బాలీవుడ్ దర్శకుడు సంజయ్ లీలా బన్సాలీ నిర్మించిన తాజా చిత్రం "పద్మావతి". ఈ చిత్రం విడుదలకు ముందే వివాదంలో చిక్కుకుంది. ఈ నేపథ్యంలో సంజయ్ లీలా భన్సాలీ ఓ వీడియో ద్వారా వివరణ ఇచ్చారు. ఎవరి మనోభావాలను దెబ్బతీసేవిధంగా ఈ సినిమాను తెరకెక్కించలేదని, ఈ సినిమాతో రాజ్‌పుత్‌ల పట్ల గౌరవం పెంపొందుతుందే కానీ, భంగం వాటిల్లబోదని ఆయన భరోసా ఇచ్చారు.
ముఖ్యంగా, ఈ చిత్రంలో 'రాణి పద్మావతి', 'అల్లావుద్దీన్ ఖిల్జీ' మధ్య డ్రీమ్ సీక్వెన్స్ సినిమాలో ఉన్నట్టు వచ్చిన వదంతులను తాను ఇప్పటికే ఖండించినట్టు చెప్పారు. వారిద్దరిమధ్య అలాంటి సన్నివేశాలు ఉండవని రాతపూర్వకంగా హామీ ఇచ్చాను. ఈ వీడియో ద్వారా నేను మరోసారి స్పష్టం చేస్తున్నా.. ఎవరి మనోభావాలు దెబ్బతీసేవిధంగా రాణి పద్మావతి, ఖిల్జీ మధ్య సన్నివేశాలు ఉండబోవు అని భన్సాలీ తెలిపారు. ఈ మేరకు పద్మావతి సినిమా అధికారిక ట్విట్టర్ పేజీలో ఆయన ఒక వీడియోను పోస్టు చేశారు.
అంతేకాకుండా, పద్మావతి చిత్రాన్ని ఎంతో నిజాయితీతో, బాధ్యతతో, అకుంఠిత దీక్షతో తెరకెక్కించినట్టు తెలిపారు. రాణి పద్మావతి కథ ఎల్లప్పుడూ స్ఫూర్తినింపుతూ ఉంటుందనీ, ఆమె వీరోచిత పోరాటం, త్యాగానికి ఘననివాళిగా ఈ చిత్రాన్ని రూపొందించినట్టు ఆయన ఓ వీడియో ద్వారా వివరణ ఇచ్చారు.
కాగా, క్షత్రియ సామాజికవర్గం మనోభావాలను దెబ్బతీసేలా ఈ సినిమా ఉందని ఆరోపణలు వస్తున్నాయని, రాణి పద్మావతికి, దురాక్రమణకు దిగిన సుల్తాన్ అల్లావుద్దీన్ ఖిల్జీకి మధ్య లింక్స్ ఉన్నట్టు ఈ సినిమాలో చరిత్ర వక్రీకరించారని ఆరోపణలు వినిపిస్తుండటంతో వివాదం ముదురుతోంది. ఇప్పటికే బీజేపీ నేతలతోపాటు రాజ్‌పుత్ వర్గంవారు ఈ సినిమాపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇదే అంశంపై సెన్సార్ బోర్డుకు లేఖ రాసేందుకు బీజేపీ నేతలు సిద్ధమవుతున్నారు.