స‌రికొత్త అంశంతో ప్రేమ‌క‌థా చిత్రం అప్పుడు-ఇప్పుడు`.

శనివారం, 4 సెప్టెంబరు 2021 (07:37 IST)
Sujan, Tanishq
నటీనటులు : సుజన్, తనీష్క్ ,శివాజీరాజా, శ్రీనివాస్ పేరుపురెడ్డి, మాధవి, జబర్దస్త్ అప్పారావు తదితరులు
సాంకేతిక‌తః సినిమాటోగ్రఫీ : కల్యాణ్ సమి, సంగీతం: పద్మానావ్ భరద్వాజ్, ఎడిటింగ్: వి.వి.ఎన్.వి.సురేష్, చిరావూరి విజయకుమార్, నిర్మాతలు: ఉషారాణి కనుమూరి, విజయ్ రామ కృష్ణమ్ రాజు, దర్శకత్వం: చలపతి పువ్వల.
 
క‌రోనా త‌ర్వాత చిన్న సినిమాలు విడుద‌ల‌కు నోచుకుంటున్నాయి. కొత్త త‌ర‌హా క‌థ‌ల‌తో ముందుకు వ‌స్తున్నారు. ప్రేమ‌క‌థ‌ల‌లో కొత్త ఆవిష్క‌రించే ప‌నిలో వారు వున్నారు. ప్రేక్ష‌కుల ఆద‌రిస్తార‌నే దర్శక నిర్మాతలు ఎక్కువగా ప్రేమకథలపైనే ఫోకస్ పెడతారు. తాజాగా వచ్చిన మరో ప్రేమకథా చిత్రం అప్పుడు.. ఇప్పుడు. సుజన్, తనీష్క్ హీరో హీరోయిన్లుగా న‌టించిన చిత్రం `అప్పుడు-ఇప్పుడు`. టైటిల్‌తోపాటు ఏం చెప్ప‌ద‌లిచారో చూద్దాం.
 
కథ :
 
అల్ల‌రి చిల్ల‌రిగా తిరిగే యువ‌కుడు  అర్జున్ ( సుజన్ ). ఇంటిలో బాధ్య‌త తెలీదు. చ‌దువు పెద్ద‌గాలేక‌పోయినా జీవితాన్ని స్ట‌డీ చేయాల‌ని అనుకుంటాడు. ఒకేటే జీతం, కొడితే జాక్ పాట్ కొట్టాలని ఆలోచించే మ‌న‌స్త‌త్వం. స్నేహితుల‌తో పూరిలో తిరుగుతుంటాడు. స‌రిగ్గా ఓ స‌మ‌యంలో ఓ ఊరిలోకి చేర‌తాడు. అక్క‌డ ఓ స‌మ‌స్య‌లో ఇరుక్కుంటాడు. అ ఊరు పెద్ద‌ల వ‌ల్ల రెండుగా విడిపోతుంది. అక్క‌డ ఆ వూరి పెద్ద కుమార్తెను తొలిచూపులో ప్రేమ‌లో ప‌డ‌తాడు. ఆ ప్రేమే ఆ ఊరి స‌మ‌స్య ఏమిటో తెలుసుకునే చేస్తుంది. దాంతో ఊరినాయ‌కులు ప్ర‌జ‌ల్ని మోసం చేస్తున్నార‌ని గ్ర‌హిస్తాడు. ఆ త‌ర్వాత అత‌ను ఏం చేశాడు? త‌న ప్రేమ‌ను ద‌క్కించుకున్నాడా? అనే విష‌యాలు మిగిలిన సినిమా చూడాల్సిందే.
 
విశ్లేష‌ణః
ఊరి క‌థ కాన్సెప్ట్ గ‌తంలో కొన్ని సినిమాలు వ‌చ్చినా ఇందులో చూపించిన విధానం కొత్త‌గా వుంటుంది. హీరోగా పరిచయం అయిన సుజన్ చ‌లాకీగా న‌టించాడు. కొన్ని సీన్ల‌లో న‌ట‌న విష‌యంలో మ‌రింత శ్ర‌ద్ధ పెట్టాల్సింది..డాన్స్, యాక్షన్ అన్ని అంశాలు చక్కగా చేసాడు. ఇక హీరోయిన్ తనీష్క్ ఇప్పటికే రెండు మూడు సినిమాలు చేసింది. ఆమె అందం సినిమాకు ప్రత్యేక ఆకర్షణ. సాంప్ర‌దాయం, ఇప్ప‌టి ట్రెండ్‌కు త‌గిన షేడ్స్ ఆమె పాత్ర‌లో వున్నాయి. తండ్రిగా చేసిన శివాజీరాజా పాత్రకు ద‌ర్శ‌కుడు బాగా ఉప‌యోగించుకోవాల్సింది. ఇక‌ శ్రీనివాస్ పేరుపురెడ్డి, మాధవి, జబర్దస్త్ అప్పారావు తదితరులు వారి వారి పాత్రల్లో అమరారు.
 
ప్రేమ‌క‌థ‌కు సంగీతం ప్ర‌ధానం. పాట‌ల‌కు స‌న్నివేశాల‌కు నేప‌థ్య సంగీతంతోపాటు కెమెరా కీల‌కం. కళ్యాణ్ సమి సినిమాటోగ్ర‌ఫీ, పద్మనావ్ భరద్వాజ్ సంగీతం కుదిరాయి. సంభాష‌ణ‌లు అక్కడక్కడా ఆకట్టుకున్నాయి.  రొమాంటిక్ సాంగ్ చిత్రీకరణ అదిరింది. ఇక ఎడిట‌ర్‌గా కత్తెరకు పనిచెప్పాల్సిన అవసరం ఉంది. ఇక దర్శకుడు చలపతి పువ్వల గురించి చెప్పాలంటే ఓ సరికొత్త నేపథ్యంలో ఉన్న ప్రేమ కథను ఎంపిక చేసుకున్నప్పటికీ దాన్ని తెరకెక్కించే విషయంలో కాస్త తడబడ్డాడు. ఫైన‌ల్‌గా వినోదానిని పెద్ద పీట‌వేయ‌డంతో కాస్త క‌థ తాడిత‌ప్పింది.నిర్మాణ విలువలు బాగున్నాయి.
 
ద‌ర్శ‌కుడు తాను ఏది చెప్పాల‌నుకున్నాడో అది క‌రెక్ట్ చెప్పాలి. అది రూలు. కానీ టైటిల్ విష‌యంలో చిన్న గంద‌ర‌గోళం క‌నిపిస్తుంది. హీరోయిన్ కోణంలోనా, ఊరి కోణంలోనా అనేది కొంచెం మిస్ అయింది. గ్రామీణ నేపథ్యంలో సాగే చక్కని సినిమా క‌నుక చ‌క్క‌ని ఫీల్ క‌లుగుతుంది. ఏది ఏమైనా ఓ మంచి ప్రేమకథ చిత్రంగా తెరకెక్కించిన ఈ సినిమా ఇది. 
రేటింగ్ : 2.75 / 5

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు