ఆ రుణం దీరే టైం వొచ్చిందనుకో... ఎవరాగమంటే మేత్రం ఆగుతామా ఏందీ..?

FILE
మొన్నీమధ్య పుస్తకాల కొనుగోలుకు పుస్తక రాజధాని విజయవాడకు వెళ్దామని రైలు బండెక్కా. పండుగ సీజను కావడంతో రైలు కాస్త ఖాళీగా ఉంటుందనుకున్న నా అంచనా తప్పింది. జనం కిటకిటలాడుతున్నారు. ఉదయంవేళ ఒంగోలులో బయలుదేరిన ఆ ప్యాసింజరులో నేను చీరాలలో ఎక్కాను. బండి కదిలింది.

కూర్చునేందుకు ఎక్కడైనా సీటు దొరుకుతుందేమో చూసి.. ఆ అవకాశం లేక అలా నిలబడిపోయాను. ఇంతలో బాపట్ల స్టేషను వచ్చింది. పండుగ సందడేమోగానీ అక్కడ కూలీల సందడి కనబడింది. జనం వరదలా వచ్చి రైలెక్కారు. బోగీకి మించిన జనం ఎక్కడంతో పెట్టెలో గాలి కూడా చొరపడే అవకాశం లేకపోయింది.

ఏదో ఓ వైపు హాయిగా ఊపిరి పీల్చుకునే ఖాళీ చూసుకుని అలా నిలబడ్డాను నేను. ఇంతలో ఒకామె... నన్ను తోసుకుంటూ ఓ బట్టతల దృఢకాయుని నెత్తిపై "ఠంగు" మనిపించింది. ఆ దెబ్బకు... ఆ దృఢకాయుడు మండిపడతాడేమో అనుకున్నా. కానీ అతను చాలా నిదానంగా..." ఏమ్మే.. ఎక్కడెక్కినవ్. నేను లెగత్తాను గానీ నువ్ గూకో... దా.." అని పైకి లేచాడు.

"అసలే ఉస్సూరుమంటుండావూ.. లోన గుండాన్ని దాసుకుని పైకి నీలా ఉణ్ణటం ఎవుడికి సేత కాదు.. బుల్లియ్య. ఆ... నాకు దెలవకడుకుతా... నీ పెద్దకొడుక్కేం మాయరోగం వచ్చింది. పెళ్లాం సంక నాకతా.. అది సెప్పంగాల్నే.. నిన్ను అమ్మణ్ణమ్మను వదిలేసి ఏటికవకాడకు పోయాడంట. ఉండు నేనీపాలి ఆడిదెగ్గిరికెల్లి కడిగి పారేత్తా. ఆడి పెళ్లాన్ని ఇదిలిచ్చి పారేత్తా. మడిసివి సూడ్డానికి ఏనుగులాగుండా నాలుగడుగులు దీసి యేయలేకపోతుండావని అమ్మణ్ణి సెప్పింది. అసలేంటీ టబుల్...?" అని తోటి ప్రయాణికులను పట్టించుకోకుండా మాట్లాడేసింది ఆ మహిళ.

బుల్లియ్య అనబడే అతను అందుకుని..." ఏం సేత్తాం పెమీళ. గట్టుమీన గడ్డున్నవరకే ఏ గొడ్డైనా గట్టునానుకుని ఉంటద్ది. గడ్డి లేపోతే ఇంకో గట్టుకు పోతద్ది. ఆడిననేం నా(లా)భం. నా కరమ( ఖర్మ) ఇట్టా ఏడిసింది. నిరుడు పుగనారు( పొగనారు) పోశానా... అందులో మునిగా. ఆడు మొత్తుకుంటానే ఉన్నాడు... పోయెద్దయ్యా అంటే నేనిన్నానా... పోత్తిని. సివరికి సేతిలో సిప్ప మిగిలింది.

ఆ నట్టాన్ని ఆడి నెత్తిన నేనెక్కడ ఏత్తానోనని ఆడి పెళ్లాం ఆడిని దీసకపోయింది. పోతే మాణెం. నాకేటి. ఇదిగో అమ్మెణ్ణి ఉన్నంత కేలం నాకేం గాదు. ఇక రోగమంటావా... మడిసన్నాక ఏదోక రోజు ఏదో రోగం వత్తద్ది. మిత్తవి తీసక పోతానికి ఇట్టాంటి రోగాలు. ఆటిని ఆ బెమ్మ దేవుడు గూడా ఆపలేడు. సూద్దాం భూమ్మీద నూకల్లున్నంత గాలం నా అమ్మెణ్ణికి నూకలు తెత్తా. ఆ రుణం దీరే టైం వొచ్చిందనుకో... ఎవరాగమంటే మేత్రం ఆగుతామా ఏందీ..? పోవాల్సిందే... అన్నాడు. ఇంతలో రైలు తెనాలిలో ఆగింది.

ప్రమీళ అనబడే మహిళ రైలు దిగింది. వెళ్లకుండా బయట కిటికీలోంచి తల కాస్త లోపలికి పెట్టి... "బుల్లియ్య మావా... నీకేం బేధలేదు. ఆడు బోతే బోయేడు. మా నేరేడు జెట్టు పొలంకాడ నీ ఇట్టం వచ్చిన ఎగసాయం సేసుకోవచ్చు. సుబ్బరంగా మొగుడూ పెళ్లాలిద్దరూ మాకాడకొచ్చేయండి. మా ఇంటోడు( భర్త) గూడా మొన్న శానా బేధ( బాధ) పడ్డేడు. మీ యవ్వారం తెలుసుకుని ఆళ్లనీ రమ్మని సెప్పమని జెప్పాడు" అని అంటుండగా రైలు కదిలింది.

ప్రమీళ అనబడే మహిళకు వినబడిందో లేదో కానీ బుల్లియ్య మాత్రం ఆమెను ఉద్దేశించి ఇలా అన్నాడు... "నా ఘటం ఉన్నెంత వరకూ నూకలు పండిత్తా. నా పొట్టతోపాటు నాదోబాటు ఉన్నోళ్ల పొట్టలకు పోత్తా. మూడితే.. పొద్దుతో పాటు నేను కుంగతా" అనుకుంటూ తన వెంట తెచ్చుకున్న సంచిలోని జంతికలను తన తోటి ప్రయాణికులకు ఇవ్వటం మొదలెట్టాడు.

వెబ్దునియా పై చదవండి