సాంకేతికత: సినిమాటోగ్రాఫర్ : సతీష్ రెడ్డి మాసం, సంగీత దర్శకుడు : చైతన్ భరద్వాజ్, నిర్మాతలు: రాజేష్ దండ, శివ బొమ్మక్, దర్శకుడు : జైన్స్ నాని. విడుదల: అక్టోబర్ 18, 2025, శనివారం.
కథ:
సిటీలో పెద్ద బిజినెస్ మెన్ కృష్ణ (సాయి కుమార్) కొడుకు కుమార్ అబ్బవరం (కిరణ్ అబ్బవరం). స్థాయిమరిచి అల్లరిచిల్లరి బ్యాచ్ తో తాగుతూ, తిరుగుతూ లైఫ్ ను ఎంజాయ్ చేస్తాడు. అరకొర చదవుతో కాలేజీదాకా వస్తాడు. కొడుకు బాగుకోసం మేనమామ వున్న కేరళకు కుమార్ ను పంపిస్తాడు అతని తండ్రి. అక్కడ ఒకరకంగా ప్రాణబిక్ష పెట్టిన ఓ అమ్మాయిని మనసులో ప్రేమించేస్తాడు.
కట్ చేస్తే, తను చదివే కాలేజీలో కనిపిస్తుంది. ఆమె మెర్సీ జాన్ (యుక్తి తరేజా). ఆమె కూడా చిత్రవిచిత్రంగా ప్రవర్తిస్తున్నా కుమార్ పెద్దగా పట్టించుకోడు. ఆమె అందానికి బానిసై లైఫ్ లాంగ్ ఆమెతో ఉంటానని ప్రామిస్ కూడా చేస్తాడు. అదే నిజమని నమ్మేస్తుంది మెర్సీ. కానీ ఓసారి విసుగెత్తి బ్రేకప్ చెబుతాడు కుమార్. దాంతో ఆమె సైకోగా మారిపోతుంది. ఆత్మహత్య చేసుకోవడానికి ట్రై చేస్తుంది? ఇది తెలిసిన కుమార్ ఏమి చేశాడు. ఆమె అసలు అలా ప్రవర్తించడానికి కారణమేమిటి? అనేది మిగిలిన సినిమా.
సమీక్ష:
కిరణ్ అబ్బవరం మొదటినుంచి ఈ సినిమా పూర్తి ఎంటర్ టైన్ మెంట్ లో వుంటుందని చెబుతూనే వున్నాడు. ఈ కథ కోసం రెండు సంవత్సరాలు దర్శకులు అతనితో ట్రావెల్ చేశాడు. ఆ క్రమంలో రాసిన కథ ఇది. ఇందులో సహజంగా హీరో అంటే అవాారాగా, అల్లరి చిల్లరిగానూ వుండేలా ఫార్ములానే దర్శకుడు తీసుకున్నాడు. హీరో చేశాడు. డబ్బెక్కువుంటే ఎంజాయ్ మెంట్ కోసం తాగడం, తిరిగడం చేస్తుంటాడు. కానీ ఎక్కడా అమ్మాయి పట్ల అసభ్యంగా ప్రవర్తించడం అనేది చూపించలేదు.
తను కేరళ వచ్చాక కనిపించిన మెర్సీనే ప్రేమిస్తాడు. అందులో దర్మం వుంది. కానీ ఆమెను ఎందుకు ప్రేమిస్తున్నానో చెబుతాడు. కానీ తననుంచి ఓ సమస్య వుందని చెప్పినా వినిపించుకోడు. అలా వినిపించుకుంటే కథ సాగదు. వెంటనే శుభం కార్డు పడుతుంది. అందుకే ఇప్పటి యూత్ ఆలోచించడానికి కూడా టైం ఇవ్వరు కనుక అలా బిహేవ్ చేశాడు.
ఇంకోవైపు మేనమామ సీనియర్ నరేష్ పాత్ర కూడా కుమార్ పాత్రకంటే ఓ ఆకు ఎక్కువగా వుంటుంది. రోడ్డుమీద కనిపించిన ఆంటీలను టచ్ పేరుతో ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళిపోతాడు. ఇది చూడ్డానికి కాస్త ఇబ్బందిగా వున్నా, క్లయిమాక్స్ లో ఇచ్చిన ముగింపు కళ్ళు తెరిపించేలా వుంటుంది. అదేవిధంగా కుమార్ బేవార్స్ గా తిరుగుతూ ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించే ప్రవర్తకు ముగింపు కూడా క్లయిమాక్స్ లో వుంటుంది. ఈ రెండు పాయింట్లు బాగున్నా, మధ్యలో జరిగే కథనం అంతా కాస్త ఓపిగ్గా కూర్చొని చూడాల్సి వస్తుంది.
