ఆంధ్రప్రదేశ్ లో రాజకీయంగా చర్చనీయాంశమైన అంశం అమరావతి రాజధాని కోసం రైతులు చేస్తున్న పోరాటం. దానిపైనే రాజధాని ఫైల్స్ పేరుతో సినిమా నేడు విడుదలైంది. ఆంధ్రప్రదేశ్ లో మొదటి షో పడలేదు. తెలంగాణాలో షోలు పడ్డాయి. మరి ఈసినిమా ఎలా వుందో చూద్దాం.
కథ:
ఎ.పి.లో భుల్లూర్ గ్రామంలో వున్న పెద్ద దిక్కు వినోద్ కుమార్. చుట్టుపక్కల 30 గ్రామాలు అతని ఆదీనంలో వుంటాయి. ప్రజలకు ఓ కష్టం వచ్చినా ముందుండి ఆదుకుంటుంటాడు. ఆ సమయంలో రాష్ట్ర రాజధానికోసం ప్రభుత్వం గ్రామాల్లోని పచ్చటి పొలాల బూమిని వారి అనుమతితో తీసుకుంటుంది. చర్చల తర్వాత అంగీకరిస్తారు. కానీ ఆ తర్వాత పరిస్థితులు మారి కొత్తగా వచ్చిన ఓ రాజకీయపార్టీ సి.ఎం. అందుకు వ్యతిరేకించి, మూడు రాజధానులు కావాలని అసెంబ్లీ బిల్లు ప్రవేశపెడతాడు.
దాంతో ఆగ్రహంతో తామిచ్చిన భూములు తిరిగి ఇవ్వమని అడిగినందుకు, పోరాటానికి నాయకుడిగా వున్నందుకు వినోద్ కుమార్ కుటుంబాన్ని, రైతులను చిత్రహింసలు పెడతాడు కొత్త సి.ఎం. వినోద్ కుమార్ కొడుకు ఫైజి. టెక్నాలజీలో గోల్డ్ మెడలిస్ట్. విదేశాలకు వెళ్ళిపోదాం అనుకున్న అతను రైతుల కష్టాలను చూశాక ఇక్కడే వుండి వారితో పోరుబాట పడతాడు. ఆ తర్వాత ఏమయింది? అనేది సినిమా.
సమీక్ష:
ఈ సినిమాను మొదట అమరావతి ఫైల్స్ అని పేరు పెట్టి సెన్సార్ నిబంధనలవల్ల టైటిల్ తోపాటు సినిమాలోని చాలా పేర్లను మార్చాల్సి వచ్చింది. అందుకే అరుణ ప్రదేశ్ కొత్త రాజధాని ఐరావతి నిర్మాణం, ఎన్నికైన ముఖ్యమంత్రి (విశాల్ పట్నీ), రాజకీయ నాయకులను తన మైండ్ తో ఆడుకునే ప్రశాంత్ కిశోర్, కర్నూలుకు వల్లూరు ఇలా మార్చారు. ప్రముఖ నటులు వినోద్ కుమార్ మరియు వాణీ విశ్వనాథ్ మంచి నటనను ప్రదర్శించారు, ముఖ్యంగా కొన్ని సన్నివేశాలలో మెరిసిపోయారు. పుష్పరాజ్ అఖిలన్ తన పాత్రను సమర్థవంతంగా చిత్రీకరించాడు, ముఖ్యంగా ద్వితీయార్ధంలో, సహాయక తారాగణం తగినంతగా సహకరించింది.
మైనస్ పాయింట్లు:
వాస్తవికతతో కల్పనను మిళితం చేయాలనే ఉద్దేశ్యంతో ఉన్నప్పటికీ, ఊహించిన భావోద్వేగ బరువు మరియు శక్తివంతమైన ప్రదర్శనలను అందించడంలో రాజధాని ఫైల్స్ తక్కువగా ఉంది. టెక్నికల్ గా హైలెవల్ నాలెడ్జ్ వున్న వినోద్ కుమార్ కొడుకు తన తల్లి ప్రత్యర్థుల చేతిలో చిక్కితే దాన్ని తేలిగ్గా తీసుకోవడం, భార్య చనిపోతే వినోద్ కుమార్ ఏమాత్రం పట్టనట్లు కేవలం రాజధాని పోరాటం వైపు మళ్లడం వంటివి ట్రాక్ తప్పినట్లు కనిపిస్తాయి.
ముఖ్యంగా ప్రథమార్ధంలో ప్రేక్షకులను బాగా ఆకట్టుకునేలా ఆకట్టుకునే కథనాన్ని రూపొందించే అవకాశాన్ని దర్శకుడు కోల్పోయాడు. అదనంగా, రెండు భాగాలలో కొన్ని సన్నివేశాల మధ్య పొందిక లేకపోవడం నిరాశ కలిగిస్తుంది. సంగీతం సన్నివేశాలను ఎఫెక్టివ్‌గా పూర్తి చేయడంలో విఫలమైంది.
ఏది ఏమైనా ఎ.ఫి. సి.ఎం. పాలనకంటే పబ్జీ గేమ్ లు ఆడుకోవడం, ఉత్తరాదికి చెందిన కిశోర్ చేతిలో కీలుబొమ్మలా మారడం, తన పక్కనున్న ఇద్దరు అనుచరులు చెప్పింది చేయడం వంటి కొన్ని సన్నివేశాలు సింక్ అవుతాయి. విశేషం ఏమంటే.. ఎ.పి. సి.ఎం.ను ఎక్కడా కించపరిచేవిధంగా లేకుండా కేవలం ప్రశాంత్ కిశోర్ అనే అపర మేథావిని విలన్ గా చూపిస్తూ చివరికి ఇచ్చిన ముగింపు బాగుంది.
దర్శకుడు భాను రాజధాని ఫైల్స్‌ని ఒక పొలిటికల్ డ్రామాగా ఎలివేట్ చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉన్నాడు కానీ అవకాశాన్ని ఉపయోగించుకోవడంలో విఫలమయ్యాడు. దానికి కొన్ని పరిమితులు వున్నట్లు తోస్తుంది.
బ్రిటీష్ వారి నుంచి దేశాన్నికాపాడుకునే క్రమంలో ప్రజలు పోరాడినట్లుగా ఎ.పి.లో పోరాటం తలపిస్తుంది. కూలంకషంగా ఆలోచిస్తే అధికారం, అహంకారం మెండుగా వుంటే చాలు ప్రజలను కాలికింద తొక్కిపెట్టవచ్చు అనేది ఎవర్ గ్రీన్ అనేది తెలియజేశాడు. ఇందుకు అధికారులు, పోలీసు యంత్రాంగం కూడా నాయకులకు తొత్తులుగా పనిచేయడం మినహా ఏమీ చేయలేరని అర్థమయ్యేలా మరోసారి చూపించాడు.
మణిశర్మ, కోటగిరి వెంకటేశ్వరరావు వంటి అనుభవజ్ఞులైన సాంకేతిక నిపుణులు ఉన్నప్పటికీ, కథలోని పరిమితులు వారి సహకారాన్ని పరిమితం చేశాయి.
సినిమాటోగ్రఫీ పర్వాలేదు. నిర్మాణ విలువలు ఆమోదయోగ్యంగా ఉన్నప్పటికీ, అనవసరమైన సన్నివేశాలను ట్రిమ్ చేయడానికి మరియు రన్‌టైమ్‌ను తగ్గించడానికి ఎడిటింగ్ విభాగంలో గణనీయమైన మెరుగుదలలు అవసరం.
చివరగా.. ప్రేక్షకులను పూర్తిగా ఎంగేజ్ చేయడానికి అవసరమైన భావోద్వేగ అంశాలు మిస్ అయ్యాయి. ఈ సినిమాను ప్రస్తుత ప్రభుత్వం చూసినా వారి నాయకుడిని ఎక్కడా విమర్శించకుండా జగ్రత్తగా దర్శకుడు తీశాడు. ఇంకోవైపు అధిక రన్‌టైమ్‌తో దెబ్బతింది.