అల్లు అరవింద్‌కు భయమేస్తోందట... చిరుని చూశా? కొణిదెలను చూశా?

శనివారం, 14 జనవరి 2017 (20:45 IST)
చిరంజీవి సొంత నిర్మాణ సంస్థ అన్నట్లుగా అల్లు అరవింద్ గీతా ఆర్ట్స్ ఉండేది. చిరు రాజకీయ ప్రవేశం ముందటి వరకూ గీతా ఆర్ట్స్ బ్యానర్ కింద చిరు అడపాదడపా పలు సినిమాల్లో నటిస్తుండేవారు. రాజకీయ ప్రవేశం చేసిన తర్వాత ప్రజారాజ్యం, ఆ తర్వాత జరిగిన తంతు తెలిసిన విషయమే. చివరికి చిరంజీవి తన ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ పార్టీలో కలిపేసి కేంద్రమంత్రి పదవితో సరిపెట్టుకున్నారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ 2014 ఎన్నికల్లో ఘోర పరాజయం మూటగట్టుకోవడంతో కాంగ్రెస్ పార్టీ హేమాహేమీలు సైతం మౌనముద్రలోకి వెళ్లిపోయారు. ఈ గ్యాప్‌లో చిరంజీవి సినిమాలపై ఫోకస్ పెట్టారు. 
 
ఐతే రాజకీయాల్లో ఫ్లాప్ షో చూపించిన చిరును మళ్లీ తెరపై జనం చూస్తారో లేదో అనే సందేహాలను చాలామంది వ్యక్తం చేశారు. కొందరు డైరెక్టుగా చిరుపై సెటైర్లు కూడా వేశారు. చిరంజీవితో అత్యధిక సినిమాలు తీసిన దర్శకుడు కోదండరామిరెడ్డి సైతం ఇప్పటికిప్పుడు చిరంజీవితో తను చిత్రం చేయాలనుకుంటే ఏదో కామెడీ చిత్రాన్ని చేయగలనంటూ నోరు జారారు. ఆ తర్వాత క్షమాపణలు చెప్పినా జారిన మాట మళ్లీ తిరిగి రాదు కదా. ఆ తర్వాత చిరంజీవి ఖైదీ నెం. 150 లుక్స్ వస్తున్న దగ్గర్నుంచి రాంగోపాల్ వర్మ ట్విట్టర్ పిట్టతో రకరకాల కామెంట్లు పెడుతూ మెగా బ్రదర్స్‌కి ఆగ్రహం తెప్పించేశారు. నాగబాబు చేత తిట్లు కూడా తిట్టించుకున్నారు.
 
ఇలా చిరంజీవి చిత్రం విడుదలయ్యే వరకూ చిరంజీవి స్టామినా ఏమిటో, 61 ఏళ్ల చిరంజీవి యాక్టింగును జనం ఆదరిస్తారో లేదో... అనే సందేహాలను చాలామంది వ్యక్తం చేశారు. కారణాలు ఏమైతేనేం తన తండ్రి కోసం కన్నకొడుకు రాంచరణ్ కొత్తగా నిర్మాణ సంస్థను స్థాపించేశారు. మరి దీనికి కారణం వేరే ఏదయినా వున్నదేమో తెలియదు కానీ, హనుమంతుడి ఫోటోతో స్థాపించిన ఈ బ్యానర్ రాంచరణ్‌కు టాలీవుడ్‌లో ప్రారంభంలోనే టాప్ ప్రొడ్యూసర్ పేరును తెచ్చిపెట్టింది. ఒక హీరోగానే కాకుండా నిర్మాతగా కూడా కథ, దర్శకుడు, నటీనటులు... ఇలా అన్ని విషయాల ఎంపికలోనూ సక్సెస్ కొట్టిన నిర్మాతగా రాంచరణ్ పైన ప్రశంసలు కురుస్తున్నాయి. 
 
ఈ నేపధ్యంలో నెక్ట్స్ పిక్చర్ చేసేందుకు నేను రెడీ, ఐతే చిరంజీవితో సినిమా అంటే భయమేస్తోంది అని అల్లు అరవింద్ ప్రకటించారు. మరి ఇదే అభిప్రాయాన్ని చిరు 150 చిత్రం సమయంలోనూ ప్రకటించారేమో తెలియదు కానీ 151వ చిత్రాన్ని సైతం తానే నిర్మిస్తానని రాంచరణ్ కుండబద్ధలు కొట్టినట్లు చెప్పేశారు. మరి భవిష్యత్తులో అల్లు అరవింద్ ఇలానే చిరంజీవితో సినిమా చేయాలంటే భయపడుతూ ఉంటారేమో...?!!

వెబ్దునియా పై చదవండి