అమరావతిలో నిర్మించిన భవనాలు కూల్చివేత? మంత్రి బొత్స ఏమన్నారు?

బుధవారం, 23 అక్టోబరు 2019 (20:52 IST)
నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణంలోభాగంగా గత తెలుగుదేశం ప్రభుత్వం సీఆర్డీఏ పరిధిలో అనేక భవాలను నిర్మించారు. ఈ భవనాల నిర్మాణపు పనులు 75 శాతం మేరకు పూర్తిచేశారు. అలాగే, రాజధాని కోసం సేకరించిన 33 వేల ఎకరాల భూముల్లో రోడ్ల నిర్మాణం చేపట్టారు. పైగా, భూగర్భ డ్రైనేజీ పనులు కూడా చేపట్టారు. అయితే, గత అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ స్థానంలో వైకాపా అధికారంలోకి వచ్చింది. 
 
దీంతో అమరావతిలో రాజధాని నిర్మాణ పనులు పూర్తిగా స్తంభించిపోయాయి. పైగా, రాజధానిని మరో ప్రాంతానికి మార్చేందుకు ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి అనుకూలంగా ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. దీంతో అమరావతి రాజధాని నిర్మాణం ఇపుడు అగమ్యగోచరంగా మారింది. అలాగే, రాజధాని నిర్మాణం కోసం తమ భూములను ఇచ్చిన కృష్ణా, గుంటూరు జిల్లాల రైతుల భవిష్యత్ ఏంటన్నది ఇపుడు ప్రశ్నార్థకంగా మారింది. 
 
ఈ నేపథ్యంలో ఏపీ రాష్ట్ర పురపాలక శాఖామంత్రి బొత్స సత్యనారాయణ మరోమారు కీలక వ్యాఖ్యలు చేశారు. నిపుణుల కమిటీ ఎక్కడంటే అక్కడే రాజధాని అని తేల్చేశారు. ఫలితంగా రాజధాని ప్రాంతం మార్పు తథ్యమనే సంకేతాలు వెల్లడించారు. 
 
రాజధానికి రైతులు 33 వేల ఎకరాలు ఇచ్చారని చంద్రబాబు గొప్పలు చెప్పుకుంటున్నారని, రాజధాని కోసం లక్ష ఎకరాలు ఇవ్వడానికి కూడా ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. శాశ్వత రాజధానిని ప్రజలు కోరుకుంటున్నారని మంత్రి వ్యాఖ్యానించడం కొసమెరుపు. అమరావతిని శాశ్వత రాజధానిగా మంత్రి బొత్స పరిగణించడం లేదని తాజా వ్యాఖ్యలతో స్పష్టమైంది.
 
పైగా, ఏపీలోని 13 జిల్లాలు సమానంగా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నామని, రాజధాని ఏ ఒక్క సామాజిక వర్గానికి చెందినది కాదని బొత్స చేసిన వ్యాఖ్యలు ఏపీలో మరోసారి హాట్ టాపిక్‌గా మారాయి. అమరావతిలో ఇన్‌సైడ్ ట్రేడింగ్ జరిగిందని, త్వరలోనే ఆ వివరాలు వెల్లడిస్తామని మంత్రి తెలిపారు. 
 
ఇదిలావుంటే, రాజధానిపై ప్రభుత్వం సమీక్ష జరుపుతోందని, త్వరలోనే కీలక ప్రకటన ఉంటుందని అప్పట్లో మంత్రి చేసిన వ్యాఖ్యలు పెను దుమారానికి దారి తీసిన సంగతి తెలిసిందే. అయితే... ఈ వ్యాఖ్యలన్నీ సీఎం జగన్ పరోక్షంగా చేయిస్తున్నవేనని ప్రతిపక్షం ఆరోపిస్తోంది. రాజధాని అమరావతిలో నిర్మించడం జగన్‌కు ఇష్టం లేదని, అందుకే ఈ తరహా వ్యాఖ్యలు చేయిస్తూ ప్రజలకు రాజధాని మార్పుపై సంకేతాలిస్తున్నారని టీడీపీ ఆరోపిస్తోంది. 
 
మరోవైపు, వైకాపా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ కూడా ప్రభుత్వానికి ఓ నివేదిక సమర్పించినట్టు సమాచారం. రాజధాని నిర్మాణంలో ఇప్పటివరకు ఖర్చు చేసిన మొత్తంలో 32 వేల కోట్ల రూపాయల మేరకు దుర్వినియోగం జరిగినట్టు పేర్కొంది. అయితే, ఇప్పటికే 75 శాతం మేరకు నిర్మాణాలు పూర్తయిన భవనాల కూల్చివేత విషయంపై తుది నిర్ణయం తీసుకునే అంశాన్ని మాత్రం ప్రభుత్వానికి వదిలివేయడం గమనార్హం. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు