90వ దశకంలో రాజమండ్రి బ్యాక్ డ్రాప్ కథతో విశ్వక్ సేన్ కొత్త చిత్రం

బుధవారం, 26 ఏప్రియల్ 2023 (15:01 IST)
viswaksen-dil raju
విశ్వక్ సేన్  ప్రధాన పాత్రలో ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్‌తో కలిసి నిర్మిస్తున్న 'VS11'(వర్కింగ్ టైటిల్) పూజా కార్యక్రమాలతో బుధవారం ఉదయం ప్రారంభమైంది. సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి ప్రతిభావంతులైన కృష్ణ చైతన్య రచన, దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ ఈచిత్రానికి సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. 
 
ఈ చిత్రం పూజా కార్యక్రమంలో ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, బోయన్‌పల్లి వెంకట్, సుధాకర్ చెరుకూరి, రామ్ ఆచంట, గోపీ ఆచంట, సాహు గారపాటి, హరీష్ పెద్ది, దర్శకులు వెంకీ అట్లూరి, మల్లిక్ రామ్, శ్రీకాంత్ ఎన్ రెడ్డి, కళ్యాణ్ శంకర్ వంటి పలువురు సినీ ప్రముఖులు పాల్గొని చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు.
 
విశ్వక్ సేన్ స్వతహాగా విజయవంతమైన రచయిత, దర్శకుడు కావడంతో ఈ యువ నటుడు విభిన్నమైన జానర్‌లతో మనల్ని అలరిస్తున్నారు. ఈసారి కూడా కూడా ఆయన మరో విభిన్న జానర్ లో, అద్భుతమైన కథతో వస్తున్నారు. ఈ కథ పట్ల, అందులోని ఆయన పాత్ర పట్ల విశ్వక్ సేన్ ఎంతో ఉత్సాహంగా ఉన్నారు.
 
90వ దశకంలో రాజమండ్రి పరిసరాల నేపథ్యంలో జరిగిన కథతో రూపొందుతోన్న 'VS11' కోసం చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ సాంకేతిక నిపుణులు పని చేస్తున్నారు. ఈ చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకుడు యువన్ శంకర్ రాజా స్వరకర్త. సినిమాటోగ్రాఫర్ గా అనిత్ మధాది, ఆర్ట్ డైరెక్టర్ గా గాంధీ నడికుడికర్, ఎడిటర్ గా జాతీయ అవార్డు విజేత నవీన్ నూలి వ్యవహరిస్తున్నారు. అటువంటి ప్రతిభావంతులైన మరియు నిష్ణాతులైన బృందంతో కలిసి.. కథల ఎంపికలో ప్రసిద్ధి చెందిన ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ 'VS11' రూపంలో మరో ఆసక్తికర చిత్రాన్ని అందించబోతున్నట్లు హామీ ఇస్తోంది.
 
చిత్ర ప్రారంభం సందర్భంగా నిర్మాత సుధాకర్ చెరుకూరి కెమెరా స్విచాన్ చేయగా,నిర్మాత  దిల్ రాజు ఫస్ట్ క్లాప్ ఇచ్చారు. మొదటి షాట్ కి నిర్మాత వెంకట్ బోయనపల్లి దర్శకత్వం వహించారు. దర్శకులు వెంకీ అట్లూరి, నిర్మాత రామ్ ఆచంట తమ చేతుల మీదుగా స్క్రిప్ట్ ని చిత్ర బృందానికి అందజేశారు.
 
మే నుండి VS11 రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమవుతుంది. ఈ చిత్రంలో నటిస్తున్న ఇతర ముఖ్య తారాగణం వివరాలు అతి త్వరలోనే ప్రకటించనున్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని ఆసక్తికరమైన అప్డేట్స్ ని అందిస్తామని మేకర్స్ హామీ ఇచ్చారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు