దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి, ప్రభాస్ కాంబినేషన్లో వచ్చిన చిత్రం 'బాహుబలి'. ఈ చిత్రం తెలుగు సినీ రికార్డులను తిరగరాసింది. ఇప్పట్లో మళ్లీ ఏ సినిమా కూడా తన దరిదాపుల్లోకి రాలేనంతగా ప్రభంజనం సృష్టించింది. అలా తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి చాటిన గోల్డెన్ మూవీ. ఈ చిత్రంతో పాటు.. దర్శకుడు రాజమౌళి, ఇటు హీరో ప్రభాస్‌కు అంతర్జాతీయ గుర్తింపును తెచ్చిపెట్టింది.
అయితే, ఈ చిత్ర హీరోకు మరిచిపోలేని అనుభూతిని మిగిల్చింది. ప్రపంచంలోని ప్రముఖులకు మైనపు రూపాన్నిచ్చి దాచే ప్రఖ్యాత మైనపు విగ్రహాల మ్యూజియం మేడమ్ టుస్సాడ్స్.. ప్రభాస్‌కూ ఆ అరుదైన గౌరవాన్ని కల్పించింది. ఇటీవలే మ్యూజియం ప్రతినిధులొచ్చి ప్రభాస్ కొలతలు తీసుకుని వెళ్లారు. దీనిపై తెలుగు సినీ అభిమానులు చాలా ఆనందంగానే ఉన్నా.. కొందరు మాత్రం విషాన్ని వెదజల్లుతున్నారు.
తమకు రాలేదన్న అక్కసుతో ప్రభాస్‌పై కోలీవుడ్ మీడియా నానా యావ చేస్తోంది. తాజాగా ప్రముఖ తమిళ పత్రిక ఒకటి ప్రభాస్ మైనపు విగ్రహంపై తమిళ సెలెబ్రిటీల అభిప్రాయాలను ప్రచురించింది. అంతేకాదు ప్రభాస్‌కు మైనపు విగ్రహమా? అంటూ అక్కసు వెళ్లగక్కింది. 'ప్రభాస్‌కే మైనపు విగ్రహం పెడితే.. మరి రజినీకాంత్, కమల్‌హాసన్‌లతో పాటు మేటి నటీనటులు ఎంజీఆర్, శివాజీ గణేశన్‌లకు విగ్రహాలను ఎందుకు పెట్టకూడదు?' అంటూ ప్రభాస్ మైనపు విగ్రహాన్ని వ్యతిరేకిస్తూ వార్త ప్రచురించింది.