సాంకేతికత- రచన, దర్శకత్వం: డైమండ్ రత్నబాబు, సంగీతం: ఇళయరాజా, నిర్మాత: మంచు విష్ణు
మంచు మోహన్ బాబు నటించిన సన్ ఆఫ్ ఇండియా ట్రైలర్ చూశాక ఎక్కువగా డైలాగ్‌లు వున్నాయని పించింది. వన్ మెన్ ఆర్మీగా సాగుతుందని టూకీగా చెప్పేశాడు మోహన్ బాబు. ఈ సినిమా ఈ రోజే విడుదలైంది. చిరంజీవి వాయిస్ ఓవర్ తో మోహన్ బాబు క్యారెక్టరైజేషన్ వివరిస్తారు. కోట్ల మందిలో ఓ వ్యక్తి. చూడటానికి మామూలు మనిషిలా ఉన్నా తను ఏదో ఆశించి ప్రత్యేకతను చాటుకోవాలని చూస్తున్నాడు అంటూ సాగే డైలాగ్‌తో కథ ప్రారంభమవుతుంది. మరి ఈ సినిమా ఎలా తీశారో చూద్దాం.
కథః
కడియం బాబ్జీ (మోహన్‌బాబు) కేంద్రమంత్రిని కిడ్నాప్ చేస్తాడు. దాంతో యన్.ఐ.ఏ. రంగంలోకి దిగుతుంది. ఆ శాఖలోనే కారు డ్రైవర్‌గా బాజ్జీ డ్యూటీ చేస్తుంటాడు. ఆ తర్వాత ఓ లేడీ డాక్టర్ ను, దేవాదాయ శాఖ చైర్మన్ కిడ్నాప్ చేస్తాడు. పరిశోధణ చేయగా యన్.ఐ.ఏ. ఆఫీసర్ ఐరాకు బాబ్జీనే కిడ్నాపర్ అని తెలుస్తుంది. అతన్ని పట్టుకునేందుకు సిబ్బందితో దాడి చేస్తుంది. వీరు కాకుండా మరో ఇద్దరినీ కిడ్నాప్ చేశానంటూ వారికి ట్విస్ట్ ఇస్తాడు. బాబ్జీ. ఎందుకు ఇదంతా చేస్తున్నావని నిలదీస్తే, ఫ్లాష్‌బేక్‌లో కడపలో ప్రింటింగ్ ప్రెస్ నడిపే విరూపాక్షిగా వున్న గత జీవితాన్ని చూపిస్తాడు. ఆయన కూతురు లెక్కల్లో టాపర్. ఆమెను హైదరాబాద్‌లో పరీక్ష రాయించడానికి తీసుకెళతాడు. తిరిగి ఇంటికి వచ్చేసరికి ఊరంతా విరూపాక్షి ఎం.ఎల్.ఎ.గా ఓ రాజకీయ పార్టీ తరఫున పోటీ చేస్తన్నట్లు గోడపత్రికలు అంటించి వుంటాయి. ఇదంతా తనకు తెలీకుండా తన సిబ్బంది చేసిన తప్పిదమనీ, అసలు అభ్యర్తి పోసాని చెబుతాడు. అతను నమ్మడు. పరువు పోయిందనే కక్షతో విరూపాక్షి భార్య, కూతుర్ని సజీవ దహ నం చేసేస్తాడు. పైగా ఇది విరూపాక్షి చేశాడని నమ్మిస్తాడు. తర్వాత 16 ఏళ్ళు జైలు శిక్ష అనుభవించి తిరిగి వస్తాడు. వచ్చాక అందరినీ చంపేస్తుంటాడు. మరి పోసానినే చంపకుండా ఇతరులను ఎందుకు చంపాడు? అన్నది మిగిలి న కథ.
విశ్లేషణ పరంగా వస్తే,
ఎన్. ఐ ఏ అధికారులుగా చేసిన వారు గాని పోలీస్ అధికారులు గాని ఇతర క్యారెక్టర్లు గాని ఎవరు ఎవరి ఫేసులు కనిపించవు. ఏదో కొత్త ప్రయోగం అంటూ ముందుగానే మోహన్ బాబు వాయిస్ ఓవర్ లో చెబుతాడు. రామ్ గోపాల్‌వర్మ తరహాలో క్లోజ్ షాట్లు కేరెక్టర్ ఫేస్‌లు కనిపించకుండా పక్కన ఉన్న ఆర్టికల్స్ షాట్లు స్పష్టంగా చూపిస్తాడు. పైగా సన్నివేశపరంగా ఇద్దరు లెస్‌బియన్ల సన్నివేశం కూడా చూపిస్తాడు. ఇందులో పోలీసు అధికారి అధికారి గా చేసిన పృథ్వి తో సహా మంగ్లీ పాత్ర సిల్లీగా ఉన్నాయి సెకండాఫ్‌లో ఎందుకు అందరినీ చంపుతాడనే ముడిని విప్పాలి కాబట్టి దేశంలో రాజకీయ నాయకుల అవినీతి, కరోనా టైంలో డాక్టర్ల మాఫియా వంటి సన్నివేశాలను మనం పేపర్లలో చూసిన సన్నివేశాలను కథగా రాసుకున్నట్లు కనిపిస్తుంది.
ప్రత్యేకంగా మోహన్‌బాబు తన వాచికం, అభినయం, ఏకపాత్రాభినయం ఎలా వుంటాయో చూపించే ప్రయత్నం చేశాడు. అందుకు సంభాషణలు రత్నబాబు రాశాడు. అయితే ఆయన చెప్పే డైలాగ్‌లు ఒక దశలో విసుగు తెప్పించేవిగా వుంటాయి. వాట్సప్‌లో వచ్చే సందేశాలులాగా అనిపిస్తాయి. ముందుగానే చెప్పినట్లు ఏ పాత్ర స్పష్టంగా కనిపించదు. బ్లర్‌గా చూపించడం, వెనుక నుంచి చూపించడం అసలు ఆర్టిస్టులు ఎవరనేది వాయిస్ బట్టే అర్థం చేసుకునేలా చేశాడు. ఇలాంటి ప్రయోగం 1964లో సునీల్ దత్ చేసిన ప్రయోగం. ఇది 2022కు కొత్త ప్రయోగంగా భావించి మంచు మోహన్ బాబు చేశాడు.
ప్లస్ పాయింట్ః
మోహన్ బాబు వాచకాభినయం
అర్థం కాకపోయినా కథ ఆరంభంలోనే సంస్కృతంలో సాగే ఎమోషనల్ పాట
చివర్లోనైనా ఆర్టిస్టుల ఫేస్‌లు చూపించడం
మైనస్‌లు
ఇలాంటి డైలాగ్‌లతో సినిమాను నడపాలంటే చాలా కష్టం. సినిమా కథ, రాజకీయ నాయకులపై సినిమా అంటే చూసే వాడికి కళ్ళకు కట్టినట్లు వుండాలి. అదేమీ లేకుండా లాజిక్ లేకుండా చూపించేశాడు. ఒక్కడే ఒక్కోక్కరిని ఒక్కో రకంగా చంపేస్తుంటాడు. లొకేషన్లు మారిపోతుంటాయి. ఎం.ఎల్.ఎ. ఫొటోకు బదులు తన ఫొటోను అతని అనుచరులు పెట్టడం మరీ విడ్డూరంగా వుంది. ఇళయరాజా నేపథ్య సంగీతం మునుపటిలా సాగలేదనే చెప్పాలి. ఓ డాక్యుమెంటరీగా సినిమా తీసినట్లు గోచరమవుతుంది.