Deen Raj, Dr. Shankar Naidu
ఈ చిత్రం షూటింగ్ సందర్భంగా పడిన కస్థాల గురించి దర్శకుడు దీనరాజ్ మాట్లాడుతూ... "చైనా బోర్డర్‌లో ఎన్నో వ్యయప్రయాసలకోర్చి షూటింగ్ చేసుకున్న తెలుగు చిత్రం "భారతీయన్స్". డ్రోన్స్‌తో షూట్ చేయడానికి, బాంబ్ పేలుళ్లు జరపడానికి, అడవుల్లో షూటింగ్‌కు ప్రభుత్వం నుంచి ప్రత్యేక అనుమతులు తీసుకున్నాం. వర్షాలు కురిసి, కొండచరియలు విరిగిపడి ఎప్పుడు షూటింగ్ ఆగిపోతుందో తెలియని పరిస్థితుల్లో షూటింగ్ చేశాం. ఒక్కోసారి మధ్యాహ్నం 2 గంటలకే లైటింగ్ ఫెయిల్ అయి షూటింగ్ చేయలేకపోయేవాళ్ళం. చిత్ర యూనిట్ సభ్యులకు ఈశాన్య రాష్ర్టాల ఫుడ్ సరిపడకపోవడంతో ఆరోగ్య సమస్యలు ఎదురయ్యేవి. కొండచరియలతోపాటు.. చెట్లు విరిగి మా కార్లమీద పడడంతో కొందరు యూనిట్ సభ్యులు బతుకు జీవుడా అని దొరికిన వాహనాన్ని పట్టుకుని హైదరాబాద్ వచ్చేశారు. షూటింగ్ చేస్తున్నప్పుడు ఒక లోకల్ కారు డ్రైవర్ తాగి గొడవ చేస్తుంటే, హైదరాబాద్ మేనేజర్ అతన్ని కొట్టాడు. దాంతో లోకల్ రౌడీషీటర్ ఎంటరై షూటింగ్ ఆపేస్తానని ఆవేశంతో రెచ్చిపోయాడు. ఆ రౌడీషీటర్‌ని సముదాయించి, సినిమాలో చిన్న వేషం ఇచ్చి ఆ సమస్యను ఎలాగో పరిష్కరించాం.