ఈ చిత్రంతోనే ఉదయ్ కిరణ్ హీరోగా పరిచయం అయ్యాడు. ఆయనకు జోడీగా ముంబై భామ రీమా సేన్ నటించింది. ఈ చిత్రం సాధించిన విజయం గురించి అప్పట్లో ఇండస్ట్రీ చాలా రోజుల వరకు మాట్లాడుకుంది. ముఖ్యంగా చిరు, నాగార్జున లాంటి వాళ్లు ఉదయ్ కిరణ్‌ను ప్రత్యేకంగా అభినందించారు. చిత్రం సినిమా సాధించిన విజయం గురించి తెలుసుకుని అంతా ప్రశంసలతో ముంచెత్తారు. ఈ సినిమాలో తనికెళ్ళ భరణి, ఢిల్లీ రాజేశ్వరి కామెడీ హైలైట్‌గా నిలిచింది. చిన్న వయసులోనే తల్లి తండ్రులుగా మారిన కాలేజీ పిల్లల కథ ఇది.
ఆర్పీ పట్నాయక్ అందించిన సంగీతం కూడా ఈ సినిమాకు వరంగా మారింది. మొత్తంగా ఓ అద్భుతమైన హీరోను తెలుగు తెరకు అందించింది చిత్రం సినిమా. ఈ సినిమా తర్వాత నువ్వు నేను, మనసంతా నువ్వే, నీ స్నేహం లాంటి సినిమాలతో ఉదయ్ కిరణ్ స్టార్ అయిపోయాడు. కానీ ఆ తర్వాత ఆయన జీవితం విషాదంగా ముగిసింది. చిత్రం సినిమా 21 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా మరోసారి ఆయన్ని గుర్తు చేసుకుంటున్నారు అభిమానులు.