ఎ.పి.లో సినిమా దుస్థితికి కారకులు ఎవరు?, ఇప్పుడు నాని, తర్వాత పవన్ కళ్యాణ్, మెగాస్టార్?!!
శుక్రవారం, 24 డిశెంబరు 2021 (18:44 IST)
jagan, anil
ఎ.పి.లో సినిమా టికెట్ల వ్యవహారం మరలా పవన్ కళ్యాణ్ వైపు మళ్ళింది. గతంలోనే పవన్ ఘాటుగా పేర్ని నానిపై విమర్శలు సంధిస్తే, అది ఆయన వ్యక్తిగతం అంటూ కొందరు సినీ ప్రముఖులు తప్పించుకున్నారు.
ఇప్పుడు థియేటర్ల మూత, టికెట్ల తగ్గింపు నిర్ణయాల వల్ల వారి పీకలపైకి వచ్చింది. కానీ ఎవ్వరూ కిక్కురుమనడంలేదు. దానికి కారణం. సినీ పరిశ్రమలోని పెద్దల అవగాహనా రాహిత్యమేనని తెలుస్తోంది. సహజంగా సినీ పరిశ్రమ ఎ.పి.లో ఎవరు పాలనలో వుంటే వారికి మద్దతుగా నిలుస్తుంది. గతంలో చంద్రబాబు హయాంలో పరిశ్రమ అంతా ఒక్కతాటిపై వుండి ఆయనకు సమస్యలు తెలియజేశారు.
కానీ, ఇప్పుడు ఎ.పి.లో వున్న వ్యవహారం ఇప్పుడు కులాల కుంపటిగా మారిందని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. అందుకు కారణం కూడా లేకపోలేదు. వై.ఎస్. జగన్ ముఖ్యమంత్రి అయ్యాక తెలుగు సినీ పరిశ్రమ నుంచి పెద్దలు ఎవ్వరూ శుభాకాంక్షలు చెప్పకపోవడంతోపాటు కనీసం సోషల్ మీడియాలో కూడా కొద్దికాలం దూరంగా వున్నారు. అప్పటికే చంద్రబాబు అనుకూలమే సినీ పరిశ్రమ అనే ప్రచారం కూడా వుంది.
ఫైనల్‌గా మోహన్‌బాబు వంటి ఒకరిద్దరు జగన్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు. ఆ తర్వాత కొంత కాలానికి సి.కళ్యాణ్‌తోపాటు మరికొందరు జగన్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు. దీన్నిబట్టి చూస్తే జగన్ ప్రభుత్వం సమయం చూసి సినిమా వాళ్ళపై అస్త్రం ఎక్కుపెట్టిందని అర్థమవుతుందని విశ్లేషకులు తెలియజేస్తున్నారు.
కరోనా తర్వాత సినీ పరిశ్రమ కుదుటపడుతుందన్న సమయంలో ఆన్‌టైన్ టిక్కెట్లు, టిక్కట్ల పెంపు అనేది లేదని ఎ.పి. ప్రభుత్వం తేల్చి చెప్పింది. సరిగ్గా ఇదే టైంలో హీరో నాని సినిమా శ్యామ్ సింగరాయ్ విడుదల రోజునే ఎ.పి.లో కొన్ని థియేటర్ల మూసివేయడం ఆర్థికంగా దెబ్బ తీసింది. నానిని కూడా ఓ వర్గానికి చెందినవాడిగా భావించినందువల్లే ఇలా జరిగిందని కొందరంటే, ముందుముందు రాబోయే చిరంజీవి, పవన్‌కళ్యాణ్, రాజమౌళి సినిమాలకు చెక్ పెట్టేందుకు ఇలా చేసుంటారని మరికొందరు తెలియజేస్తున్నారు.
ఈ విషయమై నెల్లూరులో మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ మీడియాతో మాట్లాడుతూ సినిమా టికెట్లు పెంచాలని కోరుతున్న వారిపై విరుచుకుపడ్డారు. హీరో నాని ఎవరో తనకు తెలియదని మంత్రి వ్యంగ్యంగా అన్నారు. తనకు తెలిసిందల్లా మంత్రి కొడాలి నాని మాత్రమే అని అన్నారు. కేవలం టికెట్ రేట్ తగ్గితే తమ రెమ్యునరేషన్ తగ్గుతుందనే బాధతోనే కొందరు అవాకులు చెవాకులు పేలుతున్నారని ఆయన విరుచుకుపడ్డారు. రూ.50 కోట్ల రెమ్యునరేషన్ రూ.25 లేదా రూ.30 కోట్లకు తగ్గుతుందనే బాధ తప్ప, వారి ఆవేదనలో అర్థం లేదన్నారు.
భీమ్లా నాయక్, వకీల్‌సాబ్‌కి పెట్టిన ఖర్చెంత?. పవన్‌కల్యాణ్ తీసుకున్న రెమ్యునరేషన్ ఎంత? ప్రజలని ఉద్దరిస్తానన్న పవన్ తక్కువ రేటుకే వినోదాన్ని పంచొచ్చు కదా అని మంత్రి ప్రశ్నించారు. ఫైనల్‌గా అటుఇటూ చేసి దాడి పవన్ కళ్యాణ్ పై పడింది. అంటే ఎ.పి.లో పవన్ ధాటికి భయపడినట్లుగానే వుందని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. మరి ఈ సమస్య ఎంతవరకు వెళుతుందో చూడాలి.