అబ్బియ్యో.. దొరువులో గుడ్డికొక్కిరాయ్ అగపడిందా..?!!

FILE
తొలకరి జల్లులు. మట్టి వాసనలు. ఆ తర్వాత విత్తనాలలో వినాయకుడిని పెట్టి.. ఆపై భూమిని దున్ని విత్తులు జల్లి మొలకలకోసం ఎదురుచూడ్డాలు. మూడోనాటి నుంచి ఒక్కొక్క మొలక భూమి పొరల నుంచి తొంగిచూస్తూ 25వ రోజుకు గాలి తెరలకు తలలు ఆడిస్తూ నవ్వుతూ ఉంటుంది పైరు. ఆపై వరుణుడి కరుణతో మాగాణి భూములన్నీ తడిసి ముద్దయి నాట్లుకు సిద్ధమవుతాయ్.

ఇది ప్రతి ఏటా జరిగే తంతే. కాకపోతే భూమి ఉంది. పొలాలు ఉన్నాయ్. కానీ ఆ పొలాలే ప్రాణాలుగా జీవించిన నాటితరం కదలిపోయింది. వారితోపాటే పొలాలను నమ్ముకుని బతికిన ఎన్నో పక్షులు మాయమై పోతున్నాయ్. ఎక్కడికి పోయాయ్.. అనడిగితే.. ఇది నేను చెప్పాల్సిందే..!!

మా ఊరును ఆనుకుని ఓ పిల్లకాలువ. పేరుకు కాలువే కానీ పంటనీరు వరదలప్పుడు మాత్రమే పలుకరిస్తుంది. మిగిలిన రోజులంతా మా రైతులు దొరువులపై ఆధారపడి పంటలను పండించుకోవాల్సిందే. అట్లాంటి రోజుల్లో ఓ రోజు నేను మా పొలానికి వెళ్లాను. మా చేను వరినారు నాటి వారం రోజులయ్యింది. అప్పుడే దుబ్బు పగులుతూ వరి కుదుళ్లు బలిష్టంగా మారుతున్నాయి.

పొలంపై పురుగులను ఏరుకుని తింటూ పొలం మధ్య మల్లెపువ్వుల్లా కనబడుతున్న కొంగలను చూస్తూ చేనును ఆనుకుని ఉన్న ఓ మట్టిదిబ్బపై కూచున్నాను నేను. ఇంతలో వెనక నుంచి..." అబ్బియ్యో... నువ్వు తాతయ్యగోరి అబ్బియ్యవు గదూ.." అని ఓ గొంతు పలుకరించింది. మాధానంగా "అవును" అన్నాను.

మళ్లీ నేనే అందుకుని "ఎవర్నువ్వు..?" అని ప్రశ్నించాను. "మాది కుక్కళోళ్ల పాలెం. ఇదిగో తూరుపున ఉన్న ఆ తారు రోడ్డవకాడ కనబడతన్న సువ్వ తాటిసెట్టు (తాడిచెట్టు) ఉందే... ఆడ గనబడేదే మా వూరు. నీకు దెల్వదులే. అయ్యగోరికైతే బాగా దెల్సు. నా యిసయం ఆనక చెపతా గానీ, మీ సేను మద్దెన ఉన్న దొరువులో గుడ్డికొక్కిరాయిలేమైనా వచ్చి వాలినాయా...?"

"గుడ్డి కొక్కిరాయలా...? అంటే ఏమిటి...?"
"ఓర్నీ మడిసి సల్లగుండ. గుడ్డికొక్కిరాయంటే తెలవదా. అదిగో దూరంగా ఆ సీంతం సెట్టు మీన కూకునుంది సూడు. అదే గుడ్డికొక్కిరాయంటే" అంటూ ఓ కొంగను చూపించాడు.

"దాంతో నీకేం పని..." అని అడిగాను
"ఏం పనంటే ఏం సెప్పేది. ఆటిని బట్టుకెల్లి సంతలో అమ్మితే ఓ పదో పరకో డబ్బులొత్తయ్యి. అందుకే ఆటిని బట్టుకోడానికి మీ సేను దొరువులో వల ఏశా..." అంటూ దొరువుకేసి నడిచాడు.
"ఏయ్.. ఆగాగు.. దొరువులో దిగితే ఊరుకోను" అంటూ నేనూ వెళ్లాను. అక్కడ ఏ కొంగా వలలో పడలేదు. అంతే... ఊపిరి పీల్చుకున్నాను. అతడు మాత్రం ఉస్సూరుమన్నాడు. దూరంగా చీమచింత చెట్టుపై వాలిన కొంగపై దృష్టి పెట్టాడు.

"ఎట్టాగైనా ఒక్క గుడ్డికొక్కిరాయినైనా పట్టుకోకపోతే నా బొచ్చలో బొమ్మరాయే.." అంటూ వెళ్లిపోయాడు. అయితే అతడి సంచారాన్ని దుష్ట సంచారంగా ఆ పక్షులు గుర్తుపట్టినాయో ఏమోగానీ... ఒక్కసారిగా చెట్టుపై నుంచి తెల్లని కొంగలు పచ్చటి పొలాలపై స్వేచ్ఛగా ఎగురుతూ వెళ్లిపోయాయి.

వెబ్దునియా పై చదవండి