నాడు యూఎస్ ఎలా స్పందించిందో అలానే స్పందించాం : నెతన్యాహు

ఠాగూర్

గురువారం, 11 సెప్టెంబరు 2025 (17:09 IST)
గతంలో 9/11 దాడులు జరిగినపుడు అమెరికా ఎలా స్పందించిందో ఇపుడు కూడా తాము దోహాపై దాడులు చేశామని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు వెల్లడించారు. హమాస్ కీలక నేతలే లక్ష్యంగా ఖతార్‌ రాజధాని దోహాపై ఇజ్రాయెల్‌ భీకర దాడులు చేసిన విషయం తెల్సిందే. ఈ దాడులను అనేక ప్రపంచ దేశాలు ఖండించాయి. అయితే, ఈ దాడులను ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు సమర్థించుకున్నారు. అక్టోబరు 7న ఇజ్రాయెల్‌పై హమాస్‌ చేసిన దాడులను.. అమెరికాలో జరిగిన 9/11 దాడులతో పోల్చారు. 
 
గురువారం ఆయన ఓ వీడియోలో మాట్లాడారు. హమాస్‌తో యుద్ధానికి దారితీసిన అక్టోబరు 7 నాటి దాడులను ఆయన ప్రస్తావించారు. వీటిని అమెరికాలో జరిగిన 9/11 దాడులతో పోల్చుతూ.. నాడు యూఎస్ ఎలా స్పందించిందో ప్రస్తుతం తాము అలాగే చేశామన్నారు. '9/11 దాడుల తర్వాత వాటికి కారణమైన ఉగ్రవాదులు ఏ దేశంలో ఉన్నా వెంటాడి హతమారుస్తామని నాడు అమెరికా చెప్పింది. దీనిపై ఐక్యరాజ్యసమితిలో తీర్మానం కూడా చేసింది. ఇప్పుడు మేము అదే చేశాం' అని నెతన్యాహు పేర్కొన్నారు.
 
ఈ సందర్భంగా ఆప్ఘనిస్థాన్‌లో అల్‌-ఖైదా ఉగ్రవాదులను వెంటాడి, అనంతరం పాకిస్థాన్‌లో ఉన్న కరుడుగట్టిన ఉగ్రవాది, అల్‌ఖైదా నేత ఒసామా బిన్‌లాడెన్‌‌ను అమెరికా బలగాలు ముట్టుబెట్టిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. తమ చర్యలను ఖండిస్తున్న పలు దేశాలను నెతన్యాహు తప్పుబట్టారు. ఆత్మరక్షణ కోసం, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా తాము కట్టుబడి ఉన్నామన్నారు. ఇందుకు తమను ప్రశంసించాల్సింది పోయి.. తప్పుబడుతున్నారంటూ అసహనం వ్యక్తంచేశారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు