బ్రహ్మోత్సవాలలో ఐదవరోజు ఉదయం వేంకటేశ్వర స్వామి మోహినీ రూపంలో దంతుల పల్లకిలో తిరుమాడా వీధులలో విహరించారు. హిందూ సంప్రదాయం ప్రకారం స్త్రీ ఒంటరిగా విహారానికి రాదు కాబట్టి మోహినీ రూపంలోని స్వామి వెంట శ్రీకృష్ణస్వామి మరో పల్లకిపై వచ్చారు. ఉత్సవమూర్తి నిల్చున్న భంగిమలో కాకుండా దంతపు పల్లకిలో ఆశీనులై కనిపించారు. స్త్రీలు ధరించే అన్ని రకాల ఆభరణాలను స్వామివారికి అలంకరించారు.
వరదభంగిమలో కనిపించే స్వామివారి కుడిహస్తం మోహినీ రూపంలో అభయహస్త ముద్రతో ఉంటుంది. స్వామివారికి పట్టుచీర కీరిటంపైన రత్న, ఖచితమైన సూర్యచంద్ర సావేరి, నాశికకు వజ్రఖచిత ముక్కుపుడక, బులాకి, శుంఖుచక్ర స్థానాల్లో రెండు వికసించిన స్వర్ణకమలాలు ఉన్నాయి.
బ్రహ్మోత్సవాలలో స్వామివారి వాహనసేవలన్నీ వాహనమండపం నుండి తిరుమాఢా వీధుల్లో తిరిగితే... మోహినీ అవతారం మాత్రం శ్రీవారి ఆలయం నుండి ప్రారంభమవుతుంది. బలగర్వితులు, అహాంకారులు కార్యఫలితాన్ని పొందలేరని, వినయవిధేయతలతో భగవంతుడిని ఆశ్రయించినవారే ముక్తిసోపనాలను పొందగలరని ఈ వాహనసేవలోని పరమార్థం.