ఓ బేబీలో చురుగ్గా నటించిన తేజ సజ్జా సినిమాను చూసి ఇష్క్ సినిమాలో నటించడానికి అంగీకరించానని ప్రియా ప్రకాష్ వారియర్ చెప్పింది. ఆ తర్వాత జాంబి రెడ్డితో హీరోగా తనేంటే రుజువు చేసుకున్నాడు తేజ. అందులో ఆసక్తికరమైన కథ, కథనాలు కొత్తగా అనిపించాయి. కానీ ఈసారి మలయాళంలో వచ్చిన ఇష్క్‌ను అదే పేరుతో రీమేక్ లో నటించాడుతేజ సజ్జా. మెగా సూపర్ గుడ్ ఫిలిమ్స్ నిర్మాణం అనగానే ఎంతో క్రేజ్ నెలకొంది. మరి ఈరోజే విడుదలైన సినిమా ఎలా వుందో చూద్దాం.
కథ:
సిద్ధు (తేజ సజ్జా) వైజాగ్‌లో ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగి. ఆ ఊరిలోనే హాస్టల్‌లో వుంటున్న అను (ప్రియా ప్రకాష్ వారియర్)ను ప్రేమిస్తాడు. ఇద్దరూ ఒకరంటే ఒకరికి ఇష్టం. కాగా, తన సోదరికి తెల్లారితే పెండ్లి అనగా ముందురోజు సిద్దు, అనుతో కారులో లాంగ్ డ్రైవ్‌కి ఫిక్స్ చేస్తాడు. ఫ్రెండ్ కారును తీసుకుని తెల్లారి ఇచ్చేస్తానని బయలు దేరతాడు. అలా ఊరంతా తిరిగిన ఈ ప్రేమికులు రాత్రికి ఓ చోట కారును పార్క్ చేసి ముద్దులు పెట్టుకోవడానికి ప్రయత్నిస్తారు. షడెన్‌గా పోలీసులమంటూ ఇద్దరు వచ్చి వారి ఏకాంతాన్ని భగ్నం చేయడమేకాకుండా అనుపై అసభ్యంగా ప్రవర్తిస్తారు. అలా వారు అనును టార్చర్ పెడుతుంటే ఏమీచేయలేని స్థితిలో సిద్దు వుంటాడు. చివరికి కొంత డబ్బుతీసుకుని వారు ఈ ప్రేమికులను వదిలేస్తారు. కానీ ఏకాంతంలో వుండగా వారు తీసిన ఫొటోల కోసం సిద్దు పోలీస్ స్టేషన్‌కు వస్తాడు. ఇక అక్కడ సిద్ధుకు ఎదురైన సంఘటన షాక్‌కు గురిచేస్తుంది. ఆ తర్వాత సిద్ధు ఏంచేశాడు? అనేది మిగిలిన కథ.
విశ్లేషణః
- మలయాళ సినిమాలన్నీ ఓ చిన్న సంఘటనను తీసుకుని పెద్ద కథలను అల్లి తీస్తుంటారు. అలాంటివే దృశ్యం వంటి సినిమాలు. అలాంటి సంఘటన ఇష్క్ కూడా. అయితే మలయాళంలో తీసినట్లుగా యథాతథగా తీసేశారు తెలుగులో కూడా. దిల్‌రాజు డైరెక్టన్ డిపార్ట్‌మెంట్‌లో పనిచేసిన ఎస్.ఎస్.రాజు కథపరంగా ఏదైనా సీన్ జరిగితే ఇలా ఎందుకు? అలా ఎందుకు? అంటూ రకరకాలుగా ప్రశ్నించేవాడని దిల్‌రాజే స్వయంగా చెప్పాడు. అదే మైండ్‌సెట్ తేజ సజ్జాది కూడా. మరి ఇద్దరూ ఇంత బాగా ఆలోచించిన వారు కొన్ని లాజిక్కులను గుడ్డిగా మిస్ చేసేశారు.
- కారులో ఏకాంతంగా వుండగా పోలీసులుగా వచ్చిన వారు కాసేపటికి దూరంగా వెళ్ళిపోతారు. కానీ సిద్దు పారిపోవడానికి ప్రయత్నించడు. ఆ సీనంతా ఇంటర్‌వెల్‌వరకు సాగదీతగా సీరియల్‌ను తలదన్నేలా వుంటుంది.
- ఫైనల్‌గా యూత్‌కు హెచ్చరికలాంటిది ఈ సినిమా ద్వారా చెప్పదలిచారు.
- బయట ప్రేమ జంటలపై జరుగుతున్న దాడులు, ఆకతాయిల అల్లర్లు ఏ మేరకు ఉంటాయనేది చూపించే ప్రయత్నం చేశారు.
- ప్రేమ అనేది స్వచ్చంగా వుండాలి. ఒకరిపై ఒకరు ఎలాంటి అనుమానాలు పెట్టుకోకూడదు. పెట్టుకుంటే అను ఇచ్చిన తీర్పే ప్రతి అమ్మాయి తమ ప్రేమికుడుకి ఇస్తుంది.
- నటుడిగా హావభావాలు తేజ బాగా పలికించాడు. అవమానం గురైన ప్రేయసిగా ప్రియాంక బాగానే నటించింది. మాధవ్ పాత్రలో నటించిన వ్యక్తి బాగా పండించాడు.
- ముఖ్యంగా సినిమాలో ఒకే ఒక పాయింట్ నచ్చుతుంది. అనును ఎంత ఇదిగా టార్చర్ పెట్టాడే అంతే ఇదిగా సిద్దు, మాధవ్ కుటుంబానికి పెడితే ఎలావుంటుందనేది లాజిక్ బావుంది. అంతకుమించి ఈ సినిమా గురించి పెద్దగా చెప్పుకోవడానికి ఏమీలేదు. ఇది కేవలం ఓటీటీలోనైనా రిలీజ్ చేస్తే అందరికీ చూసేట్లుగా వుండేది. థియేటర్ అనేసరికి తెలుగు ప్రేక్షకులకు అంత ఓపికగా చూస్తారో లేదో చూడాల్సిందే.
- మహతి స్వర సాగర్ సంగీతం బాగానే అనిపిస్తుంది. సిద్ శ్రీరామ్ పాడిన పాట ఆకట్టుకుంటుంది.