తమిళనాడు రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో ఈసారి సినీనటులు అధిక సంఖ్యలో బరిలోకి దిగే సూచనలు కనిపిస్తున్నాయి. మక్కల్ నీదిమయ్యం అధ్యక్షుడు కమల్ హాసన్ ఈ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. అలాగే, సినీ నటుడు ఖుష్బూ, వింద్యలు కూడా పోటీ చేసేందుకు సమాయత్తమవుతున్నారు. ఇక అన్నాడీఎంకేలో పలువురు సినీనటులు పోటీకి ఆసక్తి కనబరుస్తున్నారు.
విశ్వనటుడుగా గుర్తింపు పొందిన కమల్ హాసన్.. ఎంఎన్ఎం పేరుతో రాజకీయ పార్టీని స్థాపించారు. ఈయన స్థానిక మైలాపూర్ నుంచి పోటీ చేయనున్నారు. అలాగే, బీజేపీ తీర్థం పుచ్చుకున్న సినీనటి ఖుష్బూ ట్రిప్లికేణి - చెప్పాక్కం స్థానం నుంచి బరిలోకి దిగనున్నారు. ఇకపోతే, అన్నాడీఎంకేకు చెందిన సినీ నటి వింధ్య ఈసారి చెన్నై నగరంలోనే పోటీ చేయడానికి తీవ్ర ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఈమెకు అన్నాడీఎంకే పార్టీ టిక్కెట్ కేటాయిస్తే ఆర్కే నగర్ స్థానం నుంచి బరిలోకి దిగాలని ఉవ్విళ్లూరుతున్నారు.
కాగా, గత లోక్‌సభ ఎన్నికల్లో దక్షిణ చెన్నై నియోజకవర్గంలో మక్కల్ నీదిమయ్యం పార్టీకి అధికంగా ఓట్లు లభించాయి. ప్రత్యేకించి మైలాపూరు అసెంబ్లీ నియోజకవర్గంలో ఆ పార్టీకి అధికంగా ఓట్లు పడ్డాయి. ఈ కారణం వల్లే ఆయన మైలాపూరును పోటీకి ఎంచుకున్నట్లు చెబుతున్నారు.
బీజేపీకి చెందిన నటి ఖుష్బూ ప్రస్తుతం చేపాక్-ట్రిప్లికేన్ నియోజకవర్గం ఇన్‌ఛార్జిగా ఉన్నారు. బీజేపీలో చేరిన రోజూ ఆమె పార్టీ ఆదేశిస్తే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటించారు. ఆ మేరకు ఖుష్బూ చేపాక్-ట్రిప్లికేన్ నియోజకవర్గంలో పోటీ చేస్తారని తెలుస్తోంది.
నటి వింధ్యను ఆర్కేనగర్ నియోజకవర్గంలో పోటీకి దింపాలని అన్నాడీఎంకే అధిష్ఠానం భావిస్తోంది. ఆ నియోజకవర్గంలో మాజీ ముఖ్యమంత్రి జయలలిత, అమ్మా మక్కల్ మున్నేట్ర కళగం నాయకుడు టీటీవీ దినకరన్ పోటీ చేసి గెలిచారు. ఈ నియోజకవర్గంలో మళ్ళీ గెలవాలని దినకరన్ వ్యూహరచన చేస్తున్నారు.
ప్రధాన ప్రతిపక్షమైన డీఎంకే కూడా ఈ నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టిని సారిస్తోంది. ఈ పరిస్థితులలో మాజీ ముఖ్యమంత్రి జయలలితతో సన్నిహిత సంబంధాలు కలిగి, ఆమె ఆశీస్సులతో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో తీవ్ర ప్రచారం సాగించిన పార్టీ ప్రచార డిప్యూటీ కార్యదర్శిగా ఉన్న వింధ్యాను ఆర్కేనగర్‌లో పోటీలోకి దింపడటం సమంజసంగా ఉంటుందని అధిష్ఠానం భావిస్తున్నట్టు తెలుస్తోంది.