ఏపీ రాజధాని ఎక్కడో తేల్చాల్సింది నారాయణ కమిటీ కాదు.. అమరావతిపై బొత్స కామెంట్స్

శుక్రవారం, 18 అక్టోబరు 2019 (13:27 IST)
నవ్యాంధ్ర రాజధాని అమరావతి ఎక్కడో తేల్చాల్సింది నిపుణుల కమిటీయేగానీ, టీడీపీ ప్రభుత్వంలో పని చేసిన మంత్రి నారాయణ సారథ్యంలోని కమిటీ కాదని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత రాజధాని అమరావతి నిర్మాణ పనులు పూర్తిగా ఆగిపోయిన విషయం తెల్సిందే. పైగా, రాజధానిని మరో ప్రాంతానికి తరలించవచ్చనే ఊహాగానాలు వస్తున్నాయి. 
 
ఈ నేపథ్యంలో ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజధాని ఎలా ఉండాలి? ఎక్కడ ఉండాలి? ఏయే ప్రాంతాల అభివృద్ధికి ఎటువంటి చర్యలు చేపట్టాలనే అంశాలపై అధ్యయనానికి నిపుణుల కమిటీని ఏర్పాటు చేసినట్టు తెలిపారు. మరో మూడు నాలుగు రోజుల్లో కమిటీ తన పని ప్రారంభిస్తుందని, రాష్ట్రమంతా పర్యటించి నివేదిక రూపొందిస్తుందని తెలిపారు.  
 
కమిటీ నివేదికపై క్యాబినెట్‌లో చర్చించి, ప్రజాభిప్రాయం ప్రకారం రాజధాని నిర్మాణంపై నిర్ణయం తీసుకుంటామని మంత్రి తెలిపారు. హైకోర్టు ఏర్పాటుపై వస్తున్న డిమాండ్లను కూడా ఈ కమిటీ పరిశీలిస్తుందని పేర్కొన్నారు. అప్పటి మంత్రి పి.నారాయణ నేతృత్వంలోని కమిటీ ఇచ్చిన సిఫార్సులతోనే అమరావతిలో రాజధానిని ఏర్పాటు చేశారని బొత్స విమర్శించారు. శివరామకృష్ణన్ కమిటీ నివేదికను అప్పటి ప్రభుత్వం పట్టించుకోలేదని ఆరోపించారు. 
 
అమరావతి ప్రాంతంలో భవనం నిర్మించాలంటే దాదాపు 100 అడుగుల లోతులో పునాది తవ్వాల్సి ఉంటుందని, దీనివల్ల ప్రజాధనం దుర్వినియోగం అవడమే కాకుండా అవినీతి కూడా జరిగిందన్నారు. అమరావతిలో నిలిచిపోయిన పనుల్లో అవసరమైన వాటిని చేపట్టి, లేని వాటిని ఆపేస్తామని బొత్స స్పష్టం చేశారు. అలాగే, పట్టణ ప్రాంతాల్లోని పేదల కోసం అప్పటి ప్రభుత్వం చేపట్టిన ఇళ్ల నిర్మాణ వ్యయం అధికంగా ఉందని, కాబట్టి పునాది దశలో ఉన్న 50 వేల ఇళ్ల విషయంలో రివర్స్ టెండరింగ్‌కు వెళ్తామని మంత్రి తెలిపారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు