జగన్ అవుట్? ఏపీ సీఎంగా సుజనా చౌదరి? బీజేపీ నయా స్కెచ్‌తో వైసీపీలో అల్లకల్లోలం అంటూ కథనాలు ప్రారంభించేసింది ఓ చానల్. ఢిల్లీలో ఏపీ సీఎం తరఫున విజయసాయిరెడ్డి విశ్వప్రయత్నం విఫలమైందని... ఆర్థిశాఖా మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి రుణ పోరాటంలో ఓడిపోయారని, అమిత్‌షాతో బేరాలు వికటించాయని పేర్కొంటున్నారు. అక్రమాస్తుల కేసులు, బాబాయ్ మర్డర్, తలకుమించిన అప్పులు, రాజ్యాంగ ఉల్లంఘనలు ఇవన్నీ ఇపుడు వైసీపీ ప్రభుత్వం మెడకు చుట్టుకుంటున్నాయని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు.
ఎన్ని రాష్ట్రాల ఎన్నికల ఖర్చులు సర్దినా.. కమలనాధులు ప్రసన్నం కావడంలేదని, తన ఎన్నికల వ్యూహకర్త పీకే డైరెక్షన్ మేరకు కాంగ్రెస్‌తో టై అప్‌కి జగన్ మోహన్‌రెడ్డి సిద్ధం అయ్యారని ప్రచారం చేస్తున్నారు. ఈ అదను కోసమే చూస్తోన్న కేంద్రం... పావులు కదపడం మొదలుపెట్టింది. ఆల్రెడీ వైసీపీలో కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలుగా ఎన్నికైన సీనియర్లను టచ్‌లో పెట్టుకుంది. బెయిల్ రద్దయినా, అక్రమాస్తుల కేసులో శిక్షపడినా, ఆర్థిక అత్యవసర పరిస్థితి వచ్చినా దిగే జగన్‌రెడ్డి ప్లేస్‌లో వైసీపీ ఎమ్మెల్యేలు ఎవరూ సీఎం అయ్యే అవకాశం లేకుండా స్కెచ్ రెడీ అయ్యిందని తెలుస్తోంది.
కమలనాధులు సుజనాచౌదరిని కుర్చీపై కూర్చోబెట్టి, ఢిల్లీ నుంచి ఆపరేట్ చేయాలనే ప్రణాళిక సిద్ధమవుతోందని పేర్కొంటున్నారు. బీజేపీలో వుంటూ జగన్ కి ఊప్పందించే జీవీఎల్ నరసింహారావు వంటి వారదందించిన సమాచారంతో కేబినెట్ మీటింగ్‌లో సీఎం ఆగ్రహం చెందారని చెపుతున్నారు. మన సర్కారుని బీజేపీ తిడుతుంటే ఏం చేస్తున్నారని మంత్రులపై కేకలు వేశారని కథనాలు అల్లుతున్నారు.
సీఎం జగన్ వార్నింగ్‌తో కేబినెట్ నుంచి బయటకొచ్చిన మంత్రి పేర్నినాని, సుజనా చౌదరి పేరు పెట్టకుండా కాషాయ కండువాలు కప్పుకున్నవారంటూ ఆరోపణలు గుప్పించారట. జగన్‌రెడ్డి సర్కారుని కూలదోయడానికి బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించడం వెనక ఢిల్లీలో సాయిరెడ్డి లాబీయింగ్ వీకై చేతులెత్తేయడమేనని అంటున్నారు. సుజనాచౌదరి, సీఎం రమేష్‌లిద్దరూ ఏపీ సర్కారుపై నేరుగా ఏ ఆరోపణలు చేయకపోయినా, వైసీపీ లైన్ ఢిల్లీలో కట్ చేయడంలో కీలకపాత్ర పోషించారట. తరచూ ఢిల్లీ వెళ్లి వస్తోన్న బీజేపీ నేతలందరికీ, జగన్ సర్కారు కొనసాగే అవకాశం లేదని తెలిసిపోయిందని, సుజనా చౌదరి కింగ్ మేకర్ కానున్నారని అర్థమై ఆయనతో టచ్‌లోకెళ్లారని చెపుతున్నారు.
అయితే, ఇదంతా టీడీపీ అనుకూల మీడియా సృష్టి అని, సుజనా చౌదరి సీఎం కావడం అభూత కల్పనే అని వైసీపీ వర్గాలు మండిపడుతున్నాయి. తమ వైసీపీ పార్లమెంటరీ కమిటీ చాలా పటిష్ఠమైన నెట్ వర్క్ తో ఢిల్లీలో కార్యకలాపాలు నిర్వహిస్తోందని చెపుతున్నారు.