాప్సీ దురదృష్టానికి సంకేతం అంటూ దుష్ప్రచారం చేసేవారు. హీరో భార్యకు నేను నటించడం ఇష్టం లేదనే కారణంతో ఓ సినిమా నుంచి నన్ను తప్పించారు. మరో సినిమా విషయంలో.. డబ్బింగ్‌ సరిగ్గా చెప్పడం లేదని.. నా వాయిస్‌ను తొలగించి డబ్బింగ్‌ ఆర్టిస్టుతో సంభాషణల్ని చెప్పించారు. 
 
ఈ విషయంపై నాకు సమాచారం కూడా ఇవ్వలేదు. మరీ దారుణమైన సంగతి ఏమిటంటే.. ఓ హీరో నటించిన గత చిత్రం ఫెయిల్‌ అయింది కాబట్టి అతనితో పాటు నన్ను కూడా రెమ్యునరేషన్‌ తగ్గించుకోమని బలవంతం చేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో అవమానాల్ని భరించాను. ఆ తర్వాత కథాంశాల ఎంపికలో నా పంథా మార్చుకున్నా. బలమైన సందేశం ఉన్న మహిళా ఇతివృత్తాల్లో నటించి నా ప్రతిభను చాటుకున్నా' అని తాప్సీ చెప్పింది. 

 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు