మనం చాలా సినిమాల్లో చూస్తుంటాం. హీరోయిన్ రౌడీ ప్రేమలో పడుతుంది. ఆ తర్వాత రౌడీ కాస్తా హీరోయిన్ కోసం మంచివాడిగా మారిపోతాడు. ఐతే ఆ తర్వాత అతడిపై వున్న రౌడీ మచ్చ తొలగిపోగా లేనిపోని సమస్యల్లో చిక్కుకుంటాడు. చివరికి ఎలాగో కథ సుఖాంతమవుతుంది. అది సినిమా. కానీ నిజ జీవితంలో రౌడీని పెళ్లి చేసుకుంటే ఏమవుతుంది. జీవితం నాశనమవుతుంది.
కానీ చెన్నైలోని తిరువేర్కాడుకు చెందిన ఇంటర్ చదువుతున్న ఓ బాలిక మాత్రం తను రౌడీ షీటర్‌ను ప్రేమించాననీ, పెళ్లంటూ చేసుకుంటే అతడినే చేసుకుంటానంటూ పట్టుబట్టింది. బాలిక తండ్రి ఆమెకి ఎంతో నచ్చచెప్పాడు. రౌడీని పెళ్లాడితే జీవితం దుర్భరం అవుతుందనీ, ఆ ఆలోచన మానుకోవాలని చెప్పినా బాలిక వినలేదు. దీనితో విషయాన్ని పోలీసులకు చేరవేశాడు.
రంగంలోకి దిగిన చెన్నై పోలీసులు కేసును చిన్నారుల సంరక్షణ చూసే అమ్మ విభాగానికి బదిలీ చేసారు. వాళ్లు బాలికను, ఆమె పేరెంట్స్‌తో పాటు రౌడీ షీటరను పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చారు. రౌడీ షీటర్ పైన ఎన్నో కేసులున్నాయనీ కనుక అతడితో ప్రేమ-పెళ్లి వద్దని చెప్పారు. దానికి బాలిక సమాధానమిస్తూ... తను పెళ్లాడి అతడిని మార్చుకుంటాననీ, తన దారిలోకి తెచ్చుకుంటానని చెప్పింది. ఈసారి తలలు పట్టుకోవడం పోలీసుల వంతైంది.