తిరుమల బ్రహ్మోత్సవాలు: సూర్యప్రభ వాహనంపై శ్రీవారు!
FILE
శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏడో రోజైన శుక్రవారం శ్రీవారు సూర్యప్రభ వాహనంపై తిరుమాడ వీధుల్లో ఊరేగారు. సూర్యుడు ప్రకృతికి చైతన్య ప్రదాత. సూర్యప్రభ సేవలో ఆరోగ్యం, ఐశ్వర్యం సిద్ధిస్తుందని భక్తుల విశ్వాసం.
సర్వాలంకారభూషితుడైన శ్రీనివాసుడు సూర్యప్రభ వాహనంపై ఊరేగిన వైనాన్ని తిలకించేందుకు భారీ ఎత్తున భక్తులు తిరుమల కొండకు తరలివచ్చారు. సూర్యప్రభపై మలయప్ప స్వామి దర్శనం పరిపూర్ణ ఫలంగా భక్తులు భావిస్తారు.
ఏడవ రోజు ఉదయం ఏడు గుర్రాలపై భానుడు రథసారథిగా ఎర్రటిపూలమాలలు ధరించి స్వామి ఈ వాహనంపై ఊరేగారు. ప్రపంచానికి వెలుగు ప్రసాదించే సూర్యభగవానుడికి తానే ప్రతిరూపమని ఈ వాహన సేవ ద్వారా శ్రీవారు చాటి చెబుతారు. సూర్యప్రభ వాహన సందర్భంగా భజనలు, కోలాట బృందాల నృత్యాలు భక్తులను అలరించాయి.