'ఖాకీ' పేరుతోనే పలు చిత్రాలు వచ్చాయి. బాలీవుడ్‌లో ఇదే పేరుతో అమితాబ్ నటించాడు. ముంబైలో వున్న టెర్రరిస్టుల్ని పట్టుకునే కథాంశమంది. పోలీసు నేపథ్యంలో వారి విధివిధానాలు రాజకీయనాయకులు ఎలా అడ్డుకుంటారనేది చాలానే వున్నాయి. కానీ కార్తి చేసిన 'ఖాకి' ప్రయోగం భిన్నంగా వుంది. తను 'యుగానికొక్కడు'తో ప్రేక్షకులముందుకు వచ్చినప్పుడే సరికొత్త ఆలోచనలతో కథలు తయారుచేసుకుంటున్నాడని అర్థమయింది. 'నా పేరు శివ'తో మరో మెట్టు ఎక్కాడు. 'వూపిరి', 'కాష్మోరా' చిత్రాలతో మరింత అలరించిన కార్తి ఇప్పుడు 90 దశకంలో జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన చిత్రం 'తీరన్ అధిగారమ్ ఒండ్రు'. తెలుగులో 'ఖాకి' పేరుతో విడుదలైంది. మరి ఈ చిత్రం ఎలా వుందో చూద్దాం.
కథ :
డీఎస్పీగా బాధ్యతలు నిర్వర్తించే ధీరజ్ కుమార్(కార్తి) చాలా చురుకైన వ్యక్తి. చాకచక్యంతో నేరస్తుల ఆట కట్టిస్తూ ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్‌గా పేరు తెచ్చుకుంటాడు. తన నిజాయతీ, నిక్కచ్చితనం వల్ల తరచూ బదిలీ అవుతుంటాడు. అప్పటికే మరదలు ప్రియ(రకుల్)తో పెళ్ళవుతుంది. ఓసారి తమిళనాడులోని ఓ గ్రామానికి బదిలీ అవుతాడు. అక్కడ పెండింగ్ కేసులు చాలా వుంటాయి. అందులో కొన్నేళ్లుగా హత్యలు చేసి డబ్బు, బంగారాన్ని దోచుకువెళ్ళే ముఠా కేసు పెండింగ్‌లో వుండటం చూసి దాన్ని సవాల్‌గా స్వీకరిస్తాడు. ఆ సమయంలోనే ఎం.ఎల్‌ఎ. ఆ ముఠాకు బలవుతాడు.
కొన్ని ప్రత్యేక అధికారాలతో ప్రభుత్వం ధీరజ్‌కు ఏర్పాటు చేసి ఆ ముఠాను పట్టుకోమంటుంది. తన పరిశోధనలో దక్షిణాది ముఠా ఎవ్వరూ కాదని ఉత్తరాది నుంచి వచ్చిన ముఠాగా భావించి పలు రాష్ట్రాలకు తన టీమ్‌తో పరిశోధన చేస్తాడు. ఓ క్లూ ఆధారంగా రాజస్థాన్‌కు చెందిన హవారీ తెగ ఇవన్నీ చేస్తుందని తెలిసి ఆ దిశగా ప్రయత్నాలు చేసి కనుగొంటాడు. అదేసమయంలో అదే ముఠా వల్ల ప్రియ కోమాలోకి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ధీరజ్ ఏం చేశాడు? తర్వాత కథేమిటి? అనేది సినిమా.
విశ్లేషణ:
క్రైమ్ నేపథ్యంతో సాగే సినిమాలు సరదాగా ఆసక్తి కల్గిస్తుంటాయి. వాటిలో చాలామటుకు కల్పితాలే. కానీ యదార్థ సంఘటన ఆధారంగా చేసుకుని తీసే సినిమాకు పలు జాగ్రత్తలు తీసుకోవాలి. అవన్నీ దర్శకుడు వినోద్ ఈ చిత్రంలో చూపించాడు. రాజస్థాన్‌లో వున్న అరుదైన హవారీ తెగ ఏవిధంగా ఇప్పటికి రూపాంతరం చెందిందనే వివరణ ఇంట్రెస్ట్‌గా వుంది. రాజపుత్రులు, మొఘలాయిల మధ్య యుద్ధం జరిగేక్రమంలో ప్రారంభమైన ఆ తెగ జీవితాన్ని విశ్లేషిస్తూ వారు చేసే అకృత్యాలు గగుర్పాటుకు గురిచేస్తాయి. అటవీ తెగకు చెందిన వారంతా తోడేళ్ల నుంచి ఎలా దాడి చేయాలో నేర్చుకునే విధానం ఆకట్టుకుంటుంది. క్రూర మనస్తత్వం గల ఈ తెగ చేసే అకృత్యాలు అన్నీఇన్నీకావు.
ఖాకీలో రకుల్ ప్రీత్ సింగ్-కార్తీ
పచ్చి మాంసాన్ని తింటూ తమ ఊరిపై పోలీసు రావాలన్నా భయపడేట్లు చేసే విధానం కళ్ళకు కట్టినట్లు చూపించాడు దర్శకుడు. అయితే ఉత్తరాదిలో వీరు దొరికితే కాల్చిపారేస్తారు. అందుకే దక్షిణాదిని టార్గెట్ చేసుకుని పలు హత్యలు చేస్తుంటారు. వీరందరికీ గైడ్‌గా వుండే ఓ వ్యక్తి ప్రభుత్వోద్యోగి. వీరందరికీ నాయకుడు ఓమా(అభిమన్యు సింగ్). ఇతన్ని పట్టుకునే విధానంలో ధీరజ్ బృందం చేసిన సాహసోపేతాలు చిత్రానికి హైలైట్‌గా నిలుస్తాయి. ఎక్కడా వీరోచిత విన్యాసాలు కనిపించవు. తెరపై నిజ జీవితాలను, నిజమైన పోలీసులను చూస్తున్నట్లే ఉంటుంది. 1985 నుంచి 2005 మధ్య కాలంలో 45కు పైగా దోపిడీలకు పాల్పడి, 18 హత్యలు చేసి, 64 మంది జీవితాలను ఇబ్బందుల పాలు చేసిన ఓ నిజమైన ముఠా చుట్టూ అల్లుకున్న కథ ఇది. బన్నే సింగ్, ముఠాలో చదువుకున్న నాయకుడిని అరెస్టు చేసే విధానం ఉత్కంఠను కలిగిస్తుంది. ముఠా నాయకుడిని పట్టుకోవడంతో ఈ కథ ముగుస్తుంది. ఆ క్రమంలో వచ్చే యాక్షన్ ఈ సినిమాకు ప్రధాన బలం.
అభినయం:
ధీరజ్ కుమార్ పాత్రలో కార్తి ఒదిగిపోయాడు. మేకప్ లేకుండా ప్రతి సన్నివేశంలోనూ సహజంగా కనిపించాడు. అతనితోపాటు వున్న బృందం కూడా బాగా కష్టపడింది. ముఖ్యంగా రాజస్థాన్‌లో ఆ ముఠాను పట్టుకునేందుకు వారు పడ్డ కష్టం తెరపై చూడాల్సిందే. బావతో సరదాగా వుండే ప్రియ పాత్రలో వినోదం కన్పిస్తుంది. ఇక అభిమన్యు సింగ్ చూపులతోనే పాత్రను రక్తి కట్టించే ప్రయత్నం చేశాడు. అతని అనుచరులుగా వుండే వారి ఎంపికలోనూ ప్రత్యేక శ్రద్ధ కన్పించాడు. క్రూరత్వమైన ముఖాలతో పాత్రకు న్యాయం చేశారు. ఎవ్వరికీ పెద్దగా మేకప్ లేకుండా చేయడం ఈ చిత్రంలోని ప్రధానాంశం.
సాంకేతికత: సాంకేతికంగా సినిమా స్థాయిని పెంచింది. ఎక్కువగా 90వ దశకంలో సాగే కథ కాబట్టి, సన్నివేశాలకు ఆ కలర్‌ను తీసుకొచ్చిన విధానం సహజంగా ఉంది. సత్యన్ సూరన్ కెమేరా పనితనం, జిబ్రాన్ నేపథ్య సంగీతం చక్కగా కుదిరాయి. అయితే పాటలే సాదాసీదాగా అనిపిస్తాయి. సుబ్బరాయన్ యాక్షన్ సినిమాకు అదనపు బలాన్ని ఇచ్చింది.
సంభాషణలు పొందికగా ఆలోచింపజేసేవిగా వున్నాయి. నేనే చదువుకుంటే మీలా వుండేవాడిని.. అదిలేదు కాబట్టి ఈ స్థితిలో వున్నానంటూ పోలీసులతో రాజకీయనాయకుడు చెప్పే డైలాగ్ బాగుంది. పోలీసు అంటే కళ్ళకు పనిచెప్పి చేతులకు తక్కువ పని ఇచ్చేవాడని.. అక్యూజ్డ్‌కు అరెస్ట్ చేసి స్టేషన్‌లో పెడితే వాడిని మేపేందుకు అయిన ఖర్చు ఎవరిస్తారు? లంచం తీసుకుని చేయాలంటూ.. వాస్తవాన్ని మాటల రూపంలో పొందుపర్చాడు. అయితే ఈ చిత్రంలో చాలా నీతి దాగి వుంది. ఎంతోమంది ప్రజలు చనిపోతున్నా పట్టించుకోని ప్రభుత్వం ఒక్క ఎం.ఎల్.ఎ. చనిపోవడంతో దిగివస్తుంది.
పైగా ఉప ఎన్నికలు వస్తున్నాయంటూ.. ఎంత త్వరగా కేసు పట్టుకుంటే అంత మంచిందంటూ.. మంత్రి చెప్పిన విధానం కళ్ళకుకట్టినట్లుంది. ఎంతో సాహసం చేసి జీవితాల్ని త్యాగం చేసి భయంకరమైన నేరస్థుల్ని పట్టుకునే పోలీసు అధికారులకి చివరికి మిగిలేది కన్నీళ్ళే. అవార్డులు రివార్డులు కూడా ఇవ్వకుండా చివరికి పనికిరాని పోస్ట్‌తో ధీరజ్‌ను గుర్తించడం ఇప్పటి రాజకీయ వ్యవస్థకు నిదర్శనం. ఈ తప్పెవరిది? ప్రభుత్వానిదా, దాన్ని నడిపే రాజకీయనాయకులదా? వారిని ఎన్నుకునే ప్రజలదా? అంటూ ప్రశ్నిస్తూ.. కథకు ముగింపు పలుకుతాడు. ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్ అంటూ మూసధోరణిలో తెలుగులో సినిమాలు వస్తున్న తరుణంలో ప్రజల్ని ఆలోచింపజేసే ఇటువంటి కథ తెలుగులో తీయలేకపోవడం పెద్ద లోపమే. దీనితోనైనా కథానాయకులు ఇమేజ్ చట్రం నుంచి బయటపడాలని ఆశిద్దాం.