నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ మాట్లాడుతూ "సమంత ప్రధాన తారగా మేం నిర్మిస్తున్న 'యశోద' సినిమాలో 30 నుంచి 40 శాతం సన్నివేశాలు ఓ ప్రాంతంలో జరుగుతాయి. అందుకోసం హైదరాబాద్‌లో చాలా స్టార్ హోటల్స్ చూశాం. అయితే... 35, 40 రోజులు హోటల్స్‌లో చిత్రీకరణ చేయడం అంత సులభం కాదు. అందుకని, సీనియర్ కళా దర్శకుడు అశోక్ నేతృత్వంలో సెట్స్ రూపొందించాం. నానక్‌రామ్ గూడాలోని రామానాయుడు స్టూడియోలో రెండు ఫ్లోర్స్ తీసుకుని వేసిన ఈ సెట్స్ కోసం సుమారు మూడు కోట్ల రూపాయలు ఖర్చు అయ్యింది. డైనింగ్ హాల్, లివింగ్ రూమ్, కాన్ఫరెన్స్ హాల్, లైబ్రరీ... సెవెన్ స్టార్ హోటల్లో ఉండే సౌకర్యాలను తలపించేలా ఏడెనిమిది సెట్స్ వేశాం. ఫిబ్రవరి 3న మొదలైన షెడ్యూల్ అక్కడే జరుగుతోంది. సమంత, వరలక్ష్మీ శరత్ కుమార్, ఉన్ని ముకుందన్ తదితర ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నాం. పతాక సన్నివేశాలు కొడైకెనాల్లో ప్లాన్ చేశాం. జనవరిలో సంక్రాంతికి ముందు ఒక షెడ్యూల్, డిసెంబర్ 6 నుంచి క్రిస్మస్ వరకూ తొలి షెడ్యూల్ చేశాం. ఏప్రిల్ నెలాఖరుకు చిత్రీకరణ అంతా పూర్తి చేయాలనుకుంటున్నాం. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఏక కాలంలో విడుదల చేస్తాం" అని చెప్పారు.