ఇందులో ప్రధానమైన లోపం ఏమంటే... జెర్సీకి మానసిక డిసాస్టర్ అనే వ్యాధి వుందని డాక్టర్ సంజయ్ చెబుతాడు. కానీ దాన్ని సొల్యూషన్ ఆయన చూపించలేకపోతాడు. దాన్ని కుమార్ పాత్ర ఎలా డీల్ చేసింది అనేదే సినిమాలోని ప్రధాన అంశం. డాక్టర్ గా చేయాల్సిన దాన్ని హీరో చేయడమే సినిమాలో ట్విస్ట్. ఇది చాలా సిల్లీగా కూడా అనిపిస్తుంది.
హీరో ఎలాగూ ఇలాంటి కేరెక్టర్లను ఈజీగా చేసేస్తాడు. ఇందులో అలానే చేశాడు. ఆసుపత్రిలో జెర్సీకి చెప్పే కట్టుకథ సింగిల్ టేక్ లో చెప్పినట్లుగా బాగా చేశాడు. హీరోయిన్ కూడా కథకు సరిపోయింది. తండ్రిగా సాయికుమార్ పాత్ర అమరింది. నరేష్ పాత్ర సిల్లీగా వున్నా ఎంటర్ టైన్ చేస్తుంది. ఇక మిగిలిన పాత్రలన్నీ బాగున్నాయి.
అయితే కేరళలో కథ మారాక అక్కడక్కడా మలయాళ డైలాగ్ లు, పాటలో పల్లవిలు వినిపిస్తే బాగుండేది. తెలుగు సినిమాను కేరళలో చూశామనే ఫీలింగ్ కలిగించాడు దర్శకుడు. చివరిలో తండ్రి ఎమోషన్ బాగా పండించాడు. ఇలా ఇక్కడ మాత్రం కామెడీ, ఎమోషనల్ పార్ట్ బ్యాలెన్స్డ్ గా వర్క్ అయ్యిందని చెప్పవచ్చు. అలానే లాస్ట్ లో ఇచ్చిన ఏఐ ఎండింగ్ కూడా మంచి ఫన్ గా అనిపిస్తుంది. ఇక యంగ్ హీరో కిరణ్ అబ్బవరం తన రోల్ లో సాలిడ్ పెర్ఫార్మన్స్ ని అందించాడు. మురళీధర్ గౌడ్ తదితరులు తమ పాత్రల్లో మెప్పించారు. కొద్దిసేపైనా వెన్నెల కిషోర్ పాత్ర మరింత ఎంటర్ టైన్ చేస్తుంది.
కథంతా రొటీన్, కల్పితం కనుక సినిమా ఫార్మెట్ లో వెళ్ళిపోతుంది. పెద్దగా ట్విస్ట్ లుండవు. అలీ, శ్రీనివాస్ రెడ్డి పాయింట్ ఆఫ్ వ్యూలో కథ రన్ అవుతుంది. దానికితోడు హీరోయిన్ డిజాస్టర్ ను ఉపయోగించుకుని లిప్ కిస్ లు పెట్టి ఆమెకు రిలీప్ ఇచ్చేలా దర్శకుడు కథను రాశాడు. అవి జనరేషన్ కు బాగున్నా, కుటుంబాలతో చూసేవారికి కాస్త ఇబ్బందిగా అనిపిస్తుంది.
సంగీత దర్శకుడు చైతన్ భరద్వాజ్ సంగీతం, సతీష్ రెడ్డి మాసం కెమెరా వర్క్ బాగుంది. కేరళకు షిఫ్ట్ అయ్యిన తర్వాత నుంచి మరింత మంచి విజువల్స్ తను చూపించారు. పాటల చిత్రీకరణ కూడా బాగుంది. అలాగే చోటా కె ప్రసాద్ ఎడిటింగ్ బాగుంది కానీ ఫస్టాఫ్ లో కొన్ని సీన్స్ తగ్గించాల్సింది. అలాగే డైలాగ్స్ బాగున్నాయి. పక్కా మాస్ చిత్రంగా హీరో చేసిన ఈ సినిమా మాస్ ను అలరించేఛాన్స్ వుంది.