'నారి నారి నడుమ మురారి' చిత్ర నిర్మాత కె.మురారి ఇకలేరు.. నేడు అంత్యక్రియలు

ఆదివారం, 16 అక్టోబరు 2022 (08:57 IST)
తెలుగు చిత్రపరిశ్రమకు చెందిన సీనియర్ నిర్మాతల్లో ఒకరైన కాట్రగడ్డ మురారి అలియాస్ కె.మురారీ ఇకలేరు. ఆయన శనివారం రాత్రి గుండెపోటుతో మరణించారు. ఆయనకు రెండుసార్లు బైపాస్ సర్జరీ చేశారు. శనివారం రాత్రి భోజనం చేసి తన కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్న సమయంలో మూడో సారి గుండెపోటు వచ్చింది. దీంతో ఆయన్ను అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలిస్తుండగానే తుదిశ్వాస విడిచారు. ఆయనకు వయస్సు 78 యేళ్లు. చెన్నై, ఈసీఆర్ రోడ్డు, నీలాంకరై, కపాలీశ్వర్ నగరులో ఉన్న ఆయన నివాసంలోనే కన్నుమూశారు. ఆయన అంత్యక్రియలు ఆదివారం సాయంత్రం 4 గంటల సమయంలో జరుగనున్నాయి. ఆయనకు భార్య, కుమార్డు కార్తీక్ ఉన్నారు. 
 
విజయవాడ మొగల్రాజపురానికి చెందిన మురారి చిన్నప్పటి నుంచే సంగీతం, సాహిత్యంపై మక్కువ పెంచుకున్నారు. ఎంబీబీఎస్ చదువుతున్న రోజుల్లో సినిమాలు చూసి వాటిపై సమీక్షలు, వ్యాసాలు రాసేవారు. ఎంబీబీఎస్ చివరి సంవత్సరంలో ఉన్నప్పుడు దానిని వదిలేసి సినిమాలపై ఆసక్తితో చిత్రపరిశ్రమలో అడుగుపెట్టారు. 
 
తన బాబాయి శ్రీనివాసరావు ప్రోత్సాహంతో దర్శకుడు మధుసూదనరావు వద్ద 1969లో సహాయ దర్శకుడిగా చేరారు. ‘మనుషులు మారాలి’ సినిమాకు తొలిసారి పనిచేశారు. ఆ తర్వాత దర్శకుడు చక్రపాణితో ఏర్పడిన పరిచయం ఆయన జీవితాన్ని మలుపు తిప్పింది. వి.మధుసూదనరావు, ఆదుర్తి సుబ్బారావు, బాలచందర్, సేతుమాధవ్, బాపు వంటి ప్రముఖుల వద్ద సహాయ దర్శకుడిగా పనిచేసి అనుభవం సంపాదించారు. 
 
ఆ తర్వాత 'యువ చిత్ర ఆర్ట్స్' పేరుతో బ్యానర్ స్థాపించి ‘సీతామాలక్ష్మి’, ‘గోరింటాకు’, ‘త్రిశూలం’, ‘అభిమన్యుడు’, ‘సీతారామ కల్యాణం’, ‘శ్రీనివాస కల్యాణం’, 'జే గంటలు',  ‘జానకి రాముడు’, ‘నారీనారీ నడుమ మురారి’ వంటి హిట్ సినిమాలు నిర్మించారు. మురారి మరణవార్త విని సినీ పరిశ్రమ దిగ్బ్రాంతి వ్యక్తం చేసింది. ఆయన మృతికి సినీ ప్రముఖులు నివాళులు అర్పించారు. తెలుగు చిత్రపరిశ్రమ పూర్తిగా హైదరాబాద్ నగరానికి తరలి వెళ్లినప్పటికీ తనకు అన్నీ ఇచ్చిన చెన్నైలోనే ఆయన స్థిరపడిపోయారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు