'నేను శైలజ' దర్శకుడు కిషోర్ తిరుమలతో కలిసి రామ్ హీరోగా నటించిన రెండో చిత్రం 'ఉన్నది ఒకటే జిందగీ'. జీవితం ఒకటే.. కానీ అందులో కోణాలు ఎన్నో. అయినవాళ్ళు, కానివాళ్లు, స్నేహితులు వగైరా.. వగైరా.. అన్నింటిల్లో ముఖ్యుడు స్నేహితుడే. ఆ ఫ్రెండే పక్కన వుంటే ఎంత కష్టమైనా ఇష్టంగానే అనిపిస్తుంది. ఈ పాయింట్‌నే దర్శకుడు చెప్పాడు. అదెలా వుందో చూద్దాం.
కథ :
చిన్నప్పుడే తల్లిలేని అభి(రామ్)కి వాసు(శ్రీవిష్ణు) స్నేహం స్వాంతన ఇస్తుంది. వయస్సుతో పాటు స్నేహం పెరుగుతుంది. ఇంజనీరింగ్ చదువుతుండగా ప్రాజెక్టులో భాగంగా రెండు నెలలు వాసు ఢిల్లీకి వెళ్తాడు. ఆ సమయంలోనే అభికి మహాలక్ష్మి ఉరఫ్ మహా(అనుపమ పరమేశ్వరన్) పరిచయమవుతుంది. అది ప్రేమ వరకు దారితీస్తుంది. అన్ని విషయాలు వాసుతో ఫోన్‌లో పంచుకునే అభి, తన ప్రేమ విషయాన్ని చెప్పే సమయానికి వాసు తిరిగొస్తాడు. అప్పుడే మహా అతడి మావయ్య కూతురనీ అతను ఆమెను ఇష్టపడుతున్నాడని తెలుస్తుంది.
తమ స్నేహం గురించే కాకుండా తమ ప్రేమ గురించి ఇద్దరూ మహాకు చెప్పేస్తారు. ఆ తర్వాత మహా... వాసును చేసుకోవడానికి డిసైడ్ అవుతుంది. వీరికి తను అడ్డంకని భావించి చెప్పాపెట్టకుండా అభి విదేశాలకు వెళ్ళిపోతాడు. నాలుగేళ్ళ వరకు స్నేహితులకు కూడా ఆచూకీ లేని అభి.. ఓసారి వాసు సోదరిని కలిశాక.. అభి హుటాహుటిన వాసు కోసం ఇండియా వస్తాడు. అంతలా అతన్ని కదిలించిన అంశం ఏమిటి? ఆ తర్వాత కథ ఎటువంటి మలుపు తిరిగింది? అనేది మిగిలిన సినిమా.
విశ్లేషణ :
ఒకే అమ్మాయిని ఇద్దరు స్నేహితులు ప్రేమించడం, దానివల్ల ఇద్దరూ ప్రత్యర్థులుగా మారడం అనేది అబ్బాస్, వినీత్ 1996లో 'ప్రేమదేశం' కథ. ఆ తర్వాత కూడా ఇద్దరు ఫ్రెండ్స్‌తో కొన్ని కథలూ వచ్చాయి. అయితే 'ఉన్నది ఒకటే జిందగీ'లో కాస్త భిన్నంగా అనిపిస్తుంది. ఇద్దరూ కలిసి 'నిన్నే ప్రేమిస్తున్నాం. నువ్వే డిసైడ్ చేసుకో' అని ఓ అమ్మాయికీ చెప్పడం చిత్రమేమరి. ఎందుకంటే తమది స్వచ్ఛమైన ఫ్రెండ్‌షిప్, దాపరికాలు లేవని వారి భావన.
అలాంటిది మహా, వాసుతో వుండటానికి నిర్ణయం తీసుకున్నాక అభిలోని అహం దెబ్బతింటుంది. అందుకే దూరంగా వెళ్ళిపోతాడు. ఇంతవరకు అందరూ ఊహించనట్లే జరుగుతుంది. కానీ ఇక్కడనుంచే దర్శకుడు కొత్త మలుపు తిప్పుతాడు. ఆ క్రమంలో కథ సాగదీస్తున్నట్లుగా అనిపిస్తుందికూడా. అనంతరం మాగీ (లావణ్యత్రిపాఠీ) పాత్ర వచ్చాక ఇద్దరూ ఆమెనే ఇష్టపడుతున్నట్లు కామన్ ఫ్రెండ్ ప్రియదర్శి భావిస్తాడు. దీంతో వీరి ప్రేమకోసం మళ్ళీ విడిపోతారేమోనని భయపడే తరుణంలో మహా రాసిన డైరీ వాసుకు అందడం.. దానిద్వారా తను ఎలా పరివర్తన చెందాడన్నదే సినిమా.
ఇందులో స్వచ్ఛమైన ఫ్రెండ్‌షిప్ ఏమిటో దర్శకుడు తనకు ఎదురైన కొన్ని సంఘటనలు ఆధారంగా రాసుకున్నాడు. 'ట్రెండ్ మారినా ఫ్రెండ్ మారడు..' అని దేవీశ్రీ ప్రసాద్ తన పాటలో చెప్పినట్లుగానే వీరి ఫ్రెండ్‌షిప్ చూసి ఇప్పటితరం కూడా ఒక్కసారి వెనక్కు చూసుకునేట్లుగా వుంటుంది. కల్లాకపటంలేని చిన్నతనంలోని స్నేహం ఎదిగేకొద్దీ ఎలా పరిణామం చెందిందనేందుకు ఈ చిత్రం నిదర్శనం. దానికి తగినట్లుగా దర్శకుడు 'చైల్డ్ హుడ్ ఫ్రెండ్ అంటే చచ్చేంతవరకూ వుండేదని', 'మనకు బాగా కావాల్సిన వాళ్ళంటేనే ఎక్కువ కోపం వస్తుంది', బాధలో వున్నప్పుడు పక్కనే వుండి ధైర్యం చెప్పేవాడు బెస్ట్ ఫ్రెండ్, తను లేకపోతే ఏదో మిస్ అయ్యాననిపించేది లవర్' అంటూ సంభాషణలతో మెప్పించాడు. దేవీశ్రీప్రసాద్ సంగీతపరంగా గొప్పగాలేకపోయినా ఫర్వాలేదనిపిస్తాయి.
కథకు సరిపడా డ్రామాకు తక్కువ చోటిస్తూ.. స్నేహం గురించి లోతుగా చర్చిస్తూ.. మన చుట్టూ జరిగే ఓ కథలా అనిపిస్తూ.. ప్రేక్షకులు తమను తాము తెర మీద చూసుకునేలా చేసిన ప్రయత్నమిది. దాన్ని చెప్పే విధానం నత్తనడకన సాగడంతో ఓపికకు పరీక్షలా అనిపిస్తుంది. కథలోని విషయాలు కొత్తవేంకాదు. మన చుట్టూ జరిగే సంగతుల్నే తెరమీద అందంగా ఆహ్లాదంగా ఎమోషనల్‌గా చెప్పడం కొందరికే సాధ్యమయ్యే పని. 'నేను శైలజ'లో ఆ నైపుణ్యాన్ని చూపించాడు దర్శకుడు.
అనుపమ పరమేశ్వరన్ చేసిన మహా పాత్ర.. దాని చుట్టూ కథను నడిపించిన విధానం.. ఆమె పాత్రతో ముడిపడ్డ సన్నివేశాలు కథకు కీలకం. ఇద్దరు స్నేహితులు కలిసి ఒకేసారి తమ ప్రేమను ఓ అమ్మాయికి చెప్పడం కొత్తగా అనిపించే విషయం. ఐతే మొదటి భాగంతోనే సినిమా అయిపోయిందనే ఫీలింగ్ కలుగుతుంది. కానీ ద్వితీయార్థంలో ఊటీ నేపథ్యంలో సాగే పాయింట్ బలమైనదిగా లేదు. విడిపోయిన స్నేహితులు ఎలా కలుస్తారా! అని ఎదురు చూడటం తప్ప పెద్దగా ఆసక్తేమీ ఉండదు.
రామ్, శ్రీవిష్ణు మధ్య వచ్చే సన్నివేశాలు మరో ముగ్గురు స్నేహితుల్లో ప్రియదర్శి వేసే పంచ్ డైలాగ్‌లు టైంపాస్ చేయించినప్పటికీ ద్వితీయార్థం అంతగా ఆసక్తి కల్గించదు. పతాక సన్నివేశంలో కొనసాగే భావోద్వేగాలే సినిమాకు ప్రాణం. అంతవరకు ఓపిగ్గా కూర్చోవాల్సిందే. హీరోతో సమానంగా కీలక పాత్ర చేసిన శ్రీవిష్ణు కూడా చక్కగా నటించాడు. ''ఒక వ్యక్తి నచ్చితే ఎంతిష్టమో చెప్పొచ్చు. ఎంతిష్టమో చెప్పలేనపుడు అది ప్రేమ అవుతుంది'' లాంటి కొన్ని మాటలు గుర్తుండిపోతాయి. నెమ్మదిగా మనస్సును తాకే ఈ సినిమా ఫ్రెండ్‌షిప్ విలువ గురించి తెలిసినవారికి బాగా కనెక్ట్ అవుతుంది.