శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో విశిష్టంగా పరిగణించే గరుడోత్సవం అత్యంత వైభవోపేతంగా జరిగింది. తిరుమలేశుని బ్రహ్మోత్సవాల్లో ఐదో రోజైన ఆదివారం రాత్రి గరుడ వాహనంపై వెంకన్న ఊరేగే వైభవాన్ని తిలకించేందుకు లక్షలాది మంది భక్తులు తిరుమలకు తరలివచ్చారు.
సకల వేదాలకు మూలపురుషుడు, కలియుగ వైకుంఠనాథుడు మలయప్ప తన కత్యంత ఇష్టుడైన గరుత్మంతుని వాహనంగా చేసుకుని తిరుమాడ వీధుల్లో ఊరేగిన తీరు భక్తులను కనువిందు చేసింది. మూలవిరాట్టునికి మాత్రమే అలంకరించే విశేష తిరువాభరణాలతో అలంకృతుడైన వెంకన్నకు కొత్త కళ సంతరించుకుంది.
నిత్యసేవల స్వామి సన్నిధిల్లో మూలమూర్తికి మాత్రమే అలంకరించే లక్ష్మీహారం, మకరకంఠి, సహస్రనామావళి హారం, ముఖ్యమంత్రి అందజేసిన కొత్త మేల్ చాట్ వస్త్రాలంకృతులతో ముస్తాబైన శ్రీవారు కొత్తపెళ్లికొడుకు వోలే దర్శనమిచ్చారు.
బ్రహ్మోత్సవాల్లో ముఖ్య ఘట్టమైన గరుడ వాహన సేవకు లక్షలాది మంది భక్తులు తరలి వచ్చారు. గరుడోత్సవంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా కట్టుదిట్టమైన భద్రతను టీటీడీ ఏర్పాటు చేసింది.