జూనియర్ ఆర్టిస్టులకు ఏం జరుగుతోంది? సినీ ఇండస్ట్రీలో మోసం ఎలా వుంది?
బుధవారం, 3 ఆగస్టు 2016 (19:19 IST)
సినిమాకు హీరోహీరోయిన్లతోపాటు క్యారెక్టర్ ఆర్టిస్టులు ముఖ్యం. ఇవన్నీ ప్రముఖ నటీనటులు చేస్తుంటారు. కానీ గుంపుగా జనాలు కావాలంటే.. మాత్రం జూనియర్ ఆర్టిస్టులు కావాల్సిందే. వీరంతా ఎక్కడి నుంచి వస్తారు? వీరి వేతనాలు ఎలా వుంటాయి? వీరికి సరైన న్యాయం జరుగుతుందా? అసలు ఇండస్ట్రీలో వీరి గురించి దర్శక నిర్మాతలు ఏం చేస్తున్నారు? అనే పలు ప్రశ్నలకు సమాధానాలు ప్రతిసారీ వెతుక్కోవల్సివస్తుంది. అయితే.. దీనికి సరైన సమాధానంగా.... మంచు మనోజ్.. వైజాగ్‌లో.. జూనియర్లపై ఇచ్చిన క్లారిటీతో ఇక్కడ ఎంతో దగా జరుగుతుందని తెలుస్తోంది. బహుశా ఇది కొత్తమే కాదు.. ఎన్నాళ్ళ నుంచో జరుగుతున్న అన్యాయమే.. దీనిపై స్పెషల్ రిపోర్ట్.
జూనియర్ ఆర్టిస్టులంటే..
జూనియర్ ఆర్టిస్టులంటే.. అసలు నటీనటులకంటే.. జూనియర్స్ అన్నమాట. వీరిలో కొత్తగా మొహానికి రంగేసుకు వచ్చేవారు. సినిమాలో ఒక్క సీన్‌లో కన్పించాలనుకునేవారు.. మార్కెట్, హోటల్, షాపింగ్ మాల్స్, చావులు, పెళ్లిల్లు, ఫంక్షన్లు.. ఇలా పలు కార్యక్రమాల్లో వారి అవసరం వుంటుంది. వీరందరిని తేవాలంటే.. సప్లై చేసే వ్యక్తి వుంటాడు. ఇతన్నే జూనియర్స్ సప్లయిర్స్ అంటారు. వీరు పలు సినిమా బేనర్స్, ప్రొడక్షన్ హౌస్‌కు చెందిన ప్రొడక్షన్ మేనేజర్లతో సంబంధాలు పెట్టుకుంటారు. ఆయా సినిమాల్లో విలన్‌కు రౌడీలుగానో, ఇంటిలో ఫంక్షన్‌కు ఆడవాళ్లుకానీ.. పెండ్లి, చావు, ఫాపింగ్ మాల్స్.. ఎక్కడైనా కనీసం నలుగురు కావాలన్నా... అందుకు జూనియర్ ఆర్టిస్టులే కావాల్సివుంటుంది.
ఒక సినిమాకు ఎంతమంది కావాలనేది... దర్శకుడు.. అసిస్టెంట్ డైరెక్టర్‌కు ముందురోజు రాత్రి వివరిస్తాడు. కో-డైరెక్టర్... ఆ సినిమా ప్రొడక్షన్ మేనేజర్‌కు తెలియజేస్తాడు. తను జూనియర్ ఆర్టిస్టుల సప్లయిర్‌కు తెలియజేస్తాడు. అతను.. తనవద్ద సభ్యులుగా నమోదు చేసుకున్న జూనియర్ ఆర్టిస్టుల్లో వయస్సువారీగా.. ఎవరు ఆయా పాత్రలకు సరిపోతారో.. ఎంపిక చేసి పంపిస్తుంటాడు. ఇది ప్రతిరోజు జరిగే తంతు.
జూనియర్ ఆర్టిస్టు అర్హతలు.. సభ్యత్వ రుసుం?
జూనియర్ ఆర్టిస్టుగా నమోదు కావాలంటే.. కనీస అర్హతంటూ ఏమీలేదు. చదువులేనివారు.. గుంపులో గోవింద క్యారెక్టర్లకు అర్హులు. కాస్త డిగ్రీ చదివి.. చూడ్డానికి బాగుంటే.. క్లాస్ పాత్రలకు అర్హులు. హీరో ఫ్రెండ్స్‌కి కూడా అర్హులు. (అయితే ఈ పాత్రలకు హీరో రికమండేషన్ కూడా అవసరం. లేదంటే.. అసిస్టెంట్ డైరెక్టర్ల స్నేహితులు.. ప్రొడక్షన్ మేనేజర్లకు తెలిసివాళ్ళు ఇందులో వుంటారు). అలాగే.. ఆడవారికి కూడా ఇదే తంతు... వీరి సభ్యత్వం గతంలో 500 రూపాయలు వుండేది. రానురాను.. 2 వేలు, 3 వేలు.. నుంచి.. ప్రస్తుతం 25 వేలకు పెరిగింది.
వీరి పని విధానం..
జూనియర్ ఆర్టిస్టుల పని విధానం.. రోజుకు 12 గంటలు.. 8 గంటల లేబర్ యాక్ట్ వీరికి వర్తించదు. ఉదయం 6 గంటలకల్లా లొకేషన్‌లో వుండాలని.. ముందురోజు రాత్రి వారికి ఫోన్ ద్వారా సప్లయిర్ తెలియజేస్తాడు. దానికి ప్రిపరేషన్‌గా షూటింగ్ రోజు.. తెల్లవారు జామున.. 5.30 గంటలకు.. కృష్ణానగర్, ఇందిరానగర్‌లో ఓ పాయింట్‌లో వుంటారు. అక్కడికి షూటింగ్‌కు సంబంధించిన... వాహనం వచ్చి వీరిని పికప్ చేసుకుంటుంది. ఆ తర్వాత తిరిగి షూటింగ్ అయ్యాక.. అదే ప్రాంతానికి తిరిగి దిగబెడతారు. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఒక కాల్షీట్ అంటారు. 6 దాటితే... రాత్రి 12 గంటలవరకు వుంటే ఫుల్‌డేగా కౌంట్ చేస్తారు. అందుకే చాలామంది తెలివిగా... రాత్రి 9 గంటల దాటకుండానే వారితో పనిచేయించుకుని.. టిఫిన్లు, టీలు ఇచ్చి పంపిస్తుంటారు. మూడు గంటలు ఎక్కువ చేశామని అడిగితే... ఆ తర్వాత రోజు.. అతనికి పని వుండదు. అందుకే చాలామంది.. బయట గొణుక్కుంటూ తిట్టుకుంటూ వుంటారు. మరి ఇంత జరిగినా.. ఈ పని చేయాలా? అంటే.. అది తప్ప ఇంకోపని చేతకాదనీ.. చెప్పే జూనియర్స్‌గా చాలామంది ఇండస్ట్రీలో వున్నారు.
జీతం ఎంత వస్తుంది?
రోజుకు జూనియర్ ఆర్టిస్టుల వయస్సుతో బేరీజు వేసుకుని.. రూ.750, 1000, 1500, 2 వేలు, 3 వేలు వరకు భత్యం ఇస్తుంటారు. దానికితోడు రోజూ బేటా కింద.. 100, 200, 300 వరకు అలవెన్స్ కింద ఇస్తుంటారు. చాలామంది.. ప్రొడక్షన్ వెహికల్‌లో రావడంతో.. బేటాలుండవు.
మోసం ఎలా జరుగుతుంది?
జూనియర్ ఆర్టిస్టులుగా పనిచేసి కాస్త తెలివిగలవారు.. క్రమేణా ప్రొడక్షన్ మేనేజర్ సాయంతో... దర్శక నిర్మాతల ప్రోత్సాహంతో సప్లయిర్ స్థాయికి చేరిపోతారు. ఇక అక్కడ నుంచి వారికి పండుగే పండుగ. ఎందుకంటే... ప్రతి జూనియర్ ఆర్టిస్టుకు ఆరోజు పని కల్పించినందుకు.. సప్లయిర్.. కొంత కమీషన్ తీసుకుంటాడు. షుమారు 750 రూపాయలు తీసుకున్న జూనియర్ నుంచి 100 నుంచి 200 వరకు కమీషన్ తీసుకుంటాడు. మహిళలైనా అదే పరిస్థితి.. అయితే రానురాను... వారి పేమెంట్ పెంచాలని డిమాండ్ పెరగడంతో.. 24 క్రాఫ్ట్‌లో ఒక భాగం కనుక.. వారికి ప్రస్తుతం 1500 నుంచి 2 వేల వరకు పెరిగింది. అంటే.. సప్లయిర్ కమీషన్ కూడా పెరిగిందన్నమాట.
మరి ఎందుకు గొడవలు జరుగుతున్నాయి?
జూనియర్ ఆర్టిస్టుల గొడవలు ఇప్పటివి కావు.. చాలాకాలం నుంచి మేనేజర్లకు, సప్లయిర్‌లకు, జూనియర్స్ మధ్య చిన్న పేచీలు వున్నాయి. సప్లయిర్.. తీసుకున్న కమీషన్‌లో ప్రొడక్షన్ మేనేజర్‌కు కొంత మొత్తం వెళుతుంది. అతను.. అసిస్టెంట్ డైరెక్టర్‌కూ కొంత ఇవ్వాల్సి వుంటుంది. ఇలా ఐస్ ముక్కలా.. చేతులు మారి.. అసలు జూనియర్ ఆర్టిస్టు చేతికి వచ్చేసరికి.. 1000 రూపాయలేతై.. 7 వందలే దక్కుతుంది. పెద్ద సినిమాలకు ఇది లాభదాయకం.. ఒక రోజు షూటింగ్‌కు.. 50, 100 మంది జూనియర్ ఆర్టిస్టులు కావాలంటే... ప్రతి వ్యక్తిపై.. సప్లయిర్‌కు కనీసం 100 రూపాయల కమీషన్ వస్తుంది. అంటే మొత్తం 10 వేల కమీషన్ వస్తుంది. ఒక్కోసారి 200 కమీషన్ తీసుకుంటే.. 20 వేలు దక్కుతుంది. ఇది లాభసాటిగా మారడంతో.. తెలివైన వారు ఇలా జూనియర్ ఆర్టిస్టులపై సంపాదించే సప్లయిర్లు, మేనేజర్లు.. ప్రస్తుతం ఎక్కువయ్యారు.
సప్లయర్ కావాలంటే.. జూనియర్ ఆర్టిస్టు అసోసియేషన్‌లో తప్పనిసరిగా సభ్యుడు అయివుండాలి. కనీసం 5 ఏళ్ళ సీనియర్ అయివుండాలి. అందుకు సప్లయిర్ లక్ష రూపాయల సభ్యత్వ రుసుం తీసుకోవాలి. కానీ ఇవేవీ లేకుండా కొందరు రికమండేషన్‌పై.. వచ్చేయడం.. కాదంటే.. కొందరిని పోగు చేసుకుని తామే కొత్తగా సప్లయిర్ ఏజెంట్ అని అసోసియేషన్ పెట్టుకోవడం జరుగుతుంది. గతంలో ఇలాంటి సఘటనలు జరిగితే.. ఫెడరేషన్‌లో పెట్టి వారిని తీయించిన సందర్భాలున్నాయి. మరలా కొద్దిరోజుల తర్వాత మామూలే. ఇలాంటివి సంఘటనలు జరుగుతున్నా... సీరియస్‌గా తీసుకున్న దాఖలాలు లేవు. ఎందుకంటే.. కొత్తగా అసోసియేషన్ పెట్టేవారు ఇండస్ట్రీలో ఎవరో ఒకరు అండగా నిలవడమే. వీడు పలానా వాడి తాలూకా అని సర్దిచెప్పుకోవాల్సి వస్తుందన్నమాట.
తాజాగా మంచు మనోజ్.. షూటింగ్.. వైజాగ్‌లో జరిగిన తంతే ఇదే. వైజాగ్‌లో కొత్తగా జూనియర్ ఆర్టిస్టు అసోసియేషన్ ద్వారా సప్లయిర్.. కొంతమందిని 15 రోజుల పాటు పంపాడు. అయితే అక్కడ రోజుకూలీ కింద 750 రూపాయలు నిర్మాత ఇస్తే.. మేనేజర్.. సప్లయర్లు కలిసి.. వారికి 250 రూపాయలు ఇచ్చి.. సరిపెడుతుంటారు. ఒక్కోసారి.. సినిమాలో ఛాన్స్ ఇవ్వడమే గొప్పగా చెబుతుంటారు. మరో ప్రత్యేకత ఏమంటే.. ఈమధ్య చాలామంది చదువుకున్న వాళ్లు.. కనీసం తెరపై కన్పించాలనే కుతూహలతో ఇలాంటి మేనేజర్లను కలుస్తుంటారు.
