శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా మలయప్పస్వామి గజవాహనారూఢుడై తిరుమాడవీధుల్లో ఊరేగి భక్తులకు కనువిందు చేశారు. గజ, తురగ, అశ్వ, పదాతి దళాలు ముందుకు సాగగా, వేలాది భక్తులు స్వామికి కర్పూర నీరాజనం సమర్పించుకున్నారు.
ఆలయంలో విశేష సమర్పణ అనంతరం స్వామి వారు వాహన మండపం చేరుకుని, దివ్యపురుషుడిగా అలంకృతమై గజవాహనాసీనుడై మాడవీధుల్లో ఊరేగిన వైనాన్ని దర్శించుకునేందుకు అశేష జన ప్రవాహిని తిరుమల కొండకు తరలి వచ్చింది.
అనాది కాలం నుంచి సుప్రసిద్ధ వాహనంగా పరిగణించబడే గజవాహనంపై స్వామి వారు ఊరేగుతూ సకల జీవరాశులను రక్షించేందుకు నేనున్నానని బోధిస్తూ వేంకటేశ్వర స్వామి భక్తులకు అభయ ప్రదానం చేశారు.
ఇక తిరుమల బ్రహ్మోత్సవాలలో భాగంగా ఐదవ రోజున శ్రీవారి ఆదాయం రూ. 2.64 కోట్లకు చేరుకుంది. గరుడోత్సవం కావడంతో తిరుమల సోమవారం కిక్కిరిసి పోయింది. ఇసుకేస్తే రాలనంత జనం తిరుమలకు చేరుకున్నారు. దీనికి అనుగుణంగా తిరుమల ఆదాయం కూడా పెరిగింది.
తిరుమల తిరుతి దేవస్థానం పరకామణి విభాగం అందిస్తున్న సమాచారం మేరకు నేరుగా శ్రీవారి హుండీకి అందిన ఆదాయం రూ. 2.23 కోట్లు కాగా, ప్రసాదాలు విక్రయం ద్వారా టిటిడికి రూ.37.44 లక్షలు లభించింది. అద్దె గదుల ద్వారా రూ. 11.63 లక్షల వచ్చింది. మొత్తంపై ఒక్క రోజులోనే రూ.2.64 కోట్ల ఆదాయం టిటిడికి ఒనగూరింది.
సోమవారం 79,774 భక్తులకు టిటిడి అధికారులు దర్శనం కల్పించారు. ఇందులో 49.5 వేల మంది తలనీలాలు సమర్పించుకున్నారు. ఆర్టీసి ద్వారా తిరుమల చేరుకున్న భక్తులు 1.11 లక్షల మంది కాగా మొత్తం దాదాపు మూడు లక్షల మంది తిరుమల గరుడోత్సవాన్ని తిలకించారు.