కమల "నేను దేన్నయినా భరిస్తాను కానీ నిర్లక్ష్యాన్ని భరించలేను" కనుక నువ్వు ఎప్పుడూ నిర్లక్ష్యంగా ప్రవర్తించేందుకు ప్రయత్నించవద్దు అన్నాడు అనిల్ శోభనం రాత్రి తన భార్యతో. అంటే మీ దృష్టిలో అలా కన్పిస్తున్నానా నేను అని సిగ్గు కల్గిన కోపంతో నొచ్చుకున్నట్లుగా అడిగింది. అలాగని కాదు మొదటి రాత్రే కదా మనం ఒకరిని గూర్చి ఒకరం పూర్తిగా అర్ధంచేసుకుని మన సంసారాన్ని సుఖంగా జరుపుకోవాలని అంటూ ఆమెను కౌగిలిలోకి తీసుకున్నాడు.
మరోవిధంగా భావించవద్దు అంటూ చెవిలో గుసగుసగా అన్నాడు. అలా జరిగిన మొదటి రాత్రేకాక ఐదు సంవత్సరాల కాలంలో ఎన్నో రాత్రులు వీరిద్దరి మధ్య జరిగాయి. అందులో ఎక్కువ రాత్రులు అనిల్ భార్యమీద నిర్లక్ష్యంగా ప్రవర్తించడం జరిగాయి. ఒంటరిగా వున్నప్పుడు, పదిముంది ముందు కూడా ఆమెను నిర్లక్ష్యంగా మాట్లాడేవారు. అయినా కమల భర్తను ఏమీ అడిగేది కాదు.
పుట్టింటి నుండి రమ్మని కబురందిన కమల వెళ్ళిన నెలరోజుల వరకూ కూడా తిరిగి రాలేదు. భార్య ఎందుకు రాలేదా? అని ఆలోచిస్తున్న అనిల్ పోస్ట్ అన్న కేకతో ఉలిక్కిపడి లెటర్ తీసుకొని ఆతృతగా చించి చదవసాగాడు.
శ్రీవారూ! నేను క్షేమం. నేను ఎందుకు రాలేదా అని ఆలోచిస్తున్నారు కదూ? మన వివాహం అయ్యి ఐదు సం.రాలు దాటింది. మన కుటుంబంలో ఎన్నో మార్పులు వచ్చాయి. మనిద్దరి మధ్య ఓ బాబు కూడా వచ్చాడు. అయినా "ఎదుటి వారికి చెప్పేందుకు నీతులు" అన్నట్లుగా వుంది మీ ప్రవర్తన. ఒంటరిగా వున్నప్పుడే కాక అందరి ముందు కూడా మీరు నా పట్ల ఎంతో నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తూ వచ్చారు.
అయినా మన సంసారం కోసం మీరు ఎప్పటికైనా మార్తారేమో అన్న ఆశతో ఎదురుచూస్తూ వచ్చానే తప్ప మిమ్నల్ని ఒక్కసారి కూడా ఎందుకిలా ప్రవర్తిస్తున్నారని అడగలేదు. ప్రస్తుతం మన బాబుకి కొంచెం కొంచెం ఊహ తెలుస్తోంది. వాడి ముందు కూడా మీరు అలా ప్రవర్తిస్తే పరిస్థితి ముందుముందు ఎలా వుంటుందో మీరే ఆలోచించండి. కనుక ప్రస్తుత పరిస్థితుల్లో "నేను దేన్నయినా భరిస్తాను కాని మీ నిర్లక్ష్యాన్ని భరించలేను" మీరు మారలేను అనుకుంటే డైవర్స్ నోటీసు పంపించండి చాలు. ఉంటాను మీ కమల. లోకమంతా తనముందే తిరిగిపోతున్నట్లుగా ఫీలవుతున్న అనిల్ వెంటనే తేరుకొని బెడ్‌రూమ్‌లోకెళ్ళి సూట్‌కేసులో బట్టలు సర్దుకోసాగాడు అత్తవారింటికి వెళ్ళేందుకు. మానసికంగా పూర్తిగా మారిన తర్వాతనే అలా వెళ్ళేందుకు సిద్ధమయ్యాడు.