వారైతే ఎదురు డబ్బులిచ్చి.. జూనియర్ ఆర్టిస్టులుగా నటిస్తుంటారు. ఎటుచూసినా.. మేనేజర్లు, సప్లయిర్‌కు లాభమే. దాంతో మేనేజర్లు.. నిర్మాత స్థాయికి ఎదిగినవారు వున్నారు. దీంతో కేవలం దీనిపై ఆధారపడే వారు అన్యాయమవుతున్నారు. వైజాగ్‌లో జరిగింది అదే. కొత్తగా ఇండస్ట్రీలో వైజాగ్‌లో వస్తుందనీ, షూటింగ్‌లు జరుగుతున్నాయనీ, తమ టాలెంట్ నిరూపించుకోవాలని వచ్చిన జూనియర్ ఆర్టిస్టులకు.. కనీస వేతనం ఇవ్వకుండా.. మేనేజర్లు నొక్కేయడంతో.. కడుపు మండి.. మేనేజర్లను తిట్టడంతో వారు సహించలేక నిర్మాతపై నిందమోపి తాగివచ్చి గొడవ చేశారు. ఈ విషయాన్ని పోలీసులు నిర్థారించేసరికి మేనేజర్లు.. ఖంగు తిన్నారు. ఇదిలావుంటే.. మేనేజర్లుగా వుండి.. నిర్మాతలుగా మారిన వారూ వున్నారు. రియల్ ఎస్టేట్ రగంలో వుంటూ.. కోట్లు సంపాదించినవారూ వున్నారు.
ఇందుకు ఉదాహరణ కొమరం వెంకటేష్. ఈయన హైదరాబాద్‌లో సినిమా రంగం వచ్చినప్పటి నుంచి జూనియర్‌గా చేరారు. క్రమేణా తెలివితేటల్తో ప్రముఖుల అండదండలతో ఎదిగారు. ఇప్పుడు 24 క్రాఫ్ట్ అసోసియేషన్‌కు అధ్యక్షుడయ్యారు. సినీ ఇండస్ట్రీలో కోట్లు సంపాదించారు. ఆ తర్వాత కళ్యాణ్ రామ్‌తో సినిమానూ తీశారు. ఇక మరో మేనేజర్ వెంకట్ వున్నారు. బాహుబలి సినిమాకు ప్రొడక్షన్ మేనేజర్ ఇతను. రాజమౌళికి అతి సన్నిహితుడు. బాహుబలి పుణ్యమా అని కోటీశ్వరుడయ్యాడు. తను జీవితంలో సెటిల్ అయ్యాననీ... అతని సన్నిహితుల వద్దే వ్యాఖ్యానించడం విశేషం.
కొన్ని మోసాలు...
ఇండస్ట్రీ గురించి బాగా అవపోసన పట్టినవారు... కొత్తగా అసోసియేషన్లు పెట్టేసి.... ఇలా ప్రొడక్షన్ మేనేజర్లుగా మారడంతో.. జూనియర్ ఆర్టిస్టులకు ఏదైనా షూటింగ్‌లో ప్రమాదం జరిగితే... నిర్మాత పూచీకాదు.. అధికారికంగా.. అసోసియేషన్ వచ్చినవారికే తగిన సౌకర్యాలుంటాయి. అందుకే.. ముందుగానే.. జూనియర్స్ నుంచి లిఖితపూర్వకంగా లెటర్ రాసుకుని.. వారిని షూటింగ్‌లకు పంపిస్తుంటారు.. అంటే చాలా తెలివిగా మేనేజర్లు పనిచేస్తుంటారన్నమాట.
దీనికి పరిష్కారం లేదా?
లేదంటే లేదు. ఉదంటే ఉంది. దర్శకనిర్మాతలు ప్రతీదీ చూడలేరు. అన్నీ మేనేజర్లపై భారం వేస్తారు. ఆయన కరెక్ట్‌గా వుంటే అన్నీ సర్దుకుంటాయి. లేదంటే.. మనోజ్ సినిమాకు జరిగిన జిమ్మిక్కులే జరుగుతుంటాయి. అంతా సినీమాయ.