హాలీవుడ్ సూప‌ర్‌స్టార్ విల్ స్మిత్‌కు ప్రత్యేక విందు పార్టీ ఇచ్చిన అక్షయ్ కుమార్

సోమవారం, 29 ఆగస్టు 2016 (13:17 IST)
బాలీవుడ్‌లో యాక్షన్ హీరోగా తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ని అందుకున్న హీరో అక్షయ్‌ కుమార్ ప్రస్తుతం కొన్ని ప్రయోగాత్మక చిత్రాలలోనూ నటిస్తున్నాడు. ఈ ఏడాది అక్షయ్‌ కుమార్ నటించిన ''హౌస్ ఫుల్3'', ''రుస్తుం'', ''ఎయిర్ లిఫ్ట్'' వంటి చిత్రాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కూడా కురిపించాయి. తాజాగా విడుదలైన ''రుస్తుం'' సినిమా హిట్‌తో అక్షయ్ కుమార్ ఫుల్ ఖుషి ఖుషీగా ఉన్నాడు. 
 
ఈ సంతోషాన్ని ఈ హీరో ఎవరితో పంచుకున్నాడో తెలుసా? హాలీవుడ్ సూప‌ర్‌స్టార్ విల్ స్మిత్‌తో. ఈ ఇద్ద‌రూ అక్ష‌య్ ఇంటి బ‌య‌ట కెమెరాల‌కు పోజులిచ్చారు. వ‌ర‌స‌గా మూడు హిట్లు వ‌చ్చిన సంద‌ర్భంగా అక్ష‌య్ త‌న స‌న్నిహితుల‌కు ఈ పార్టీ ఇచ్చాడు. ఈ సెల‌బ్రేష‌న్స్‌కు విల్ స్మిత్ స్పెష‌ల్ గెస్ట్‌గా హాజరయ్యాడు. అక్షయ్ కుమార్ భార్య ట్వింకిల్ ఖన్నా, ఇతర బాలీవుడ్ తారలు అలియా భ‌ట్‌, శ్ర‌ద్ధ క‌పూర్‌, సోనాక్షి సిన్హా, జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌, సోన‌మ్ క‌పూర్ కూడా ఈ పార్టీకి విచ్చేశారు. 
 
ఈ సంద‌ర్భంగా పార్టీలో దిగిన ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది అలియా భ‌ట్‌. అతిథులను అక్షయ్ పేరుపేరునా పలకరించాడు. తన అభిరుచికి అనుగుణంగా వంటలు తయారు చేయించాడు. విల్ స్మిత్‌ను అతిథులకు పరిచయం చేశాడు. విల్ స్మిత్ కూడా అందరినీ అప్యాయంగా పలకరించాడు. పార్టీ ముగిసిన తర్వాత మీడియా కోసం విల్ స్మిత్, అక్షయ్ కుమార్ ఫొటోలకు ఫోజులిచ్చారు. ప్రస్తుతం ఈ ఫోటో సామాజిక మాధ్యమాలలో హాల్ చల్ చేస్తుంది.

వెబ్దునియా పై చదవండి