కథః
అభి (విరాజ్ అశ్విన్) ఉన్నత కుటుంబానికి చెందిన కుర్రాడు. తండ్రిలేకపోవడంతో తల్లి సంరక్షణలో పెరుగుతాడు. తల్లి భాను (అర్చనా అనంత్), డాక్టర్ ప్రేమ్ (అనీష్ కురువిల్లా)ను వివాహం చేసుకుంటుంది. అది అభికి నచ్చదు. కోట్ల ఆస్తి వుండడంతో బాధ్యతలేకుండా స్నేహితులతో ఎంజాయ్ చేస్తుంటాడు. ఇంకోవైపు భర్తను కోల్పోయిన ప్రియ (అనసూయ భరద్వాజ్) మధ్యతరగతి అమ్మాయి. గర్భిణి కూడా. తన భర్తకు రావాల్సిన డబ్బులు కోసం ఓ సంస్థ అధినేతను కలవడానికి అపార్ట్‌మెంట్‌కు వెళుతుంది. ఒకే సమయంలో అటు అభి, ఇటు ప్రియ లిఫ్ట్ ఎక్కుతారు. టెక్నికల్ సమస్యతో లిఫ్ట్ ఆగిపోతుంది. సరిగ్గా అది లాక్‌డౌన్ సమయం. మెకానిక్ అందుబాటులో వుండడు. ఈ పరిస్థతిలో ప్రియ పురిటినొప్పులు మొదలవుతాయి. లిఫ్ట్ లో వున్న అభికి భయమేస్తుంది. ఆ తర్వాత ఏమి జరిగింది? అనేది మిగిలిన కథ.
విశ్లేషణః
లిఫ్ట్ లో లాక్‌డౌన్ సమయంలో ఇద్దరు ఇరుక్కుపోవడం,దాన్నుంచి ఎలా బయటపడ్డారనే చిన్న పాయింట్‌ను దర్శకుడు రాసుకున్న కథ. లాక్‌డౌన్ సమయంలో చాలా చోట్ల ఇలాంటి సంఘటనలు జరిగినవే. మెకానిక్‌లు అందుబాటులో వుండరు. అందులో గర్భిణీ వుంటే పరిస్థితి ఏమిటి? అనేది దర్శకుడు అల్లిన పాయింట్. దీన్ని చూసే ప్రేక్షకుడికి టెన్షన్ పెట్టించడం కూడా కత్తిమీద సామే. దాన్ని దర్శకుడు సమర్థవంతంగా తీశాడు.
ప్రధానంగా చెప్పాల్సింది. డబ్బున్నదన్న అహంకారం, ఎవ్వరినీ లెక్కలేని తనం, కుర్రతనంతో పబ్‌ల చుట్టూ తిరగడం, తల్లి అంటే హేహ్యభావం వున్న విరాజ్ పరిస్థితులవల్ల అనసూయతో లిఫ్ట్ లో వున్న సమయంలో జరిగిన సంఘటనతో అమ్మతనం అంటే ఏమిటి? మహిళను ఏవిధంగా గౌరవించాలనేది అతనిలో మార్పును తీసుకువస్తుంది. ఇక అమ్మతనం అనేది అనసూయ పాత్ర ద్వారా చూపించాడు. ఆమె ఈ పాత్రను పోషించడానికి సరైన నటి అనే చెప్పాలి.
తల్లిని పట్టించుకోని ఓ కుర్రాడు తప్పని పరిస్థితుల్లో ఓ తెలియని మహిళకు డాక్టర్‌గా డెలివరీ చేయాల్సి వస్తే ఎంత మానసిక క్షోభను అనుభవించాడు, తద్వారా అతని ఆలోచన విధానంలో ఎలాంటి మార్పు వచ్చిందనే విషయాన్ని దర్శకుడు ఇందులో చూపించే ప్రయత్నం చేశాడు. మన కళ్ళముందు జరిగిన కథగా ఆడియెన్స్ ఫీల్ అవుతారు. కుర్రాడు మహిళకు డెలివరీ చేయడం అనే పాయింట్ 'త్రీ ఇడియట్స్' మూవీలో ఇప్పటికే చూశాం. ఇక అపార్ట్‌మెంట్‌లోనే వున్న ఓ కుర్రాడు మారిన టెక్నాలజీ వల్ల లిఫ్ట్‌లోని సన్నివేశాలన్ని బయట ప్రపంచానికి తెలిజేసేలా చేయడం వారంతా టెన్షన్ పడడం, దేవుడ్ని ప్రార్థించడం వంటివి సింపథీని క్రియేట్ చేశాయి. అదే సినిమా నడకకు కారణం. లేకపోతే సప్పగా వుండేది.
ఇక పాత్రలపరంగా చూస్తే, క్షణం', 'రంగస్థలం' చిత్రాల తర్వాత మళ్ళీ అంత చక్కని నటనను ప్రదర్శించింది అనసూయ. ప్రముఖ ఎడిటర్ మార్తాండ్ కె వెంకటేశ్ మేనల్లుడు విరాజ్గ. గతంలో 'అనగనగా ఓ ప్రేమకథ' చిత్రంలో హీరోగా చేశాడు. ఇది అతనికి మూడో సినిమా. విరాజ్ రెండో చిత్రం 'వాళ్ళిద్దరి మధ్య' విడుదల కావాల్సి ఉంది. విరాజ్ తల్లిగా 'కార్తీక్ దీపం' ఫేమ్ అర్చనా అనంత్ నటించారు. ఇతర ప్రధాన పాత్రలను అనీశ్ కురువిల్ల, అన్నపూర్ణ, ఆదర్శ్ బాలకృష్ణ, మోనికా రెడ్డి, హర్ష, రాఘవేంద్ర రాజ్, అలేఖ్య, జయశ్రీ రాచకొండ, కాదంబరి కిరణ్, సమీర్ తదితరులు పోషించారు.
సాంకేతికంగా చూస్తే, దర్శకుడు రమేశ్ తో కలిసి సాయి సురేంద్ర బాబు రాసిన మాటలు అర్థవంతంగా ఉన్నాయి. గుణ బాలసుబ్రహణ్యన్ నేపథ్య సంగీతం బాగానే వుంది. ఇందులో ఉన్నది. సురేశ్ రఘుతు సినిమాటోగ్రఫీ ఈ మూవీకి మరో హైలైట్. తెర మీద మనకు కనిపించే ప్రతి ప్రధాన పాత్రకు చక్కని ముగింపును దర్శకుడు ఇవ్వడం బాగుంది. నైజీరియాలోనే చాలాకాలం వుండి అక్కడ సినిమాలు తీసిన దర్శకుడు నైజీరియన్ మూవీ 'ఎలివేటర్ బేబీ' స్ఫూర్తితో రూపుదిద్దుకున్న 'థ్యాంక్ యు బ్రదర్' కథను మరింత విస్తారంగా రాసుకుంటే బాగుండేది. మొత్తంగా ఇది ధియేటర్‌కంటే ఓటీటీకే కరెక్ట్ సినిమా అనిపిస్తుంది.